బంగ్లాలో ఆగని విధ్వంసకాండ.. అల్లర్లతో తగలబడుతోన్న ఢాకా.. సర్కార్ ఏర్పాటులో ఆర్మీ!

|

Aug 06, 2024 | 2:51 PM

బంగ్లాదేశ్‌లో విధ్వంసకాండ కంటిన్యూ అవుతోంది. దేశం మొత్తం అల్లర్లలో అట్టుడికిపోతోంది. రిజర్వేషన్ల విషయంలో చెలరేగిన మంటలు... దేశం మొత్తాన్ని తగలబెట్టేస్తున్నాయి. రాజధాని ఢాకాలో పరిస్థితి అత్యంత భయానకంగా మారింది.

బంగ్లాలో ఆగని విధ్వంసకాండ.. అల్లర్లతో తగలబడుతోన్న ఢాకా.. సర్కార్ ఏర్పాటులో ఆర్మీ!
Bangladesh Crisis
Follow us on

బంగ్లాదేశ్‌లో విధ్వంసకాండ కంటిన్యూ అవుతోంది. దేశం మొత్తం అల్లర్లలో అట్టుడికిపోతోంది. రిజర్వేషన్ల విషయంలో చెలరేగిన మంటలు… దేశం మొత్తాన్ని తగలబెట్టేస్తున్నాయి. రాజధాని ఢాకాలో పరిస్థితి అత్యంత భయానకంగా మారింది. సైన్యం సైతం ఆందోళనకారుల్ని కంట్రోల్‌ చేయలేకపోతోంది. ఇప్పటివరకు 400మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే 135మంది మృత్యువాత పడ్డారు.

ప్రజాప్రభుత్వం కూలిపోగానే బంగ్లాదేశ్‌ అల్లకల్లోలంగా మారింది. షేక్‌ హసీనా ఇంటిని ఆందోళనకారులు లూటీ చేశారు. కుర్చీలు, టేబుళ్లు, పూలబొకేలు అన్నిటినీ ఎత్తుకెళ్లిపోయారు. పరుపులు, ఫ్యాన్లు, ల్యాంపులు, ఇలా ఏది కనిపిస్తే అది దోచుకెళ్లారు. బంగ్లా‌ ప్రధాని అధికారిక నివాసం గణభవన్‌లోనూ లూటీచేశాయి అల్లరిమూకలు. పోలీసులు గానీ, సైన్యం గానీ ఈ అరాచకాన్ని ఆపే ప్రయత్నమే చేయలేదు. ఇక బంగ్లాదేశ్‌ జాతిపిత, షేక్‌ హసీనా తండ్రి షేక్‌ ముజీబుర్‌ రహమాన్‌ విగ్రహాన్ని ఢాకాలో అల్లరిమూకలు ధ్వంసం చేశాయి. బంగబంధు అని జనం పిలుచుకున్న ఈ నాయకుడి విగ్రహాన్ని కసిగా పగలగొట్టారు.

రెండే రెండు రోజుల్లో బంగ్లాలో పరిస్థితులు అదుపుతప్పాయి. ఢాకాలో రోడ్డెక్కిన లక్షలాది మంది జనం విధ్వంసం సృష్టించారు. మంత్రుల ఇళ్లు, అధికారిక నివాసాలు, ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు, బస్సులకు నిప్పుపెట్టారు. హింసాత్మక ఘటనలతో షేక్‌ హసీనా ప్రభుత్వం వణికిపోయింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో.. షేక్‌ హసీనా గద్దె దిగాల్సి వచ్చింది.

బంగ్లా స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు 30శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఈ రచ్చకు కారణం. హసీనా నిర్ణయానికి వ్యతిరేకంగా కొన్నాళ్లుగా ఆందోళనలు జరుగుతున్నాయి. 30శాతం రిజర్వేషన్లను 5శాతానికి కుదించాలని సుప్రీంకోర్టు తీర్పివ్వడంతో హసీనా ప్రభుత్వం మరింత ఇరకాటంలో పడింది. చివరికి, షేక్‌ హసీనా రాజీనామా.. దేశం విడిచి పారిపోయే వరకు దారితీశాయి పరిణామాలు.

