చిమ్మ చీకట్లో..16 కి.మీ దాటే దమ్ముందా? భయపెట్టే సోఫ్‌ ఓమర్‌ గుహలు

చుట్టూ చిమ్మ చీకటి .. ఒక్కసారి ఎంటర్‌ అయినవారు మధ్యలో బయటకు వచ్చే అవకాశమే లేదు. మధ్యలో కాకపోయినా  సాహసయాత్ర చివర్లో తమలోని భయాన్ని జయించే బయటకు వస్తారనే చెప్పొచ్చు.  సోఫ్ ఒమర్  గుహలలో 16 కిలోమీటర్ల ప్రయాణం ఎంతటి సాహసికులకైనా పెద్ద పరీక పెడుతుంది.

చిమ్మ చీకట్లో..16 కి.మీ దాటే దమ్ముందా? భయపెట్టే సోఫ్‌ ఓమర్‌ గుహలు
Sof Omar Caves A Feast For Adventure Lovers

Updated on: Aug 21, 2026 | 4:27 PM

చుట్టూ చిమ్మ చీకటి .. ఒక్కసారి ఎంటర్‌ అయినవారు మధ్యలో బయటకు వచ్చే అవకాశమే లేదు. మధ్యలో కాకపోయినా సాహసయాత్ర చివర్లో తమలోని భయాన్ని జయించే బయటకు వస్తారనే చెప్పొచ్చు.  ఆ సంగతి పక్కన పెడితే సోఫ్ ఒమర్  గుహలలో 16 కిలోమీటర్ల సాహస ప్రయాణం కత్తిమీద సాములాంటిది.  గుహలో సూర్యరశ్మి ఊసే లేని ప్రాంతాలను చిమ్మ చీకటి ఆవరించి ఉండటంతో ఎంతటి సాహసికులకైనా  పరీక్ష పెట్టేలా ఉంటుంది. అవన్నీ తట్టుకుని నిలబడే వారు మార్గమధ్యంలో బోనస్‌ లాంటిది అందుకుంటారు. ఆ బోనస్  నగదు రూపంలో కాకుండా ప్రకృతి అందాల రమణీయత రూపంలో వారిని అలరిస్తుంది. ప్రకృతి వింతలలో ఒకటిగా ఇథియోపియాలోని సోఫ్‌ ఓమర్‌ గుహలు పేరు పొందాయి. బాలే పర్వతాల మధ్య ఉన్న “సోఫ్ ఒమర్” గుహల గుండా వెయిబ్‌ నది ప్రవహిస్తుంది. నది పక్కనే నడుచుకుంటూ వెళ్ళే వారికి  భూగర్భంలో అద్భుత ప్రపంచం కనువిందు చేస్తుంది.

గుహ  ముఖద్వారం వద్ద  కనిపించి వెంటనే మాయమయ్యే వైబ్‌ నది, దాదాపు 16 కిలోమీటర్లు విస్తరించి ఉన్న సోఫ్‌ ఓమర్‌ గుహలలో మళ్లీ అక్కడక్కడా కనిపించి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇథియోపియాలోని రోబ్ పట్టణానికి 100 కి.మీ. దూరంలో సోఫ్‌ ఓమర్‌ గుహలున్నాయి. చిమ్మ చీకటిగా ఉండే గుహల లోపలికి అడుగుపట్టే వారికి గుండె ధైర్యం నిండుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నదితో పాటు ప్రయాణిస్తూ ప్రకృతి వింతలను ఆస్వాదిస్తూ ఆ అనుభూతిని సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరే  కొంతమంది సాహసికులు దేశవిదేశాల నుంచి తరలి వస్తుంటారు.

చీకటి గుహలో సాహస యాత్ర!

చీకటి గుహలోకి అడుగుపెట్టి వైబ్‌ నదితో పాటే భూగర్భంలో ప్రయాణించాల్సి ఉంటుంది. నది ప్రవాహానికి గుహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ విశాలమైన భూగర్భ గదులు, ఎత్తైన సున్నపురాయి స్తంభాలు చూడటానికి రెండు కళ్లు చాలవు.  ప్రకృతి అందాలు చూపరులను అంతగా మైమరిపిస్తాయి. ఆ సౌందర్యం కట్టిపడేయటంతో వారు అప్పటివరకు పడ్డ కష్టాన్ని మరచిపోయే పరిస్థితి ఎదురవుతుంది. గుహ లోపల సాగే యాత్రలో వెయిబ్ నదిని ఏకంగా ఏడు సార్లు దాటాల్సి ఉంటుందట! నీటి మట్టాన్ని బట్టి నడుచుకుంటూ లేదా ఈదుకుంటూ నదిని దాటాల్సి వస్తుంది.

గుహలోని చాలా ప్రాంతాలకు అసలు సూర్యకాంతే చేరదు. టార్చ్ లైట్‌ వెలుతురులో చీకటి గదులను దాటే క్రమంలో కొందరు భయంతో కేకలు వేస్తుంటారు. వర్షాకాలంలో నీటి మట్టంపెరిగి గుహలో దారులు పూర్తిగా మూసుకుపోతాయి. ప్రయాణం చేయడానికి వీలు లేని ఆ పరిస్థితి ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది. అందుకే సోఫ్‌ ఒమర్‌ కేవ్స్‌లో ప్రవేశాన్ని గైడ్‌ సహాయం తీసుకునే వారికే పరిమితం చేసింది ప్రభుత్వం. నిపుణుడైన గైడ్ సహాయంతో చీకటి గుహలో భయాన్ని జయించి 16 కిలోమీటర్ల దూరాన్ని దాటేసి జీవితంలో ముందడుగేసే అనుభూతి కోసం సాహసికులు ఎదురుచూస్తుంటారు!

Loading...
Unable to load recommendations.
Follow Us