Sheikh Hasina: ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామా.. సైనికపాలన దిశగా బంగ్లాదేశ్‌..

|

Aug 05, 2024 | 4:10 PM

బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. షేక్‌ హసీనా రాజీనామా చేయాలంటూ గత కొంతకాలంగా విద్యార్ధులు భారీ ఆందోళన చేపట్టారు. ఆదివారం చెలరేగిన అల్లర్లలో 100 మందికి పైగా చనిపోయారు.

Sheikh Hasina: ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామా.. సైనికపాలన దిశగా బంగ్లాదేశ్‌..
Sheikh Hasina
Follow us on

బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. షేక్‌ హసీనా రాజీనామా చేయాలంటూ గత కొంతకాలంగా విద్యార్ధులు భారీ ఆందోళన చేపట్టారు. ఆదివారం చెలరేగిన అల్లర్లలో 100 మందికి పైగా చనిపోయారు. హింసలో ఇప్పటివరకు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. శాంతిభద్రతలు అదుపు తప్పడంతో వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని షేక్‌ హసీనాకు బంగ్లా సైన్యం డెడ్‌లైన్‌ విధించింది. సైన్యం ఇచ్చిన 45 నిముషాల డెడ్‌లైన్‌ లోపే ఆమె తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా ప్రకటనకు ముందు  షేక్ హసీనా ఢాకా ప్యాలెస్ నుంచి తన సోదరి గణభబన్ తో కలిసి సురక్షిత ప్రదేశానికి బయలుదేరినట్లు వార్తా సంస్థ AFP సోమవారం నివేదించింది. బంగ్లాదేశ్‌ నుంచి పారిపోయిన షేక్‌ హసీనాకు భారత్‌లో ఆశ్రయం లభించింది. హసీనా ఢాకా నుంచి అగర్తలా (త్రిపుర) కు పయనమయ్యారు.

హసీనా ఇంటి దగ్గర సైన్యం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ.. ఆందోళనకారులు.. అక్కడికి చేరుకుని రాళ్లు రువ్వారు..దీంతోపాటు ప్రధాని కార్యాలయానికి నిప్పు పెట్టారు. బంగ్లాదేశ్ లో తాజా పరిస్థితుల నేపథ్యంలో శాంతిభద్రతల విధుల నుంచి పోలీసులను తప్పించి ఆర్మీ ఆ బాధ్యతలను చేపట్టింది. దేశమంతా కర్ఫ్యూ విధించారు.

కాగా.. ఆదివారం చెలరేగిన అల్లర్లలో ఆందోళనకారులు మంత్రుల ఇళ్లకు, ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పుపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో బంగ్లా అమరవీరుల కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రధాని షేక్‌ హసీనా తీసుకున్న నిర్ణయం చిచ్చురేపింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశమంతటా ఆందోళనలు చెలరేగాయి. ఆదివారం ఆందోళన మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. దాదాపు 100 మంది వరకు మరణించారు.

దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన ఘర్షణలు తర్వాత హసీనా రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చేందుకు, దేశవ్యాప్తంగా కర్ఫ్యూను ధిక్కరిస్తూ విద్యార్థి సంఘాలు రాజధాని ఢాకాకు మార్చ్‌కు పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఢాకాకు చేరుకుని.. ప్రధాని నివాసం చుట్టుముట్టి రాళ్లు రువ్వారు..పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో హసీనా తన పదవికి రాజీనామా ప్రకటించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..