
రోడ్డుపై రయ్‌మంటూ దూసుకొస్తున్న కారు.. అదుపు తప్పి అడ్డదిడ్డంగా వెళ్లడంతో వాహనదారులు హారన్లు మోగిస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి ఆ కారులోని డ్రైవర్‌ను గమనించి షాకయ్యాడు. 91 ఏళ్ల వృద్ధుడు స్టీరింగ్ పైనే స్పృహ కోల్పోయి కనిపించాడు. ఏ క్షణంలోనైనా భారీ ప్రమాదం జరిగేలా ఉండటంతో తన ప్రాణాలకు తెగించి మరీ కారుకు అడ్డంగా తన వాహనాన్ని పెట్టాడు. కారు వచ్చి తన వాహనాన్ని ఢీకొన్నా వెనక్కి తగ్గలేదు. ఆస్ట్రేలియాలో ఈ వ్యక్తి సాహసం ఇప్పుడు అందరి మనసులు గెలుచుకుంటోంది!
దక్షిణ ఆస్ట్రేలియా రాష్ట్రం అడిలైడ్‌లో నవంబర్ 14న స్కాట్ హాలండ్ తన వాహనంలో వెళ్తున్నాడు. ఓ తెల్లటి లెక్సస్ కారు అదుపు తప్పినట్లుగా రోడ్డుపై ప్రయాణించడం గమనించాడు. కారు ఒక లేన్ నుంచి మరో లేన్‌లోకి వెళ్తూ ప్రమాదకరంగా దూసుకెళ్తోంది. దీంతో చుట్టూ ఉన్న వాహనదారులు హారన్లు మోగిస్తున్నారు. అయితే స్కాట్ ఆ డ్రైవర్‌ను తిట్టుకుంటూ పక్కకు వెళ్లిపోలేదు. ఏదో సమస్యలో ఉన్నాడని అనుమానించాడు. వెంటనే ఇతర వాహనాలను దాటి లెక్సస్ కారుకు దగ్గరగా వెళ్లాడు. అక్కడ కనిపించిన దృశ్యం అతడిని మరింత ఆందోళనకు గురిచేసింది. 91 ఏళ్ల వృద్ధుడు స్టీరింగ్‌పై స్పృహ కోల్పోయినట్లుగా వాలిపోయి ఉన్నాడు. ఆ వృద్ధుడు కారు నడిపే పరిస్థితిలో లేడని స్కాట్ గుర్తించాడు.
కారు వేగంగా ముందుకు వెళ్తుండటంతో ఏ క్షణంలోనైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్కాట్ భావించాడు. ముఖ్యంగా ముందున్న హాంప్స్టెడ్ రోడ్డు, ముల్లర్ రోడ్డు కూడలిలోకి కారు దూసుకెళ్తే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారేది. దీంతో తన ప్రాణాలకు, వాహనానికి ఏమవుతుందో కూడా ఆలోచించకుండా స్కాట్ తన వాహనాన్ని లెక్సస్‌కు అడ్డంగా తీసుకెళ్లి బ్రేకులు వేశాడు. వేగంగా వచ్చిన లెక్సస్ కారు స్కాట్ వాహనం వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టి ఆగిపోయింది. దీంతో ఆ కారు కూడలిలోకి దూసుకెళ్లకుండా అడ్డుకోగలిగాడు. ఆ సమయంలో తనకు మరో ఆలోచన రాలేదని, అది క్షణాల్లో తీసుకున్న నిర్ణయమని స్కాట్ చెప్పాడు.
స్ట్రోక్ కారణంగా స్పృహ కోల్పోయిన వృద్ధుడు కొద్దిసేపటికి తేరుకుని తన లెక్సస్ కారును రివర్స్ చేశాడు. ఈ క్రమంలో మరో కారును ఢీకొట్టాడు. పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా మారకుండా స్కాట్ వెంటనే అప్రమత్తమయ్యాడు. కారు ప్యాసింజర్ వైపు నుంచి లోపలికి వెళ్లి ఇంజిన్‌ను ఆఫ్ చేశాడు. అదే సమయంలో ఓ నర్సు కూడా అక్కడికి చేరుకుని సహాయం చేసింది. అంబులెన్స్‌కు సమాచారం అందించి వైద్య సాయం అందేలా ఏర్పాట్లు చేసింది. ఆ వృద్ధుడిని పీటర్ లాడాస్గా గుర్తించారు. ఆయనకు స్ట్రోక్ రావడంతో కారుపై నియంత్రణ కోల్పోయారు. వెంటనే ఆయనను రాయల్ అడిలైడ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పీటర్ కోలుకుంటున్నారని, పరిస్థితి మెరుగ్గా ఉందని ఆయన కుమార్తె వెల్లడించింది.
వాహనం వెనుక భాగం దెబ్బతిన్నప్పటికీ స్కాట్ బాధపడలేదు. ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడగలిగానన్న సంతృప్తి తనకు ఉందని తెలిపాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్కాట్ సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని ప్రశంసించారు. రోడ్డుపై కారు అదుపుతప్పి వెళ్తుంటే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నాడని చాలామంది భావించవచ్చు. కానీ ఆ డ్రైవర్ ప్రాణాపాయ స్థితిలో ఉండవచ్చని స్కాట్ గుర్తించాడు. తన వాహనాన్ని అడ్డుపెట్టి ప్రమాదాన్ని ఆపడంతో పాటు, వెంటనే వైద్య సహాయం అందేలా చేశాడు. ఒక చిన్న అనుమానం.. సమయానికి తీసుకున్న నిర్ణయం.. ఓ నిండు ప్రాణాన్ని కాపాడాయి. ఆస్ట్రేలియాలో స్కాట్ ను జనం ప్రస్తుతం ఓ హీరోలా చూస్తున్నారు.