మనిషి మొహంలో పిల్లి రూపం.. బ్రెయిన్ సర్జరీ తర్వాత యువకుడికి వింత వ్యాధి
మెదడు శస్త్రచికిత్స తర్వాత కార్ల్ అనే 28 ఏళ్ల యువకుడికి అరుదైన నాడీ సంబంధిత రుగ్మత ఎదురైంది. ప్రొసోపోమెటమార్ఫాప్సియా అనే ఈ సమస్య కారణంగా మనుషుల ముఖాల్లో పిల్లి కళ్లు, బొచ్చు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అలాగే పెంపుడు పిల్లిలో మనుషుల ముఖ లక్షణాలు కనిపిస్తుండటం వైద్య నిపుణులను ఆశ్చర్యపరిచింది. ఈ వింత కేసు వివరాలు అంతర్జాతీయ సైన్స్ జర్నల్ కార్టెక్స్లో ప్రచురితమయ్యాయి.
ఎదురుగా ఉన్న తోటి మనుషులను చూస్తే సాధారణ ముఖాలకు బదులు పిల్లి లక్షణాలు కనిపిస్తే ఎలా ఉంటుంది? కనుపాపలు పెద్దవై, చర్మంపై పిల్లి బొచ్చు ఉన్నట్లు, వింతైన కనుబొమ్మలతో వికృతంగా కనిపిస్తే ఆ ఊహే వెన్నులో వణుకు పుట్టిస్తుంది. కార్ల్ అనే 28 ఏళ్ల యువకుడు మెదడు శస్త్రచికిత్స తర్వాత సరిగ్గా ఇలాంటి వింతైన, అరుదైన నాడీ సంబంధిత రుగ్మత బారిన పడ్డాడు. సైన్స్ ప్రపంచాన్నే విస్మయానికి గురిచేసిన ఈ వింత కేసు వివరాలు ప్రముఖ అంతర్జాతీయ సైన్స్ జర్నల్ ‘కార్టెక్స్’లో ప్రచురితమయ్యాయి. కార్ల్ మెదడులోని కుడి భాగంలో రక్తనాళాల అసాధారణ కలయిక కారణంగా తీవ్ర సమస్య ఏర్పడింది. దీంతో వైద్యులు ఆ భాగాన్ని తొలగించడానికి సర్జరీ చేశారు. ముఖాలను గుర్తించడంలో, విశ్లేషించడంలో కీలక పాత్ర పోషించే టెంపోరల్ లోబ్ ప్రాంతంలో ఈ ఆపరేషన్ జరిగింది. ఆ శస్త్రచికిత్స విజయవంతమైనప్పటికీ, కార్ల్ దృష్టిలో ఊహించని మార్పులు మొదలయ్యాయి. వైద్య పరిభాషలో దీనిని ‘ప్రొసోపోమెటమార్ఫాప్సియా’ (Prosopometamorphopsia) అని పిలుస్తారు. దీనివల్ల బాధితులకు ఎదుటి వ్యక్తుల ముఖాలు వికృతంగా, వంకరతిరిగినట్లుగా కనిపిస్తాయి. కార్ల్ విషయంలో ఈ లక్షణాలు మరింత విచిత్రంగా మారాయి. తోటి మనుషులను చూసినప్పుడు వారి కళ్లు పిల్లి కళ్లలాగా మారడం, కంటి పాపలు విస్తరించడం, ముఖంపై అక్కడక్కడా పిల్లి బొచ్చు ఉన్నట్లు అనిపించడం మొదలైంది. ఇంతటితో ఆగకుండా, ఇంట్లో పెంచుకునే పిల్లిని చూసినప్పుడు మనుషుల ముఖ లక్షణాలు, వారి కళ్ల ఆకారాలు కనిపిస్తుండటం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాకుండా ఒకరి ముఖ కవళికలు మరొకరిపైకి మారిపోతున్నట్లు కూడా అతడు అనుభూతి చెందుతుంటాడు. శస్త్రచికిత్స జరిగిన రెండేళ్ల నుంచి ఈ లక్షణాలు క్రమం తప్పకుండా వస్తున్నాయని, కొన్నిసార్లు గంటల తరబడి ఉంటాయని వైద్య నిపుణులు తెలిపారు. మానవ మెదడులో ముఖాలకు సంబంధించిన జ్ఞాపకాలు నిక్షిప్తమై ఉంటాయని, కార్ల్ మెదడు ఆ పాత జ్ఞాపకాలను ప్రస్తుతం చూస్తున్న దృశ్యాలతో కలగాపులగం చేస్తోందని వివరించారు. దీనివల్ల పిల్లి పోలికలు మనుషులకు, మనుషుల పోలికలు పిల్లులకు అతుక్కుపోయినట్లు మెదడు భ్రమింపజేస్తోందని స్పష్టం చేశారు. ఈ వ్యాధి బాధితులు సమాజంలో తిరగడానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖాలు సాగిపోయినట్లు, స్థానభ్రంశం చెందినట్లు కనిపించడం వల్ల ఇతరులతో మాట్లాడటం అసౌకర్యంగా మారుతుంది. బయటకు చెబితే పిచ్చివాడిగా చూస్తారేమోనన్న భయంతో చాలామంది ఈ సమస్యను దాచిపెడతారు. కార్ల్ కూడా మొదట్లో తీవ్ర ఇబ్బంది పడ్డా, ప్రస్తుతం ఆ వింత దృశ్యాల నడుమే జీవించడం అలవాటు చేసుకున్నాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bird Flu: బర్డ్ ఫ్లూ టైమ్లో చికెన్ తినవచ్చా?
ఉదయం టీతో బిస్కెట్లు తీసుకుంటున్నారా? నెలరోజుల్లో మీ ఆరోగ్యంలో జరిగే మార్పు ఇదే!
సెలబ్రిటీలకే కాదు సామాన్యులకూ ముప్పే.. అలాంటి వాటిని కట్టడి చేయండి
