సాలె పురుగు కుడితే అంత ప్రమాదమా!
బ్రిటన్‌లో 73 ఏళ్ల గ్లెన్ ప్రీస్ట్లీకి నోబుల్ ఫాల్స్ విడో సాలీడు కుట్టడంతో తీవ్ర ఇన్ఫెక్షన్, కాలి వాపు ఏర్పడ్డాయి. పరిస్థితి విషమించడంతో ఆయన బ్లాక్‌పూల్ విక్టోరియా ఆసుపత్రిలో 18 రోజుల పాటు చికిత్స పొందారు. డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా నొప్పి, వాపు కొనసాగుతున్నాయని తెలిపారు. సాలీడు కాటు తర్వాత నొప్పి, వాపు పెరిగితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
వామ్మో… సాలె పురుగు కుడితే అంత డేంజరా… అంటే అవును డేంజరే.. మనం ఇల్లు శుభ్రం చేసే సమయంలో ఇంటి మూలల్లో చిన్న చిన్న సాలెపురుగులు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కోసారి అవి మన ఒంటిమీదపడి పాకుతూ ఉంటాయి. ఈ చిన్న సాలీడు ఎలాంటి హాని చేయదని తేలిగ్గా తీసుకుంటాం. చేత్తో దులిపేసి మన పని మనం చేసుకుంటుంటాం. ఒక్కోసారి ఈ చిన్న సాలెపురుగులు కుడతాయి కూడా. అదేమంత విషపూరితం కాదులే అని లైట్ తీసుకుంటూ ఉంటాం. కానీ చిన్న పురుగు కాటు కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. అందుకు ఉదాహరణే ఈ ఘటన. చిన్న సాలీడు కాటు మనల్ని ఎంతటి నరకయాతనకు గురి చేస్తుందో ఈ కథనం మనకు తెలియజేస్తుంది. అసలు సాలీడు కాటు వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి? అన్ని సాలీడులు ప్రమాదకరమైనవేనా? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇంగ్లండ్‌లోని బ్లాక్‌పూల్‌కు చెందిన 73 ఏళ్ల గ్లెన్ ప్రీస్ట్లీ తన తల్లిని చూసుకునేందుకు వెళ్లారు. అక్కడ పైఅంతస్తు గదిలో కొన్ని పనులు చేస్తుండగా, ఒక దుప్పటి కింద ఉన్న ఓ చిన్న సాలీడు ఆయనను కుట్టింది. అది కుట్టినప్పుడు సూదితో గుచ్చినట్లుగా చిన్నగా నొప్పి అనిపించింది. అయితే, సాధారణంగా ఇళ్లలో కనిపించే సాధారణ సాలెపురుగేలే అని ఆయన దానిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, కొన్ని గంటలు గడిచేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాలిలో తీవ్రమైన నొప్పి మొదలై, క్రమంగా వాపు పెరిగిపోయింది. కాలు ఎర్రగా మారడంతో పాటు తాకితే చాలా వేడిగా అనిపించింది. నొప్పి భరించలేక మరుసటి రోజు వైద్యులను సంప్రదించగా, వారు వెంటనే ఆసుపత్రికి తరలించారు. గ్లెన్ ప్రీస్ట్లీ కాలిలో వాపు నిమిష నిమిషానికి పెరిగిపోతూనే ఉంది. చివరికి ఆయన కాలు ఒక పెద్ద పుచ్చకాయ పరిమాణంలో ఉబ్బిపోయింది. బ్లాక్‌పూల్ విక్టోరియా ఆసుపత్రిలో చేరిన ఆయనకు వైద్యులు రక్త పరీక్షలతో పాటు ఎంఆర్‌ఐ , సీటీ స్కాన్ , ఎక్స్‌రే వంటి పరీక్షలు అన్నీ చేశారు. ఆయన శరీరంలో ఇన్ఫెక్షన్ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తేలింది. కాలిలో ఈ తీవ్రమైన వాపునకు ‘నోబుల్ ఫాల్స్ విడో’ అనే విషపూరిత సాలీడు కాటే కారణమని వైద్యులు