సముద్ర గర్భంలో ఇరాన్ ఆపరేషన్.. అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను పట్టుకున్నామన్న IRGC!

హోర్ముజ్ జలసంధిలో అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికాకు చెందిన అధునాతన అండర్‌వాటర్ డ్రోన్‌ను తాము స్వాధీనం చేసుకున్నామని ఇరాన్ IRGC ప్రకటించింది. ఇది నెలలో రెండవ సంఘటన కాగా, నిఘా ఆపరేషన్లకు వినియోగిస్తున్నారని ఇరాన్ ఆరోపించింది. అయితే అమెరికా ఈ వాదనను తిరస్కరించింది. ఈ ఘటన ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిపై ఆందోళనలను పెంచుతోంది.

సముద్ర గర్భంలో ఇరాన్ ఆపరేషన్.. అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను పట్టుకున్నామన్న IRGC!
Us Surveillance Drone

Updated on: Sep 28, 2026 | 12:46 PM

హోర్ముజ్ జలసంధిలో మరోసారి అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికాకు చెందిన అధునాతన మానవరహిత జలాంతర్గత వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నావికాదళం ప్రకటించింది. సెప్టెంబర్ 27న ఈ ప్రకటన వెలువడగా.. వాహనం నుంచి సమాచారాన్ని సేకరించేందుకు తమ నిపుణులు పనిచేస్తున్నారని ఇరాన్ తెలిపింది.

IRGC ప్రకటన ప్రకారం.. నిఘా, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సామర్థ్యాలను ఉపయోగించిన సమన్వయ, సంక్లిష్ట ఆపరేషన్‌లో ఈ అండర్‌వాటర్ డ్రోన్‌ను అడ్డుకున్నట్లు పేర్కొంది. తొలుత దీనిని అమెరికా సైన్యం ఉపయోగించే REMUS 600గా గుర్తించింది. ఈ వాహనం నిఘా కార్యకలాపాలకు ఉపయోగించబడుతోందని ఇరాన్ ఆరోపించింది. పట్టుబడిన వాహనాన్ని తమ నిపుణులు పరిశీలిస్తూ, అందులోని డేటాను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది.

అయితే ఈ వాదనపై అమెరికా వైపు నుంచి భిన్నమైన స్పందన వచ్చింది. అమెరికా సెంట్రల్ కమాండ్.. తమ అన్ని ఆపరేషనల్ మానవరహిత వ్యవస్థలు తమ ఆధీనంలోనే ఉన్నాయని, ఇరాన్ చేసిన స్వాధీనం వాదనను తిరస్కరించింది. దీంతో ఈ ఘటనపై ఇరువైపుల వాదనలు భిన్నంగా ఉన్నాయి.

ఇదిలా ఉండగా, తాజాగా IRGC ప్రతినిధి ఈ వాహనాన్ని Mk 18 Mod 2 Kingfishగా పేర్కొన్నట్లు అంతర్జాతీయ నివేదికలు తెలిపాయి. అంటే తొలుత వెల్లడించిన రెమస్-600 గుర్తింపులో మార్పు చోటుచేసుకుంది.

ఇది ఈ నెలలో ఇరాన్ ప్రకటించిన రెండో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్ స్వాధీనం ఘటన. సెప్టెంబర్ 8న హోర్ముజ్ ప్రవేశద్వారం వద్ద మరో అమెరికా మానవరహిత జలాంతర్గత వాహనాన్ని పట్టుకున్నట్లు IRGC ప్రకటించింది. దానిని Dive-LDగా గుర్తించింది.

మరోవైపు హోర్ముజ్ జలసంధి మూసివేతపై కూడా IRGC తన వైఖరిని పునరుద్ఘాటించింది. అనుమతి లేని రాకపోకలను అడ్డుకుంటామని హెచ్చరించింది. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాకు అత్యంత కీలకమైన ఈ జలమార్గంపై ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజా పరిణామం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us