
ప్రకృతి ఎన్నో వింతలు విశేషాలను తనలో దాచుకుంది. అరుదైన విచిత్రమైన ఆ వింతల్ని చూసినప్పుడు ఒకింత థ్రిల్ కలుగుతుంది. నేరుగా చూసినవారు గూస్ బంప్స్ వచ్చినట్లు తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నట్లు చెప్పడం జరిగింది . థాయ్ లాండ్ లో ఆ వింతను చూడటానికి జనం ఎగబడుతున్నారు.
థాయిలాండ్ దేశంలోని ‘బుఎంగ్ కాన్’ సరిహద్దుల్లో ఉన్న ఫు లాంగ్కా నేషనల్ పార్క్ పరిధిలోని ‘నాకా కేవ్’ గుహల్లో ఆ అద్భుతం వెలుగు చూసింది. థాయ్‌లాండ్‌లోని ఆ ప్రాంతం సాధారణ కొండ ప్రాంతం కాదు… మూఢనమ్మకాలు, పురాణ గాథలు ముడిపడి ఉన్న రహస్య ప్రదేశం! అక్కడ ఉన్నట్టుండి ఒక రాక్షస కన్ను ఆకృతి ప్రత్యక్షమైంది! చూసే కొద్దీ భయం, ఆశ్చర్యం కలిగించే ఆ వింత దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది! వర్షాకాలం ప్రారంభం కాగానే, అక్కడ కొండరాతిపై ఒక రాక్షస పరిమాణంలో కన్ను ప్రత్యక్షమైంది. దానిని చూసిన స్థానికులు “నాగా ఐ” అనీ ‘నాగదేవత కన్ను’ అనీ పిలుచుకుంటున్నారు.
కొన్ని శతాబ్దాలుగా జరిగిన రాళ్ల రాపిడి వల్ల సహజసిద్ధమైన రాతి గుంట ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు అంటున్నారు. 1.5 నుంచి 2 మీటర్ల లోతు ఉన్న ఆ రాతి గుంటలో వర్షపు నీరు చేరగానే వింత పరిణామం చోటుచేసుకుంది.
మే నుంచి అక్టోబర్ నెలల మధ్య, సూర్యరశ్మి సరైన కోణంలో ఆ నీటిపై పడినప్పుడు… కాంతి పరావర్తనం చెంది దట్టమైన పర్వతం మధ్యలో ఒక పెద్ద ‘కన్ను’ తెరుచుకున్నట్లుగా కనిపించింది! అక్టోబర్ దాటిన తర్వాత నీటి మట్టం తగ్గి, చెట్ల ఆకులు అందులో పడి ఆ దృశ్యం మెల్లమెల్లగా అదృశ్యమయ్యే అవకాశం ఉందని అన్నారు . అంటే ఏడాదిలో కొన్ని నెలలు మాత్రమే కనిపిస్తూ, మిగతా సమయం మాయమయ్యే ఈ ప్రకృతి మాయాజాలాన్ని చూడటానికి పర్యాటకులు ఎగబడుతున్నారు. నాకా కేవ్ ట్రైల్ ద్వారా ఈ ప్రదేశానికి చేరుకుంటున్నారు. అయితే, ఈ అరుదైన సహజ నిర్మాణాన్ని తాకవవద్దని, ఎలాంటి నష్టం కలిగించవద్దని అధికారులు పర్యాటకులను హెచ్చరిస్తున్నారు.