
హైదరాబాద్ / బోస్టన్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలంగాణ విద్యార్థిని అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. నల్లగొండ జిల్లా కనగల్ మండలం శాబ్దులాపురం గ్రామానికి చెందిన కోయ శ్రీజ రెడ్డి బోస్టన్‌లో అదృశ్యమై 13 రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో శ్రీజ కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
శ్రీజ రెడ్డి ఏడాది క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. ప్రస్తుతం బోస్టన్‌లో ఎంఎస్ఈ (MSE) చదువుతూ, పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నారు. నవంబర్ 2 (సోమవారం) రాత్రి సుమారు 9.45 గంటల సమయంలో బోస్టన్‌లోని ఎడిసన్ గ్రీన్‌లో ఉన్న తన నివాసం నుంచి బయటకు వెళ్లిన శ్రీజ తిరిగి ఇంటికి రాలేదు. స్నేహితులు ఎంత ప్రయత్నించినా ఆమె ఫోన్ కాల్స్‌కు స్పందన లేకపోవడంతో నవంబర్ 3న బోస్టన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవంబర్ 4న పోలీసులు ‘మిస్సింగ్ పర్సన్ అలర్ట్’తో పాటు పోస్టర్లను విడుదల చేశారు.
శ్రీజ మొబైల్ ఫోన్ చివరి లొకేషన్ ఆధారంగా పోలీసులు కార్సన్ బీచ్ (Carson Beach), హార్బర్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలించారు. అదృశ్యం కావడానికి ముందు ఆమె చివరిసారిగా ఎవరితోనైనా మాట్లాడారా? అనే కోణంలోనూ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.
కూతురు కనిపించడం లేదన్న వార్తతో ఆందోళన చెందిన శ్రీజ తల్లిదండ్రులు అమెరికాకు చేరుకున్నారు. తమ కుమార్తెను ఎలాగైనా సురక్షితంగా వెతికి తీసుకురావాలని బోస్టన్ పోలీసులను కన్నీళ్లతో వేడుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం బోస్టన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ శ్రీజ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ క్లిష్ట సమయంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, ఆమె ఆచూకీ కోసం అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని వారికి భరోసా ఇచ్చారు.