
భారతీయులు కూడా ఆమె చేసిన వ్యాఖ్యలను తమ పరిస్థితులకు దగ్గరగా ఉన్నవిగా భావిస్తున్నారు. ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నవారు, కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నవారు మసూద్ సూచనను తమ పరిస్థితికి అన్వయించుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొత్త ఉద్యోగానికి ఆఫర్ లెటర్ చేతిలోకి రాకముందే ప్రస్తుత ఉద్యోగానికి రాజీనామా చేయొద్దని ఆమె సూచించారు. ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్‌లో పోటీ తీవ్రంగా ఉందని, ఒకప్పుడు మంచి హోదాల్లో పనిచేసిన అనుభవజ్ఞులు కూడా ఎంట్రీ లెవల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తున్నారని ఆమె వెల్లడించారు.
దుబాయ్‌లో గత పదేళ్లుగా హెచ్‌ఆర్ రంగంలో పనిచేస్తున్న అలియా వాని మసూద్.. తనకు ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ఉద్యోగ దరఖాస్తులు వస్తుంటాయని చెప్పారు. రోజుకు సుమారు 10 నుంచి 20 CVలు తన పరిశీలనకు వస్తున్నాయని తెలిపారు. అయితే వాటిలో కనిపిస్తున్న ఓ అంశం తనను ఆశ్చర్యానికి గురిచేస్తోందని ఆమె చెప్పారు. ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు కేవలం కొత్తగా కెరీర్ ప్రారంభించేవారు మాత్రమే కాకుండా.. మేనేజర్ స్థాయి అనుభవం ఉన్నవారు కూడా దరఖాస్తు చేస్తున్నారని తెలిపారు. అంటే ఒకప్పుడు సీనియర్ పొజిషన్లలో పనిచేసిన వ్యక్తులు కూడా ఇప్పుడు కెరీర్‌ను మరోసారి మొదటి నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నమాట.
ఇటీవల ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది ఫ్రెషర్స్ కాదని మసూద్ పేర్కొన్నారు. ఇప్పటికే మంచి అనుభవం సంపాదించినవారు, మంచి సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించినవారు కూడా లేఆఫ్స్ కారణంగా కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పారు. దీంతో ఉద్యోగ మార్కెట్‌లో పోటీ మరో స్థాయికి చేరిందని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే కొత్త సంస్థ నుంచి ఆఫర్ లెటర్ అధికారికంగా చేతికి వచ్చే వరకు ప్రస్తుత ఉద్యోగానికి రాజీనామా చేయొద్దని ఆమె స్పష్టంగా చెప్పారు. కొత్త ఉద్యోగం దొరుకుతుందనే నమ్మకంతో ముందుగానే రాజీనామా చేసి.. ఆ తర్వాత ఉద్యోగం కోసం వెతకడం ప్రస్తుతం రిస్క్ కావచ్చని హెచ్చరించారు. ప్రస్తుత ఉద్యోగం మీ ఖర్చులను, కుటుంబ అవసరాలను నడిపిస్తుంటే.. దాన్ని తొందరపడి వదిలేయకూడదని ఆమె సూచించారు.
మసూద్ చేసిన మరో వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు కారణమైంది. “ప్రస్తుత మార్కెట్‌లో ఉద్యోగం ఉండటం ఒక లగ్జరీ.” ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగం సాధారణంగానే అనిపించొచ్చు. జీతం తక్కువగా ఉందని, పని ఒత్తిడి ఎక్కువగా ఉందని, మేనేజ్‌మెంట్ నచ్చడం లేదని చాలామందికి అనిపించవచ్చు. కానీ అదే ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత మరో ఉద్యోగం దొరకడానికి నెలలు పట్టే పరిస్థితి ఉంటే? అప్పుడే ప్రస్తుత ఉద్యోగం విలువ అర్థమవుతుందని ఆమె సూచిస్తున్నారు. ఉద్యోగం ఉందనే కారణంతో బుల్లీయింగ్, వేధింపులు, అన్యాయం భరించాల్సిన అవసరం లేదన్నారు. పని ప్రదేశంలో తీవ్రమైన సమస్యలు ఎదురైతే సంబంధిత లేబర్ అధికారులను సంప్రదించి సహాయం పొందాలని సూచించారు.
ప్రస్తుత ఉద్యోగంపై అసంతృప్తిగా ఉన్నవారు వెంటనే రిజైన్ చేయకుండా కొన్ని విషయాలను ముందుగా చూసుకోవడం మంచిదని ఈ సూచన చెబుతోంది. కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రస్తుత ఉద్యోగం చేస్తూనే ప్రయత్నించాలి. ఇంటర్వ్యూలు, ఆఫర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రస్తుత ఉద్యోగాన్ని కొనసాగించాలి. కేవలం మౌఖిక హామీపై ఆధారపడకుండా అధికారిక ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాతే రాజీనామా చేయాలి. ఉద్యోగం మారే సమయంలో కొంత ఆర్థిక బ్యాకప్ ఉంచుకోవాలి. ప్రస్తుత ఉద్యోగంలో సమస్యలు ఉంటే అవసరమైనప్పుడు సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.