
తుర్క్‌మెనిస్తాన్‌లో ఓ ఎడారి.. ఎడారి మధ్య ఓ భారీ అగ్నిగుండం! భూమి లోపలి నుంచి ఎగిసిపడుతున్న మంటలు.. రాత్రివేళ ఆకాశాన్ని సైతం వెలిగించే ఆ జ్వాలలు.. అక్కడికి వెళ్లినవారికి భూమిపైనే నరకం కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే స్థానికులు దీనిని ‘నరకానికి ద్వారం’ అని పిలుస్తుంటారు. తుర్క్‌మెనిస్తాన్‌లోని కరాకుమ్ ఎడారిలో ఉన్న ‘దర్వాజా గ్యాస్ క్రేటర్’ మానవ నిర్మిత ప్రదేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
దాదాపు 70 మీటర్ల వెడల్పు, 30 మీటర్ల లోతుతో ఉన్న ఈ భారీ గ్యాస్ గుంటలో నిరంతరం మంటలు ఎగిసిపడుతుంటాయి. పగటిపూట కంటే రాత్రివేళ దీని రూపం మరింత భయానకంగా ఉంటుంది. చీకటి ఎడారి మధ్య నుంచి ఎర్రటి మంటలు ఎగసిపడుతుండటంతో.. ఇది నిజంగానే ‘నరకానికి ద్వారం’లా కనిపిస్తుంది. ఈ అగ్నిజ్వాలలు కొన్ని కిలోమీటర్ల దూరం నుంచే కనిపిస్తాయి. క్రేటర్ సమీపానికి వెళ్లినప్పుడు తీవ్రమైన వేడి అనుభూతి కలుగుతుంది.
ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. దర్వాజా క్రేటర్ సహజంగా ఏర్పడిన అగ్నిగుండం కాదు. రష్యా శాస్త్రవేత్తలు సహజ వాయువు కోసం చేపట్టిన డ్రిల్లింగ్ సమయంలో ఈ భారీ గుంట ఏర్పడింది. తవ్వకాల సమయంలో భూమి కూలిపోవడంతో గ్యాస్ బయటకు రావడం ప్రారంభమైంది. విషపూరిత వాయువులు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకు అక్కడి గ్యాస్‌కు నిప్పు పెట్టారు. కొన్ని రోజుల్లో మంటలు ఆరిపోతాయని సైంటిస్ట్‌లు భావించారు. కానీ పరిస్థితి ఊహించిన దానికంటే భిన్నంగా మారింది. సంవత్సరాలు గడిచాయి.. అయినా మంటలు ఆరలేదు!
దర్వాజా క్రేటర్‌లో మంటలు దాదాపు ఐదు దశాబ్దాలుగా కొనసాగుతుంది. దర్వాజా గ్యాస్ క్రేటర్‌ను మూసివేయడం లేదా మంటలను ఆర్పడం కోసం తుర్క్‌మెనిస్తాన్ ప్రభుత్వం ప్రయత్నించలేదు. సహజ వాయువు వృథా అవుతూ పర్యావరణంపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా సహజ వాయువు విలువైన ఇంధనం కావడంతో.. దశాబ్దాలుగా మండిపోతున్న గ్యాస్‌ను నియంత్రించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అయితే ఈ భారీ క్రేటర్‌లోని మంటలను పూర్తిగా ఆర్పడం అంత సులభమైన పని కాదనీ భూగర్భం నుంచి గ్యాస్ సరఫరా కొనసాగుతున్నంతకాలం మంటలు కొనసాగే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
ప్రపంచంలోని సాధారణ పర్యాటక ప్రాంతాలకు భిన్నంగా.. దర్వాజా గ్యాస్ క్రేటర్ సాహసయాత్రికులను, ఫొటోగ్రాఫర్లను, ప్రకృతి వైవిధ్యాన్ని ఆసక్తిగా గమనించే వారిని ఆకర్షిస్తోంది. ఓ వైపు భయానకంగా కనిపించే ఈ అగ్నిగుండం.. మరోవైపు సాహస యాత్రికులను ఆకర్షించే పర్యాటక కేంద్రంగా మారింది. ఎడారి మధ్యలో మండుతున్న భారీ క్రేటర్‌ను చూసేందుకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తుంటారు. ఎడారి మధ్యలో క్యాంపింగ్ చేస్తూ రాత్రి సమయంలో మండుతున్న క్రేటర్‌ను చూడటం చాలా మందికి ప్రత్యేక అనుభూతిగా మారింది.