
నాలుగు నెలల క్రితం అదృశ్యమైన 15 ఏళ్ల బాలిక.. చివరకు రెండు నెలల పసికందుతో కలిసి ఓ దట్టమైన అడవిలోని గుహలో కనిపించింది. కనీస సౌకర్యాలు లేని ఆ గుహలోనే ఆమె బిడ్డకు జన్మనిచ్చినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీలంకలో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
శ్రీలంకలోని ఉడుదుంబర పరిధిలో ఉన్న ఓ గ్రామానికి చెందిన బాలిక జులై 13న అదృశ్యమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అప్పటి నుంచి ఆమె కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో నవంబర్ 14న నకిల్స్ పర్వత ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో బాలిక ఆచూకీ లభించింది. అయితే ఆమె ఒంటరిగా లేదు.. రెండు నెలల పసికందుతో కలిసి ఓ గుహలో నివసిస్తోంది.
పోలీసుల దర్యాప్తులో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు సమీపంలోని దుకాణంలో భారీ మొత్తంలో బియ్యం, ఇతర ఆహార పదార్థాలు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి కదలికలపై అనుమానం వచ్చి వెంబడించగా.. జనావాసాలకు దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ షీట్లతో కప్పిన ఓ గుహ కనిపించింది. లోపలికి వెళ్లి చూడగా.. ఆ బాలిక తన పసికందుతో కనిపించింది.
ఆ గుహలోనే ఎలాంటి వైద్య సహాయం లేకుండా బాలిక ప్రసవించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో శిశువుకు తండ్రిగా భావిస్తున్న 23 ఏళ్ల యువకుడితో పాటు, అతడికి సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ బంధువును పోలీసులు అరెస్టు చేశారు. బాలిక పరిస్థితి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నాలుగు నెలలుగా కనిపించకుండా పోయిన బాలిక.. చివరకు పసికందుతో అడవిలోని గుహలో కనిపించడంతో ఈ ఘటన శ్రీలంకలో చర్చనీయాంశంగా మారింది.