Sri Lanka Crisis: షాకింగ్ ప్రకటన చేసిన శ్రీలంక మంత్రి.. రోడ్లపై బారులు తీరిన జనాలు..!

|

Jun 17, 2022 | 6:07 AM

Sri Lanka Crisis: ఏడు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా పెను ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది శ్రీలంక. విదేశీ మారక నిల్వలు సరిపడా లేక దిగుమతులకు కూడా డబ్బులు

Sri Lanka Crisis: షాకింగ్ ప్రకటన చేసిన శ్రీలంక మంత్రి.. రోడ్లపై బారులు తీరిన జనాలు..!
Sri Lanka Crisis
Follow us on

Sri Lanka Crisis: ఏడు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా పెను ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది శ్రీలంక. విదేశీ మారక నిల్వలు సరిపడా లేక దిగుమతులకు కూడా డబ్బులు చెల్లించలేని దుస్థితిలో పడిపోయింది. దాంతో నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి. కొన్ని నెలలుగా ప్రజల ఆందోళనలు, ఆకలి కేకలు లంకలో మిన్నంటుతున్నాయి. ఇలాంటి సమంయలో శ్రీలంక ఇంధన శాఖ మంత్రి బాంబు పేల్చారు. ఇక ఐదు రోజులకు సరిపడా ఇంధన నిల్వలు మాత్రమే ఉన్నాయని ప్రకటించారు. ఇప్పటికే భారీగా పెరిగిన పెట్రోలు, డీజిల్‌ రేట్లతో జనం నానా అగచాట్లు పడుతున్నారు. రికార్డు స్థాయికి పెరిగిన పెట్రోలు ధరలకు తోడు అక్కడి ప్రభుత్వ ఆంక్షలు సామాన్య జనానికి చుక్కలు చూపిస్తున్నాయి.

మరోవైపు, పెట్రోలు బంకుల దగ్గర జనం భారీగా క్యూ కడుతున్నారు. ఒక దశలో బంక్‌ల వద్దకు రావద్దని ప్రజలకు సూచించింది శ్రీలంక ప్రభుత్వం. ప్రస్తుతం భారత ప్రభుత్వం నుంచి కొత్త 500 మిలియన్‌ డాలర్ల క్రెడిట్‌ లైన్‌ కోసం ఎదురుచూస్తోంది సింహళ దేశం. ఈ మేరకు ఇండియా నుంచి అధికారిక ప్రకటన కోసం నిరీక్షిస్తున్నట్టు చెబుతున్నారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు భారత్‌ అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు మూడు బిలియన్‌ డాలర్ల సాయం అందించింది. అలాగే పెట్రోల్‌, డీజిల్‌ కోసం రష్యా సహా పలు దేశాలను శ్రీలంక ఆశ్రయించింది. రెండు మూడు రోజుల్లో ఓ పెట్రోల్‌ షిప్‌మెంట్‌, వారంలో మరో రెండు షిప్‌మెంట్లు వస్తాయని, దాంతో ప్రస్తుతానికి గట్టెక్కుతామని శ్రీలంక ఆశలు పెట్టుకుంది.