KimJongUn: కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఇక లేరా.. సోషల్‌ మీడియా ప్రచారంలో నిజమెంత?

Updated on: Oct 22, 2026 | 7:11 PM

ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మృతి చెందారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరగడంతో అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. ఆయనకు బ్రెయిన్‌ హెమరేజ్‌ జరిగి కోమాలోకి వెళ్లారన్న వాదనలకు ఆధారాలు బయటపడలేదు. ఈ నేపథ్యంలో కిమ్‌ తన కుమార్తెతో కలిసి గార్మెంట్‌, ఫుట్‌వేర్‌ ఎగ్జిబిషన్‌ను సందర్శించిన ఫొటోలను ఉత్తర కొరియా అధికారిక మీడియా విడుదల చేసింది. దీంతో ఆయన మరణంపై వచ్చిన వదంతులకు తాత్కాలికంగా తెరపడింది.

ఉత్తర కొరియా.. నియంతృత్వపాలనకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఈ దేశాన్ని చెబుతారు. అందుకే ఈ దేశానికి సంబంధించి ఏ చిన్న వార్త బయటకు వచ్చినా అది ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. అలాంటిది ఆ దేశ సర్వోన్నత నేత..నియంత కిమ్ జోంగ్ ఉన్ గురించి ఏదైనా విషయం బయటకు వచ్చిందంటే.. ప్రపంచం మొత్తం ఫోకస్‌ ఆ దేశంపైనే ఉంటుంది. ముఖ్యంగా అమెరికా, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాలను ఉత్కంఠకు గురిచేస్తుంటాయి. తాగాజా కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆరోగ్యం క్షీణించిందని, ఆయనకు బ్రెయిన్ హెమరేజ్​ అయిందని, కోమాలోకి వెళ్లి మృతి చెందారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ వదంతులకు చెక్ పెడుతూ, ఆ దేశ అధికారిక మీడియా ఆయనకు సంబంధించిన కొత్త ఫొటోలను విడుదల చేసింది. కిమ్ ఓ ఎగ్జిబిషన్‌ను సందర్శించిన ఫొటోలను విడుదల చేసింది. అసలు ఈ వదంతులు ఎక్కడ మొదలయ్యాయి? దీని వెనుక ఉన్న పరిణామాలు ఏంటి? అనే విషయాలపై పూర్తి విశ్లేషణ ఇక్కడ చూద్దాం. అమెరికాలో ఉంటున్న చైనా డెమోక్రసీపార్టీకి చెందిన అసమ్మతివాది వాంజున్ జియా ఆదివారం ‘ఎక్స్’ వేదికగా వరుసగా పోస్టులు పెట్టడంతో కిమ్‌ ఆరోగ్యంపై ఊహాగానాలు మొదలయ్యాయి. తొలుత కిమ్‌ మరణించారని, ఉత్తర కొరియాలో వారసత్వ సంక్షోభం తలెత్తవచ్చన్న ఆందోళనలతో బీజింగ్‌ నుంచి 9,000 మంది సైనికులను ప్యాంగ్యాంగ్‌కు పంపించారని ఆయన పేర్కొన్నట్లు కథనాలు వెల్లడించాయి. ఆ తర్వాత కిమ్‌కు తీవ్రస్థాయిలో మెదడులో రక్తస్రావం జరిగిందని, చికిత్స కోసం బీజింగ్‌లోని పెకింగ్‌ యూనియన్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రి నుంచి వైద్యుల బృందాన్ని ఉత్తర కొరియాకు పంపించారని ఆరోపించారు. కిమ్‌ కోమాలోకి వెళ్లిన అనంతరం బీజింగ్‌కు తరలించారని, అక్కడ వైద్యులు ఆయనను కాపాడలేకపోయారని కూడా పేర్కొన్నారు. కిమ్‌ మృతదేహాన్ని రహస్యంగా తిరిగి ఉత్తర కొరియాకు తీసుకెళ్లారని చెప్పారు. దీంతో వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, ఈ వాదనలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల వివరాలు లేదా స్వతంత్రంగా ధ్రువీకరించగల సమాచారం బయటకు రాలేదు. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మృతి చెందారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి, వస్తున్న వదంతులకు చెక్ పెట్టేందుకు ఉత్తర కొరియా అధికారిక యంత్రాంగం వేగంగా స్పందించింది. ఆ దేశానికి చెందిన ప్రముఖ వార్తాసంస్థ ‘కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ’ కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు సంబంధించిన సరికొత్త ఫొటోలను విడుదల చేసింది. సోమవారం ఆయన తన కుమార్తెతో కలిసి ఒక గార్మెంట్-ఫుట్‌వేర్ ఎగ్జిబిషన్‌ను సందర్శించినట్లు కేసీఎన్ఏ స్పష్టం చేసింది. స్థానిక న్యూస్‌ ఏజెన్సీ విడుదల చేసిన ఫోటోస్‌లో కిమ్ ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఒక ఫొటోలో ఆయన పిల్లల బూట్లను పరిశీలిస్తూ అక్కడి అధికారులకు పలు కీలక సూచనలు ఇస్తుండగా, మరో ఫొటోలో చిన్న గులాబీ రంగు షూను వంగి మరీ పరిశీలించడం కనిపిస్తోంది. అలాగే, మరొక చిత్రంలో చేతులు చాచి అధికారులతో చర్చిస్తున్నట్లు, డమ్మీకి వేసి ఉన్న మహిళల కోటును పరిశీలిస్తున్నట్లు స్పష్టంగా ఉంది. ఈ ఫొటోల ద్వారా కిమ్ క్షేమంగా ఉన్నారనే విషయాన్ని ప్యాంగ్యాంగ్ ప్రపంచానికి చాటిచెప్పింది. