చైనాలో గుడ్డు కూర ధర ఎంతో తెలుసా? సాధారణ వంటకం ఎందుకంత ఖరీదైందంటే?
చైనాలోని షాంఘైలో ఓ రెస్టారెంట్ సాధారణ టమాటా-గుడ్డు కూరను ఏకంగా రూ.7,300కు విక్రయిస్తూ చర్చనీయాంశమైంది. ఇందులో జర్మనీ నుంచి దిగుమతి చేసిన ఈము గుడ్డు, నెదర్లాండ్స్ ప్రీమియం టమాటాలను ఉపయోగించడం వల్లే ఈ ధర నిర్ణయించినట్లు చెబుతున్నారు. రోజుకు కేవలం ఒకే ప్లేట్ మాత్రమే తయారు చేయడంతో ఈ వంటకం విలాసవంతమైన డైనింగ్ అనుభవంగా మారింది.
సాధారణంగా కర్రీపాయింట్‌లో కొనే కర్రీ ధర ఎంత ఉంటుంది.. మహా అంటే 30 రూపాయలు.. అదే నాన్ వెజ్ అయితే 60 రూపాయలు ఉంటుంది. ఇటీవల నిత్యావసరాల ధరలు పెరిగాయి కాబట్టి ఇప్పుడు ధర మరింత పెరిగి ఇద్దరికి సరిపడే ఓ నాన్‌వెజ్ కర్రీ ధర 100 రూపాయలకు చేరి ఉండొచ్చు. అదే రెస్టారెంట్స్‌లో అయితే 200 రూపాయలు ఉండొచ్చు.. అంతేకానీ, మరీ వేలల్లో అయితే ఉండదు కదా.. కానీ చైనాలో మనం ఇంట్లో సాధారణంగా వండుకునే టమాట-ఎగ్ కర్రీ ఏకంగా 7,300కు పైగా వసూలు చేస్తుండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. షాంఘైలోని జిన్‌లాంగ్ డాబియన్‌లూ రెస్టారెంట్ అందిస్తున్న ఈ వంటకంలో వాడే పదార్థాల వల్లే ఈ కూరకు అంత ధరను వసూలు చేస్తున్నారట. ఇందులో సాధారణ కోడి గుడ్లకు బదులుగా.. జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న అరుదైన, భారీ ‘ఈము గుడ్డు’ను ఉపయోగిస్తున్నారు. ఈ ఒక్క గుడ్డు ధరే సుమారు రూ.2,100 ఉంటుంది. అలాగే, ఇందులో వాడే టమాటాలు కూడా సాధారణమైనవి కావు. నెదర్లాండ్స్‌కు చెందిన ప్రీమియం క్వాలిటీ, ఎక్కువ జ్యూసీగా ఉండే ప్రొవెన్స్ రకం టమాటాలను వాడుతున్నారు. వీటి ఖరీదే రూ.700 పైమాటే ఉంటుందట. ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఈ ఈము గుడ్డు పెంకు చాలా గట్టిగా ఉండటంతో.. దీన్ని పగలగొట్టడానికి చెఫ్‌లు ఒక చిన్న సుత్తిని ఉపయోగిస్తారట. అయితే, వండే విధానం మాత్రం మన సాధారణ కూరలాగే ఉంటుంది. ఈ వంటకానికి ఇంత డిమాండ్ పెరగడానికి మరో ముఖ్య కారణం.. ఈ రెస్టారెంట్‌లో రోజుకు కేవలం ఒకే ఒక్క ప్లేట్ టమాటా-గుడ్డు కూరను మాత్రమే తయారు చేస్తారు. అది కూడా ముందస్తుగా బుక్ చేసుకున్న విఐపి కస్టమర్లకి మాత్రమేనట. పైగా దీని ధరను సాధారణ హోటల్ లెక్కల ప్రకారం నిర్ణయించలేదట. ఈ వంటకం ఇప్పుడు చైనా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఇంట్లో సులభంగా చేసుకునే వంటకానికి ఇంత భారీ ధర చెల్లించడం అవసరమా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రత్యేక అనుభవం కోసం ఖర్చు చేయాలా? వద్దా? అనేది పూర్తిగా కస్టమర్ల ఇష్టమని అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ.. దేని నుంచి తయారు చేస్తారో తెలిస్తే..
