అడవిలో.. గోదాముల్లో బయటపడ్డ నోట్ల కట్టలు.. హంగేరీలో $19.5 మిలియన్లు కలకలం!

హంగేరీ దేశం అడవుల్లో నోట్ల కట్టలను పాతిపెట్టారు.. గోదాముల్లో దాచారు.. అత్యంత ఖరీదైన సేఫ్‌లలో భద్రపరిచారు. అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టిన అధికారులకు ఇలా ఎక్కడికక్కడ డబ్బు కట్టలు కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. మొత్తం లెక్కిస్తే ఏకంగా 19.5 మిలియన్ డాలర్లు! భారత కరెన్సీలో సుమారు రూ.170 కోట్లకు పైగా విలువైన నగదు. ఇంత పెద్ద మొత్తంలో అవినీతి సొమ్ము వెనుక ఎవరు ఉన్నారంటే ఈ ఘటన గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిందే!

అడవిలో.. గోదాముల్లో బయటపడ్డ నోట్ల కట్టలు..  హంగేరీలో $19.5 మిలియన్లు కలకలం!
Hungarys Shocking Cash Haul $19 Million Unearthed From Forests And Hidden Buildings

Updated on: Nov 16, 2026 | 9:08 PM

హంగేరీ దేశం అడవుల్లో నోట్ల కట్టలను పాతిపెట్టారు.. గోదాముల్లో దాచారు.. అత్యంత ఖరీదైన సేఫ్‌లలో భద్రపరిచారు. అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టిన అధికారులకు ఇలా ఎక్కడికక్కడ డబ్బు కట్టలు కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. మొత్తం లెక్కిస్తే ఏకంగా 19.5 మిలియన్ డాలర్లు! భారత కరెన్సీలో సుమారు రూ.170 కోట్లకు పైగా విలువైన నగదు. ఇంత పెద్ద మొత్తంలో అవినీతి సొమ్ము వెనుక ఎవరు ఉన్నారంటే ఈ ఘటన గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిందే!

అడవుల్లో తవ్వితే బయటపడిన నోట్ల కట్టలు!

హంగేరీలో మాజీ ప్రధాని విక్టర్ ఓర్బన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆరోపణలపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆయన కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన మిక్లోస్ సెస్టాక్‌పై అధికారులు దృష్టి సారించారు. 2014 నుంచి 2018 వరకు జాతీయ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన సెస్టాక్ ప్రభుత్వ రవాణా సంస్థకు సంబంధించిన ఓ బస్సుల కొనుగోలు వ్యవహారంలో లంచాలు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పాత బస్సులను అధిక ధరలకు కొనుగోలు చేసిన అక్రమ ఒప్పందంలో ఆయన పాత్ర ఉందని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.

ఈ కేసులో భాగంగా నేషనల్ అసెట్ రికవరీ అండ్ ప్రొటెక్షన్ ఆఫీస్ (NVVH) అధికారులు గురువారం, శుక్రవారం భారీ స్థాయిలో సోదాలు నిర్వహించారు. రాజధాని బుడాపెస్ట్‌తో పాటు మరో మూడు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అయితే ఈ సోదాల్లో బయటపడిన దృశ్యాలు అధికారులనే ఆశ్చర్యపరిచాయి.

అడవుల్లో నేలను తవ్వగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. వ్యవసాయ గోదాముల్లోనూ పెద్ద మొత్తంలో డబ్బు దాచినట్లు గుర్తించారు. నివాస భవనాల్లో కూడా క్యాష్‌ లభించింది. సేఫ్‌లలోనూ డబ్బును దాచిపెట్టారు. ఇలా ఒక్కో చోట బయటపడుతున్న నగదును చూసి అధికారులు విస్తుపోయారు.

మూడు కరెన్సీల్లో కోట్లాది రూపాయలు!

రెండు రోజుల పాటు సాగిన సోదాల్లో అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు వివరాలు వెల్లడించారు. ఇందులో హంగేరియన్ ఫోరింట్లు, యూరోలు, అమెరికన్ డాలర్లు ఉన్నాయి. వీటన్నిటి విలువ కలిపి 19.5 మిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.170 కోట్లకు పైమాటే! ఇంత భారీ మొత్తంలో నగదు లభించడంతో దాన్ని లెక్కించడం కూడా అధికారులకు సవాలుగా మారింది. చివరకు ఆ డబ్బును హంగేరీ ప్రభుత్వ ఖజానా ఖాతాలో జమ చేశారు.

12 మంది ఉద్యోగులు.. 5 యంత్రాలు.. 8 గంటల సమయం!

స్వాధీనం చేసుకున్న డబ్బును లెక్కించేందుకు ఖజానా శాఖ ఉద్యోగులు ఎనిమిది గంటలు శ్రమించాల్సి వచ్చింది. 12 మంది ఉద్యోగులు ఐదు నగదు లెక్కింపు యంత్రాల సాయంతో డబ్బును లెక్కించారు. అవినీతి నిరోధక సంస్థ విడుదల చేసిన వీడియోలో భారీగా పేర్చిన నోట్ల కట్టలు కనిపించాయి. అధికారులు వాటి పక్కన కూర్చుని తనిఖీలు చేస్తున్న దృశ్యాలు, రాత్రివేళ అడవిలో పారలతో భూమిని తవ్వుతున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారి హంగేరీలో తీవ్ర చర్చకు దారితీసింది.

మాజీ మంత్రి ఏమంటున్నారు?

అయితే, తనపై వచ్చిన ఆరోపణలను మాజీ మంత్రి మిక్లోస్ సెస్టాక్ ఖండించారు. అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు తనకు సంబంధించింది కాదని ఆయన తరఫు న్యాయవాది గాబోర్ పాప్ స్పష్టం చేశారు. ఓర్బన్ ప్రభుత్వంలో పనిచేసిన మరో ఇద్దరు మాజీ మంత్రులు, ఆయన సోదరుడు కూడా వేర్వేరు కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్నారు.

16 ఏళ్ల ఓర్బన్ పాలనకు ముగింపు.. ఇప్పుడు అవినీతిపై విచారణ!

హంగేరీ రాజకీయాల్లో ఈ పరిణామం కలకలం రేపింది. విక్టర్ ఓర్బన్ 2010 నుంచి 2026 వరకు 16 ఏళ్లు ప్రధానిగా కొనసాగారు. ఆయన పాలనలో అవినీతి, బంధుప్రీతి, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగాయనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో పీటర్ మాగ్యార్ నేతృత్వంలోని టిస్జా పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ఓర్బన్ సుదీర్ఘ పాలనకు తెరపడింది. అధికారంలోకి వచ్చిన మాగ్యార్, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించారు. ‘ఆపరేషన్ పర్గేటరీ’ పేరుతో అవినీతి నిరోధక చర్యలు చేపట్టారు.

అడవుల్లో పాతిపెట్టిన డబ్బు, గోదాముల్లో దాచిన నగదు, గంటల తరబడి లెక్కించాల్సిన నోట్ల కట్టలు. హంగేరీలో ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ డబ్బు వెనుక ఇంకా ఎవరెవరి పాత్ర ఉందన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది

Loading...
Unable to load recommendations.
Follow Us