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిపై అధికారికంగా ఎలాంటి వైద్య ప్రకటన విడుదల చేయనప్పటికీ, ఆయన బహిరంగంగా కనిపించడమే అతిపెద్ద సమాధానంగా నిలిచింది. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అనారోగ్యం, మరణం గురించిన వదంతులు తీవ్రస్థాయిలో ప్రచారం కావడంతో, ఆ దేశ రాజకీయ భవిష్యత్తుపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. ఒకవేళ కిమ్‌కు నిజంగానే ఏదైనా జరిగితే, ఉత్తర కొరియా తదుపరి పగ్గాలు ఎవరు చేపడతారు అనే ప్రశ్న అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తలెత్తింది. ఈ క్రమంలో కిమ్ సోదరి, అత్యంత శక్తివంతమైన నాయకురాలిగా పేరుగాంచిన కిమ్ యో జోంగ్ అధికార పగ్గాలు చేపట్టే అవకాశం ఉందంటూ విశ్లేషకులు అంచనా వేశారు. ఉత్తర కొరియాలో రాజరికాన్ని తలపించే కుటుంబ పాలన కొనసాగుతున్న తరుణంలో, కిమ్ తర్వాత ఆ దేశాన్ని ఎవరు నడిపిస్తారనే అంశం ఎప్పుడూ అత్యంత సున్నితమైనదే. కిమ్ యో జోంగ్ ఇప్పటికే ప్రభుత్వంలోనూ, అధికారిక పార్టీలోనూ కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో, ఆమె పేరు ఈ సంక్షోభ సమయాల్లో ఎక్కువగా వినిపించింది. అయితే, కిమ్ స్వయంగా ఎగ్జిబిషన్‌లో ప్రత్యక్షం కావడంతో ఈ ఊహాగానాలన్నింటికీ తాత్కాలికంగా తెరపడింది. ఉత్తర కొరియా వంటి అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశంలో.. ఆ దేశాధినేత ఆరోగ్యం అనేది కేవలం ఆ దేశ అంతర్గత విషయమే కాదు, అది అంతర్జాతీయ శాంతిభద్రతలను నేరుగా ప్రభావితం చేసే అంశం. ఉత్తర కొరియా.. సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంచే దేశాల్లో మొదటి స్థానంలో ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందనే కచ్చితమైన సమాచారం బయటకు రావడం చాలా కష్టం. అందువల్లనే, చిన్న వార్త లేదా వదంతు కూడా ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై ఇలాంటి వదంతులు రావడం ఇదేం మొదటిసారి కాదు. 2020 లోనూ ఆయన కొన్ని వారాల పాటు బహిరంగ ప్రదేశాలలో కనిపించకపోవడంతో ఇదే విధంగా బ్రెయిన్ డెడ్ అయ్యారంటూ, మరణించారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత ఆయన అకస్మాత్తుగా ప్రత్యక్షమై ఆ వదంతులన్నింటిని పటాపంచలు చేశారు. ఇప్పుడుకూడా అదే రీతిలో ఫొటోలను విడుదల చేసి.. తన ప్రత్యర్థులకు, వదంతులు పుట్టించే వారికి గట్టి హెచ్చరిక పంపారు. మొత్తానికి, కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మృతి చెందారంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన వార్తలకు ఉత్తర కొరియా విడుదల చేసిన తాజా ఫొటోలు బలమైన చెక్ పెట్టాయి. ఆయన తన కుమార్తెతో కలిసి ఎగ్జిబిషన్‌ను సందర్శించిన దృశ్యాలు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారనే వాస్తవాన్ని చాటిచెప్పాయి. అయినప్పటికీ, గోప్యతకు మారుపేరైన ఆ దేశంలో నాయకత్వ మార్పు, భవిష్యత్ పరిణామాలపై అంతర్జాతీయ మీడియా ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతుంది. తాజా పరిణామాలతో వదంతులకు తాత్కాలికంగా బ్రేక్ పడినప్పటికీ, ఉత్తర కొరియా రాజకీయాలపై భవిష్యత్తులోనూ ఇలాంటి ఊహాగానాలు కొనసాగుతూనే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేవరగట్టు..తలలు పగిలినా తగ్గేదే లే..ఈ రణరంగం వెనుక చరిత్ర ఇదే

Gold Prices Update: స్థిరంగా బంగారం ధర..తగ్గిన వెండి ధర

పాలపిట్టను చూసేదెలా.. దాన్ని పట్టుకుంటే జైలుకే

తగ్గిపోతున్న చందమామ సైజు.. భూమికి ప్రమాదం పొంచి ఉందా!

అంతరిక్షంలోకి వెళ్లిన తొలి పిల్లి .. ఆ తర్వాత..

Loading...
Unable to load recommendations.
Follow Us