Mohammad Younus: హిందువులకు రక్షణ కల్పిస్తాం.. బంగ్లా ప్రభుత్వాధినేత యూనస్‌ ప్రకటన.. హసీనాపై మర్డర్ కేసు..

|

Aug 13, 2024 | 9:08 PM

హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్‌ యూనస్‌ . ఢాకాలో ఢాకేశ్వరి ఆలయాన్ని దర్శించుకున్నారు మహ్మద్‌ యూనస్‌. పూజారులతో మాట్లాడారు. హిందూ సంఘాల ప్రతినిధులతో కూడా మాట్లాడారు.

Mohammad Younus: హిందువులకు రక్షణ కల్పిస్తాం.. బంగ్లా ప్రభుత్వాధినేత యూనస్‌ ప్రకటన.. హసీనాపై మర్డర్ కేసు..
Bangladesh Crisis
Follow us on

హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్‌ యూనస్‌ . ఢాకాలో ఢాకేశ్వరి ఆలయాన్ని దర్శించుకున్నారు మహ్మద్‌ యూనస్‌. పూజారులతో మాట్లాడారు. హిందూ సంఘాల ప్రతినిధులతో కూడా మాట్లాడారు. హిందువులకు పూర్తి రక్షణ కల్పిస్తామన్నారు . హిందువులపై 205 దాడులు జరిగినట్టు ఫిర్యాదులు అందాయి. ఐదుగురు చనిపోయినట్టు కూడా వార్తలు వచ్చాయి.

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరగడంపై భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హింసను ఆపాలన బీజేపీతో సహా పలు సంస్థలు ఆందోళన చేపట్టాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులపై ఐక్యరాజ్యసమితి కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

మైనారిటీ ప్రార్ధనా స్థలాలకు సంబంధించి ఎటువంటి దాడులు జరిగినా వెంటనే ఫిర్యాదు చేసేందుకు బంగ్లాదేశ్‌ ప్రభుత్వం హాట్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. మానవహక్కులను, భావవ్యక్తీకరణ స్వేచ్చను కాపాడడం తమ ప్రధాన లక్ష్యమన్నారు మహ్మద్‌ యూనస్‌. బంగ్లాదేశ్‌లో విద్యార్ధుల నిరసనలు కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్‌ హిందువులకు సమానహక్కులు ఉన్నాయన్నారు మహ్మద్‌ యూనస్‌.

ఢాకాలో మహ్మద్‌ యూనస్‌ నివాసాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. విద్యార్ధుల ఆందోళనలో ఆచూకీ తెలియకుండా పోయిన వాళ్ల కుటుంబసభ్యులు ముట్టడించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే బంగ్లాదేశ్‌ సైనికులు వాళ్లను అడ్డుకున్నారు. దేశంలో శాంతి భద్రతలను కాపాడడానికి బంగ్లా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. చాలామంది పోలీసు అధికారులపై బదిలీ వేటు వేశారు.

హసీనాపై మర్డర్ కేసు..

ఆర్మీ, విద్యార్ధుల తిరుగుబాటుతో పదవిని కోల్పోయిన బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు కష్టాలు రెట్టింపయ్యాయి. ఢాకాలో హసీనాపై మర్డర్‌ కేసు నమోదయ్యింది. వ్యాపారిని హత్య చేసినట్టు హసీనాతో పాటు అవామీలీగ్‌ పార్టీ నేతలపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం తీసుకుంటున్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్ధులపై కాల్పులు జరిపించినట్టు కూడా ఆమెపై కేసు నమమోదయ్యింది.

మరోవైపు షేక్‌హసీనాకు వ్యతిరేకంగా తిరుగుబాటు వెనుక తమ హస్తమున్నట్టు వచ్చిన ఆరోపణలను అమెరికా తీవ్రంగా ఖండించింది. షేక్‌ హసీనా తమపై తప్పుడు ఆరోపణలు చేశారని వైట్‌హౌస్‌ వర్గాలు వెల్లడించాయి. బంగ్లాలో జరుగుతున్న పరిణామాలకు తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..