మరోవైపు బంగ్లా ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వేకర్‌ నివాసంలో కీలక సమావేశమైంది. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్‌ సభ్యులపై చర్చించింది. అయితే షేక్‌ హసీనా పార్టీ అవామీ లీగ్‌కి ఆహ్వానం అందలేదు. ఈ క్రమంలోనే ఈ సాయంత్రమే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు కోసం రాష్ట్రపతి భవన్‌కు ఆర్మీ చీఫ్‌ వెళ్లనున్నారు. మరొవైపు ప్రపంచ దేశాలు బంగ్లా సంక్షోభాన్ని పరిశీలిస్తున్నాయి. అటు ఐక్యరాజ్యసమితి సైతం బంగ్లాదేశ్‌ పరిణామాలను ఎప్పటి కప్పుడు గమనిస్తోంది.

బంగ్లాదేశ్‌లో పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. షేక్‌ హసీనా దేశం విచిడి పారిపోవడంతో పాలన మొత్తం సైన్యం చేతుల్లోకి వెళ్లిపోయింది. నోబెల్‌ గ్రహీత ప్రొఫెసర్‌ మహమ్మద్‌ యూనుస్‌ను చీఫ్‌ అడ్వైజర్‌గా నియమించారు. త్వరలోనే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటోన్న ఆర్మీ చీఫ్‌… శాంతి స్థాపన కోసం విద్యార్థి సంఘాలతో చర్చలు జరుపుతున్నారు.

49ఏళ్ల క్రితం ఇంతకంటే దారుణమే జరిగింది బంగ్లాలో. 1975 ఆగస్టులో అప్పటి రాజకీయ సంక్షోభంలో ప్రస్తుత ప్రధాని హసీనా తండ్రి షేక్‌ ముజిబుర్‌ రెహ్మన్‌, అతని ఫ్యామిలీతోపాటు.. 18 సీనియర్‌ సైనికాధికారులను హత్య చేశారు దుండగులు. దాంతో.. హసీనా, ఆమె భర్త, పిల్లలు ఢిల్లీలో ఉండేందుకు అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం సాయం చేసింది. ఇప్పుడు కూడా అప్పటిలాగానే.. హసీనాకు ఆశ్రయం కల్పించింది భారత్‌.

షేక్‌ హసీనా బంగ్లాదేశ్‌ను వీడేముందు హైడ్రామా జరిగింది. దేశం విడిచివెళ్లాలని హసీనాకు సైన్యం అల్టిమేటం ఇచ్చింది. దేశం విడిచి వెళ్లడానికి కేవలం 45 నిమిషాల టైమ్‌ మాత్రమే ఇచ్చింది సైన్యం. జాతిని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం కూడా హసీనాకు ఇవ్వలేదు బంగ్లా సైన్యం. గత్యంతరం లేని పరిస్థితుల్లో భారత్‌ను సంప్రదించారు షేక్‌ హసీనా. దాంతో, బంగ్లా నుంచి హసీనాను సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంది భారత్‌. హసీనా విమానానికి భద్రతగా రెండు రఫెల్‌ జెట్స్‌ను పంపింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని స్వయంగా పర్యవేక్షించారు ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ VR చతుర్వేది. నిన్న సాయంత్రం 5గంటల 45నిమిషాల టైమ్‌లో ఢిల్లీ హిండన్‌ ఎయిర్‌బేస్‌లో సేఫ్‌గా ల్యాండైంది హసీనా విమానం.