నిర్ధారించారు. బ్రిటన్‌లో కనిపించే ప్రమాదకర సాలీడుల్లో ఇది కూడా ఒకటి. ఈ కాటు కారణంగా గ్లెన్ దాదాపు 18 రోజుల పాటు ఆసుపత్రిలో నరకయాతన అనుభవించాల్సి వచ్చింది. అక్టోబర్ 6న ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటికీ, ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. నెల రోజులు గడిచినా కాలిలో, పాదంలో వాపు తగ్గలేదని, నర్సు రోజూ వచ్చి కట్టు కడుతున్నారని ఆయన తెలిపారు. నొప్పి తీవ్రత 1 నుంచి 10 లోపు అంచనా వేస్తే.. తనకు 9 స్థాయిలో భరించలేని నొప్పి ఉందని ఆయన వాపోయారు. కాటు వేసిన సాలీడు చిన్నదే అయినా, అది చూపిన ప్రభావం చాలా భయంకరమని ఆయన ఓ కార్యక్రమంలో తన అనుభవాన్ని పంచుకున్నారు. ప్రపంచంలో లక్షలాది రకాల సాలీడు జాతులు ఉన్నాయి. వీటిలో అత్యధిక శాతం సాలీడులు కేవలం కీటకాలను తినేవే తప్ప మనుషులకు ఎలాంటి హాని చేయవు. చాలా సాలీడులకు విషం ఉన్నప్పటికీ, వాటి కోరలు మానవుల చర్మాన్ని చీల్చుకుని లోపలికి వెళ్లేంత బలంగా ఉండవు. కాబట్టి ఇళ్లలో కనిపించే సాధారణ సాలీడుల గురించి భయపడాల్సిన అవసరం లేదు. అయితే, కొన్ని రకాల సాలీడులు మాత్రం అత్యంత విషపూరితంగా ఉంటాయి. బ్లాక్ విడో అనే సాలీడు కాటు వేసిందంటే.. నరాల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కండరాల నొప్పులు, కడుపులో విపరీతమైన నొప్పి వస్తాయి. బ్రౌన్ రీక్లూస్ అనే సాలీడు కుట్టిన ప్రదేశంలో చర్మం కుళ్లిపోయి పెద్ద పుండులా ఏర్పడుతుంది. ఇక గ్లెన్‌ను కుట్టిన ఫాల్స్ విడో సాలీడు బ్రిటన్ మరియు యూరప్ దేశాలలో ఎక్కువగా కనిపిస్తుంది. దీని కాటు వల్ల తీవ్రమైన వాపు, జ్వరం, కణజాలం దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి. సాలీడు కుట్టిన వెంటనే పెద్దగా నొప్పి లేకపోయినా, కొద్దిసేపటి తర్వాత దాని ప్రభావం చూపించవచ్చు. ఇంట్లో లేదా బయట ఏదైనా కీటకం లేదా సాలీడు కుట్టినప్పుడు దానిని సాదాసీదాగా తీసుకోకూడదు. నొప్ప, వాపు క్రమంగా పెరుగుతుంటే వెంటనే అలర్ట్ అవ్వాలి. సాలీడు కుట్టిన ప్రదేశాన్ని వెంటనే గోరువెచ్చని నీరు, యాంటీసెప్టిక్ సోపుతో శుభ్రం చేయాలి. వాపు, నొప్పి తగ్గడానికి ఆ ప్రాంతంలో ఐస్ ప్యాక్‌ను కాసేపు ఉంచాలి. క్రమంగా వాపు పెరుగుతూ.. విపరీతమైన నొప్పి వస్తుంటే ఇంటి చిట్కాలు పాటిస్తూ కాలయాపన చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. సకాలంలో చికిత్స తీసుకుంటే పెద్ద ప్రమాదాల నుంచి ప్రాణాలను కాపాడుకోవచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పండగ రద్దీకి చెక్.. దీపావళికి స్పెషల్ రైళ్లుప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్
పెన్షనర్లకు బిగ్ షాక్! డిసెంబర్ 31 లోపు ఇది చేయాల్సిందే.. లేకపోతే
చుక్క నీటిని వృథా చేసినా.. చుక్కలు చూస్తారు.. హైదరాబాద్ వాసులకు జలమండలి వార్నింగ్
