
ప్రధాని నరేంద్ర మోదీ ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో అడుగుపెట్టారు. ఆసియాన్-భారత్, తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు సోమవారం ఆయన అక్కడికి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంగళవారం జరగనున్న క్వాడ్ దేశాల అధినేతల సమావేశంపై ప్రపంచ దేశాల దృష్టి నెలకొంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రత, ఆర్థిక సహకారం, వాణిజ్య మార్గాల రక్షణ వంటి అంశాలు ఈ భేటీలో ప్రధానంగా చర్చకు రానున్నాయి.
మంగళవారం జరిగే ఏడో క్వాడ్ లీడర్స్ సమిట్‌లో ప్రధాని మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని సనాయే తకాయిచి పాల్గొననున్నారు. రెండేళ్లకు పైగా విరామం తర్వాత నాలుగు దేశాల అధినేతలు ఒకే వేదికపై సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో కీలక ఖనిజాలు, సరఫరా వ్యవస్థల భద్రత, సముద్ర మార్గాల పర్యవేక్షణ, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వాణిజ్య నౌకల రక్షణపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, రక్షణ రంగానికి అవసరమైన ఖనిజాల సరఫరాలో ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడంపై నాలుగు దేశాలు దృష్టి పెట్టనున్నాయి.
చైనా పర్యటనకు ముందు ట్రంప్ కీలక భేటీ
మనీలాలో క్వాడ్ సమావేశం ముగిసిన కొద్ది రోజులకే ట్రంప్ చైనాలో పర్యటించనున్నారు. ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార వేదిక (ఏపీఈసీ) సదస్సులో పాల్గొనడంతో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఆయన భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో మనీలాలో జరిగే క్వాడ్ సమావేశానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. అయితే క్వాడ్ ఏ ఒక్క దేశానికి వ్యతిరేకంగా ఏర్పడిన కూటమి కాదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. చైనాను లక్ష్యంగా చేసుకుని ఈ కూటమి పనిచేయడం లేదని ఆయన పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడమే క్వాడ్ లక్ష్యమని వెల్లడించారు.
భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో కూడిన క్వాడ్ ప్రయాణం 2004లో హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ తర్వాత ప్రారంభమైంది. ఆ సమయంలో బాధిత దేశాలకు ఈ నాలుగు దేశాలు కలిసి సహాయక చర్యలు చేపట్టాయి. 2007లో తొలిసారి అధికారిక స్థాయిలో సమావేశమయ్యాయి. కొంతకాలం మందగించిన ఈ కూటమి.. 2017లో మళ్లీ క్రియాశీలమైంది. 2021లో క్వాడ్ సమావేశాలు దేశాధినేతల స్థాయికి చేరాయి. అదే ఏడాది మార్చి 12న తొలి వర్చువల్ శిఖరాగ్ర సమావేశం జరిగింది. అప్పటి నుంచి సంప్రదాయ భద్రతా అంశాలకే పరిమితం కాకుండా సాంకేతికత, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య భద్రత, విపత్తుల సమయంలో సహకారం వంటి అంశాలకూ క్వాడ్ తన కార్యాచరణను విస్తరించింది.
2024 సెప్టెంబర్ 21న అమెరికాలోని విల్మింగ్టన్లో చివరిసారిగా క్వాడ్ దేశాధినేతల సమావేశం జరిగింది. 2025లో భారత్‌లో జరగాల్సిన తదుపరి సమావేశం నిర్వహణకు నోచుకోలేదు. దీంతో మనీలాలో జరిగే భేటీ నాలుగు దేశాల మధ్య సహకారాన్ని సమీక్షించుకోవడానికి కీలక వేదికగా మారనుంది. 2021లో ఈ స్థాయి సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి క్వాడ్ లీడర్స్ సమిట్‌కు హాజరైన ఏకైక నేత ప్రధాని మోదీ కావడం విశేషం.
క్వాడ్ ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టి సారిస్తోంది. సముద్ర, అంతర్జాతీయ భద్రత; ఆర్థిక అభివృద్ధి, భద్రత; కీలక, ఆధునిక సాంకేతికతలు; మానవతా సహాయం, విపత్తుల నిర్వహణ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. సముద్ర భద్రతలో భాగంగా ఇండో-పసిఫిక్ పార్ట్నర్షిప్ ఫర్ మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ (IPMDA) కార్యక్రమం కీలకంగా ఉంది. దీని ద్వారా సముద్రంలో అనుమానాస్పద కదలికలను గుర్తించడం, నౌకల రాకపోకలను పర్యవేక్షించడం, తీర ప్రాంత దేశాలకు సముద్ర కార్యకలాపాలపై మెరుగైన సమాచారం అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే కీలక ఖనిజాల సరఫరా, ఓడరేవుల అభివృద్ధి, వాణిజ్య అనుసంధానంపై కూడా క్వాడ్ దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఇనిషియేటివ్, పోర్ట్స్ ఆఫ్ ది ఫ్యూచర్ పార్ట్నర్షిప్ వంటి కార్యక్రమాలు ఇందులో భాగంగా ఉన్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సెమీకండక్టర్లు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, సైబర్ భద్రత వంటి సాంకేతిక రంగాల్లోనూ సహకారాన్ని పెంచుకోవాలని నాలుగు దేశాలు భావిస్తున్నాయి. ఆరోగ్య భద్రత, క్యాన్సర్ నివారణ, విపత్తుల సమయంలో సహాయక చర్యల కోసం కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి.
