
అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో టెహ్రాన్ నుంచి వచ్చిన ఒక వీడియో కలకలం రేపుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లుగా భావిస్తున్న ఈ వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఇందులో ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ఆమె కుమారుడు బారన్ ట్రంప్‌లకు బెదిరింపులు ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామం అమెరికా భద్రతా వర్గాల్లో ఆందోళనకు దారితీసింది.
“వేర్ టు కిల్ మెలానియా” అనే శీర్షికతో ప్రచారం చేసినట్లు చెబుతున్న ఈ వీడియోలో, మెలానియా ట్రంప్ న్యూయార్క్ నగరంలో ప్రయాణించే దృశ్యాలను చూపించినట్లు సమాచారం. ఆమె కాన్వాయ్ కదలికలు, తరచూ సందర్శించే విలాసవంతమైన ప్రాంతాలను ప్రస్తావిస్తూ, వాటిని దాడులకు అనుకూలమైన ప్రదేశాలుగా చిత్రీకరించినట్లు పేర్కొంటున్నారు.
ఈ వీడియోలో మెలానియాకి సంబంధించిన వ్యక్తిగత అలవాట్లు, ప్రయాణ మార్గాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆమె కొనుగోలు చేసే దుస్తులను విషపూరిత పదార్థాలతో కలుషితం చేయడం వంటి తీవ్ర వ్యాఖ్యలు కూడా ఉన్నట్లు సమాచారం. చివర్లో ఆమె కుమారుడు బారన్ ట్రంప్‌ను ఉద్దేశించి బెదిరింపు సందేశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ వీడియోపై వైట్ హౌస్ ఈస్ట్ వింగ్ కానీ, అమెరికా సీక్రెట్ సర్వీస్ నుంచి కానీ వెంటనే అధికారిక స్పందన వెలువడలేదు. అయితే, మెలానియా ట్రంప్, బారన్ ట్రంప్ ఇద్దరూ సీక్రెట్ సర్వీస్ రక్షణలో ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో వారి భద్రతపై అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ట్రంప్ కుటుంబానికి సంబంధించిన కీలక ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. వాషింగ్టన్‌లోని వైట్ హౌస్, న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్, న్యూజెర్సీలోని బెడ్‌మినిస్టర్ గోల్ఫ్ క్లబ్, ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో ఎస్టేట్ వంటి ప్రాంతాల్లో భద్రతా చర్యలు పెంచారు.
ఇరాన్ నుంచి అమెరికా వ్యతిరేక ప్రచారం పెరుగుతున్న సమయంలో ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. ఇటీవల టెహ్రాన్‌లో ట్రంప్ కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పబడుతున్న పోస్టర్లు, నినాదాలు కూడా బయటకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. “రక్తానికి రక్తం” అనే నినాదంతో అమెరికా అధ్యక్షుడు, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ప్రచారాలు ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.
ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం నేపథ్యంలో ఇలాంటి బెదిరింపులు వెలువడటం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఇరాన్ చర్యలపై అమెరికా కఠిన వైఖరి ప్రదర్శిస్తుండగా, అధ్యక్షుడు ట్రంప్ కూడా టెహ్రాన్‌కు పలు సందర్భాల్లో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
అయితే, ఈ వీడియో వెనుక నిజమైన ఉద్దేశ్యం, దాని ప్రామాణికత, దాన్ని ఎవరు రూపొందించారనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. భద్రతా సంస్థలు ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..