యూకే శరణు కోరిన షేక్ హసీనా.. 19గంటలుగా ఢిల్లీలోని హిండన్ ఎయిర్‌బేస్‌లో ఎదురుచూపు చూస్తున్నారు. యూకే నుంచి అనుమతి వచ్చేవరకు భారత్‌లోనే ఉండనున్నారు హసీనా. నిన్న సాయంత్రమే హసీనాతో మాట్లాడిన భారత భద్రతా సలహదారు అజిత్‌ దోవల్‌.. ఆ సమాచారాన్ని ప్రధాని మోదీకి నివేదించారు.

బంగ్లాదేశ్ జాతిపితగా పిలిచే షేక్ ముజిబుర్ రెహ్మాన్‌ కుమార్తె.. షేక్ హసీనా. ముజిబుర్ రెహ్మాన్ బంగ్లాదేశ్‌కు తొలి అధ్యక్షుడు. ఆయన అధ్యక్ష పదవి చేపట్టిన కొన్ని నెలలకే.. అంటే 1975 ఆగస్టు 15న హత్యకు గురయ్యారు. ముజిబుర్‌తో పాటు హసీనా తల్లిని, ముగ్గురు సోదరులను సైనికాధికారులు హత్య చేశారు. ఈ హత్యలు జరిగినప్పుడు హసీనా వయసు ఆరేళ్లు. అప్పుడు ఆమె బంగ్లాదేశ్‌లో లేకపోవడంతో ప్రాణాలు దక్కాయి. 1981లో ఆమె బంగ్లాదేశ్ తిరిగి వచ్చాక రాజకీయాల్లో కీలక నాయకురాలిగా మారారు. ఆ సమయంలో ఎన్నోసార్లు గృహనిర్బంధానికి గురయ్యారు.

1990 డిసెంబర్‌లో ప్రజల ఒత్తిడికి తలొగ్గిన బంగ్లాదేశ్ చివరి సైనిక పాలకుడు లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ ఎర్షాద్ రాజీనామా చేశారు. 1991లో జరిగిన ఎన్నికల్లో షేక్ హసీనా పార్టీకి మెజారిటీ లభించలేదు. ఆమె ప్రత్యర్థి ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 1996లో జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ విజయం సాధించటంతో హసీనా తొలిసారి ప్రధానమంత్రి అయ్యారు.

2001 అక్టోబరులో ఎన్నికల్లో ఖలీదా జియా నేతృత్వంలోని బీఎన్‌పీ, మూడు సంకీర్ణ భాగస్వామ్య పక్షాల చేతిలో అవామీ లీగ్ ఓడిపోయింది. 2004 ఆగస్టులో దేశ రాజధాని ఢాకాలో అవామీ లీగ్ ర్యాలీపై జరిగిన గ్రెనేడ్ దాడిలో 22మంది మృతి చెందారు. ఆ దాడి నుంచి హసీనా బయటపడ్డారు. ఆ దాడి తర్వాత హసీనాకు ప్రజాదరణ విశేషంగా పెరిగింది. దాని ఫలితమే 2008 సార్వత్రిక ఎన్నికలు. ఆ ఎన్నికల్లో 300 స్థానాలకుగాను 250కి పైగా స్థానాల్లో హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ జయకేతనం ఎగరవేసింది.

ఇక 2014 జనవరిలో జరిగిన సార్వత్రిక ఎన్నికలను బీఎన్‌పీ బహిష్కరించింది. ఆ ఎన్నికల్లో అవామీ లీగ్ విజయం సాధించడంతో హసీనా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 2024 జనవరిలో మళ్లీ బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా ఎన్నికయ్యారు. మొత్తంగా 1996 నుంచి 2001 వరకు.. ఆ తర్వాత 2009 నుంచి ఆగస్ట్ 5న రాజీనామా చేసే వరకు బంగ్లాదేశ్‌ను పరిపాలించారు. ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం ప్రభుత్వ అధినేతగా వ్యవహరించిన మహిళగా షేక్ హసీనాకు రికార్డ్ ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..