మోదీ పర్యటన కేవలం క్వాడ్ సమావేశానికే పరిమితం కాదు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్తోనూ ఆయన చర్చలు జరపనున్నారు. ఈ ఏడాది ఆసియాన్ అధ్యక్ష బాధ్యతలు ఫిలిప్పీన్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఉంది.
రక్షణ రంగ సహకారం, సముద్ర భద్రత, వాణిజ్యం, రవాణా అనుసంధానం వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా-ఫిలిప్పీన్స్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ సమావేశం జరగడం గమనార్హం. 2025 ఆగస్టులో మార్కోస్ భారత్‌లో పర్యటించిన సమయంలో ఇరు దేశాల సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లాయి. అప్పటి నుంచి రక్షణ రంగంలో సహకారం మరింత పెరిగింది.
2022లో భారత్‌తో కుదుర్చుకున్న 375 మిలియన్ డాలర్ల ఒప్పందం ప్రకారం ఫిలిప్పీన్స్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను కొనుగోలు చేసింది. ఈ క్షిపణులను కొనుగోలు చేసిన తొలి విదేశీ దేశం ఫిలిప్పీన్సే. 2024 ఏప్రిల్‌లో తొలి విడత క్షిపణులు ఆ దేశానికి చేరుకున్నాయి. భారత్ రక్షణ ఎగుమతులను పెంచుకునే ప్రయత్నంలో ఇది కీలక పరిణామంగా నిలిచింది.
మరోవైపు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతోనూ ఫిలిప్పీన్స్ సముద్ర భద్రత విషయంలో కలిసి పనిచేస్తోంది. ఈ దేశాలతో నిర్వహిస్తున్న ఉమ్మడి సముద్ర కార్యకలాపాలను అనధికారికంగా ‘స్క్వాడ్’ అని పిలుస్తున్నారు. ఫిలిప్పీన్స్ క్వాడ్‌లో సభ్య దేశం కాకపోయినా.. ఈ నాలుగు దేశాలతోనూ పెరుగుతున్న సంబంధాలు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో దాని ప్రాధాన్యతను పెంచుతున్నాయి.
భారత్‌కు ఆసియాన్ దేశాలతో సంబంధాలు ఎంతో ముఖ్యమని ప్రధాని మోదీ తన పర్యటనకు ముందు పేర్కొన్నారు. భారత్ అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ విధానంలో ఆసియాన్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. అలాగే ప్రాంతీయ భద్రత, అభివృద్ధి కోసం భారత్ ముందుకు తీసుకొస్తున్న ‘మహాసాగర్’ (MAHASAGAR) దార్శనికతలోనూ ఆసియాన్‌కు ప్రాధాన్యత ఉందన్నారు.
శతాబ్దాలుగా కొనసాగుతున్న సాంస్కృతిక సంబంధాలు.. ఇప్పుడు వాణిజ్యం, రవాణా, సముద్ర భద్రత, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాల రూపంలో మరింత బలపడుతున్నాయని మోదీ పేర్కొన్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై చర్చించేందుకు తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం కూడా కీలక వేదిక అని తెలిపారు.
సోమవారం ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మార్కోస్ ఏర్పాటు చేసిన విందుకు మోదీ సంప్రదాయ ఫిలిప్పీన్స్ పురుషుల దుస్తులైన ‘బరోంగ్ తగాలోంగ్’ ధరించి హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. మంగళవారం జరిగిన క్వాడ్ నేతల సమావేశం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీని ప్రశంసించారు. మోదీ పక్కనే నిలబడి మాట్లాడుతూ.. “మోదీ గట్టి మనిషి” అని వ్యాఖ్యానించారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు సమావేశంలో ప్రత్యేకంగా నిలిచాయి.
మొత్తంగా చూస్తే.. మనీలాలో జరిగే ఈ సమావేశాలు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత, ఆర్థిక సహకారంపై క్వాడ్ దేశాల తదుపరి కార్యాచరణకు దిశానిర్దేశం చేయనున్నాయి. అదే సమయంలో ఆసియాన్ దేశాలతో భారత్ తన సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ పర్యటన వేదికగా మారనుంది.