Bangladesh: బంగ్లాదేశ్ నుండి షేక్ హసీనా బహిష్కరణపై స్పందించిన ముహమ్మద్ యూనస్..!

|

Aug 13, 2024 | 10:55 AM

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్ మరోసారి మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో రాక్షస పాలన అంతం అయ్యిందంటూ కామెంట్ చేశారు.

Bangladesh: బంగ్లాదేశ్ నుండి షేక్ హసీనా బహిష్కరణపై స్పందించిన ముహమ్మద్ యూనస్..!
Muhammad Yunus
Follow us on

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్ మరోసారి మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో రాక్షస పాలన అంతం అయ్యిందంటూ కామెంట్ చేశారు. అలాగే, షేక్ హసీనా రాజీనామా చేసి, దేశం విడిచి పారిపోవడానికి కారణమైన నిరసనకారులు, విద్యార్థులను ముహమ్మద్ యూనస్ అభినందించారు. విద్యార్థులతో సమావేశమైన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యార్థుల నేతృత్వంలోని విప్లవం మొత్తం ప్రభుత్వాన్ని కూల్చివేసిందన్నారు. విద్యార్థులను గౌరవిస్తాను, ఆరాధిస్తాను. వారు సాధించినది నిజంగా సాటిలేనిదని కొనియాడారు. తాత్కాలిక పరిపాలన బాధ్యతలు స్వీకరించమని కోరినందున, అంగీకరిస్తున్నానని ముహమ్మద్ యూనస్ పేర్కొన్నారు. దేశంలో రాక్షస పాలన పోయిందని, ప్రతిపక్షాలు అన్ని ఏకమై నిరంకుశ పాలనకు ముగింపు పలికారన్నారు.

షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఏకంగా ప్రధానమంత్రి నివాసాన్నే ముట్టడించారు. షేక్ హసీనాను రాజీనామా చేసి, దేశం విడిచి వెళ్లాలంటూ విద్యార్థి నాయకులు అల్టిమేటం జారీ చేశారు. ఆ తర్వాత, బహిష్కరించిన ప్రధాన మంత్రి షేక్ హసీనాకు సన్నిహితంగా ఉన్న ఉన్నత స్థాయి అధికారుల చేత సైతం, ప్రధాన న్యాయమూర్తి ఒబైదుల్ హసన్‌ చేత రాజీనామాలు చేయించారు. ఈ నేపథ్యంలోనే చట్టబద్దమైన పాలన సాగించేందుకు కృషీ చేస్తానని యూనస్ తెలిపారు. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని పునరుద్ధరించడమే తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని ఆయన అన్నారు. మరోవైపు సయ్యద్ రెఫాత్ అహ్మద్ పేరును నిరసనల విద్యార్థి నాయకులు ప్రతిపాదించడంతో బంగ్లాదేశ్ కొత్త ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇదిలావుండగా, బంగ్లాదేశ్‌లో వారంరోజుల హింసలో విద్యార్థులు, పోలీసు అధికారులు సహా 300 మందికి పైగా చనిపోయారు.

నోబెల్ బహుమతి గ్రహీత అయిన ముహమ్మద్ యూనస్ 2008లో హసీనాతో ఇబ్బందుల్లో పడ్డారు. ఆమె పరిపాలన అతనిపై అతని గ్రామీణ బ్యాంకుపై వరుస విచారణలు ప్రారంభించింది. అతని నోబెల్ బహుమతి, ఒక పుస్తకం నుండి రాయల్టీలతో సహా ప్రభుత్వ అనుమతి లేకుండా డబ్బు అందుకున్న ఆరోపణలపై 2013లో ఆయనపై విచారణ జరిగింది. అయితే యూనస్ ఈ ఆరోపణలను ఖండించారు. అతని మద్దతుదారులు హసీనాతో అతని అతిశీతలమైన సంబంధాల కారణంగా అతన్ని లక్ష్యంగా చేసుకున్నారని బంగ్లాదేశీలు భావిస్తున్నారు.

మరోవైపు బంగ్లాదేశ్‌లో మహ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో కొత్త సర్కార్‌ ఏర్పాటైనప్పటికి ఢాకాతో సహా పలు నగరాల్లో హిందువులు ఇళ్లపై దాడులు యధేచ్చగా కొనసాగుతున్నాయి. ఆలయాలను కూడా అల్లరిమూకలు టార్గెట్‌ చేస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. హిందువులకు తగిన రక్షణ కల్పించాలని కేంద్రం మరోసారి బంగ్లా ప్రభుత్వాన్ని కోరింది. వైమానిక స్థావరం ఏర్పాటుకు సెయింటు మార్టిన్‌ ద్వీపాన్ని ఇవ్వన్నందుకే బంగ్లాదేశ్‌లో అమెరికా తన ప్రభుత్వాన్ని కూల్చిందని మాజీ ప్రధాని షేక్‌ హసీనా తీవ్ర ఆరోపణలు చేశారు.

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..