సిరియాలో మళ్లీ నరమేథం.. శిథిలాల్లో చిన్నారులు.. వైరల్ అవుతున్న ఫోటో

| Edited By:

Jul 27, 2019 | 12:17 PM

సిరియాలో జరుగుతున్న మారణహోమానికి మరో సాక్ష్యం ఇది. జిహాదీ గ్రూపులే లక్ష్యంగా సాగుతున్న బాంబు దాడుల్లో వేలాది మంది సామాన్యపౌరులు, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. పాపం పుణ్యం తెలియని చిన్నారులు సిరియా దాడుల బీభత్సంలో ఏ విధంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫోటో కళ్లకు కడుతోంది. సిరియాలోని పశ్చిమ ప్రావిన్స్ లోని అరియా పట్టణంలో జరిగిన వైమానిక దాడుల్లో ఎన్నో ఇళ్లు నేలకూలాయి. ఇలా నేలమట్టమైన ఓ ఇంటి శిధిలాల కింద ముగ్గురు […]

సిరియాలో మళ్లీ నరమేథం.. శిథిలాల్లో చిన్నారులు.. వైరల్ అవుతున్న ఫోటో
Follow us on

సిరియాలో జరుగుతున్న మారణహోమానికి మరో సాక్ష్యం ఇది. జిహాదీ గ్రూపులే లక్ష్యంగా సాగుతున్న బాంబు దాడుల్లో వేలాది మంది సామాన్యపౌరులు, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. పాపం పుణ్యం తెలియని చిన్నారులు సిరియా దాడుల బీభత్సంలో ఏ విధంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫోటో కళ్లకు కడుతోంది. సిరియాలోని పశ్చిమ ప్రావిన్స్ లోని అరియా పట్టణంలో జరిగిన వైమానిక దాడుల్లో ఎన్నో ఇళ్లు నేలకూలాయి. ఇలా నేలమట్టమైన ఓ ఇంటి శిధిలాల కింద ముగ్గురు చిన్నారులు ఇరుక్కుపోయారు. వీరిలో ఒక చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తమ చిట్టి ప్రాణాలు దక్కించుకునేందుకు నానా ప్రయాసపడ్డారు. హృదయాన్ని ద్రవింపజేసేలా ఉన్నఈ ఫోటోను ఎస్‌వై 24 అనే స్ధానిక వెబ్ న్యూస్‌కు చెందిన బషర్ అల్ షేక్ అనే ఫోటోగ్రాఫర్ తీశాడు.

ముగ్గురు చిన్నారులను రక్షించేందుకు ఓ వ్యక్తి కన్నీరు పెడుతూ రక్షించాలని గట్టిగా అరుస్తున్న దృశ్యం హృదయ విదారకంగా ఉంది. చూడటానికే గుండెలు పిండేసేలా ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే ఈ చిన్నారులు ముగ్గురిని శిధిలాలనుంచి బయటికి తీసి దగ్గర్లోగల హస్పిటల్‌కు తరలించారు. ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరు మాత్రమే కొనఊపిరితో ప్రస్తుతం కొట్టుమిట్టాడుతున్నారని.. వీరికి వైద్య సేవలందిస్తున్న ఇస్మాయిల్ అనే వైద్యుడు తెలిపాడు. రిహామ్ అల్ అబ్దుల్లా(5) శిధిలాల కిందే మృతి చెందగా.. ఏడు నెలల చిన్నారి తౌకా తలకు తీవ్రమైన గాయాలతో ప్రస్తుతం ఐసీయులో చికిత్స పొందుతోంది. మరో చిన్నారి దాలియాకు ఛాతి భాగానికి తీవ్రంగా గాయాలు కావడంతో శస్త్ర చికిత్స చేసినట్టు డాక్టర్ ఇస్మాయిల్ చెప్పారు. గాయపడ్డ చిన్నారులతో కలిపి వీరి కుటుంబంలో మొత్తం 8 మంది ఉన్నారు.

అరియా ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారనే ఆరోపణలపై ఇక్కడ అధికంగా దాడులు జరుగుతున్నాయి. అయితే 2011 నుంచి సిరియాపై జరిగిన దాడుల్లో ఇప్పటివరకు దాదాపు 3,70,000 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చిన్నారులు కూడా అధికంగా ఉండటం విచారకరం.