ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ.. దేని నుంచి తయారు చేస్తారో తెలిస్తే..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీగా పేరొందిన ‘కోపి లువాక్’ ఇండోనేషియాలో ఉత్పత్తి అవుతుంది. ఆసియన్ పామ్ సివెట్ అనే జంతువు విసర్జించిన కాఫీ గింజలను ప్రత్యేక శుభ్రతా ప్రక్రియ తర్వాత ప్రాసెస్ చేసి ఈ కాఫీ తయారు చేస్తారు. ప్రత్యేక రుచి, పరిమిత ఉత్పత్తి కారణంగా దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే జంతు సంక్షేమంపై ఆందోళనల కారణంగా అడవుల్లో సహజంగా సేకరించిన గింజలతో తయారైన ఉత్పత్తులనే నిపుణులు ప్రాధాన్యంగా సూచిస్తున్నారు.
కాఫీ… ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఎంతో ఇష్టంగా తాగే పానీయం. ఉదయాన్నే ఒక కప్పు కాఫీ శరీరానికి ఉత్తేజాన్నిస్తుంది. సాయంత్రం తాగే కాఫీ పని ఒత్తిడినుంచి ఉపశమనం కలిగిస్తుంది.. అయితే, ఈ కాఫీ ఎలా తయారవుతుందో తెలుసా.. అసలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ ఏదో తెలుసా.. నిజానికి మనం తాగే ప్రతి కాఫీ సాధారణ కాఫీ తోటల్లో చెట్లనుంచి సేకరించిన గింజలతో తయారవుతుందనుకుంటే పొరపాటే. కొన్ని కాఫీలు జంతువుల మలంతో తయారవుతాయంటే నమ్ముతారా… నమ్మకం మాట అలా ఉంచు.. కాఫీ పేరెత్తితే వాంతొస్తుంది అంటారా… కానీ మీరు విన్నది నిజం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ ఒకటి ఉంది. అది ఒక వింత జంతువు విసర్జించే మలం నుండి తయారుచేస్తారు. దశాబ్దాలుగా ఆహార ప్రియులను ఆశ్చర్యపరుస్తున్న ఈ అసాధారణ కాఫీ పేరే ‘కోపి లువాక్’. మన అరకు కాఫీలాగా.. ఈ విచిత్రమైన కాఫీకి అసలైన చిరునామా ఇండోనేషియా. డచ్ వలస పాలన కాలంలో ఇండోనేషియాలో ఈ కాఫీ తయారీ విధానం వెలుగుచూసింది. ప్రస్తుతం ఇది ప్రధానంగా సుమత్రా, జావా, బాలి, సులవేసి ద్వీపాలలో భారీగా ఉత్పత్తి అవుతోంది. వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి ఆగ్నేయాసియా దేశాలలో కూడా ఇది కొద్దిగా లభిస్తున్నప్పటికీ, ఇండోనేషియానే దీని పుట్టిల్లుగా ప్రసిద్ధి చెందింది. బాలి, సుమత్రా దీవులకు వెళ్లే పర్యాటకులు అక్కడి ప్రత్యేక కాఫీ తోటలలో, కేఫ్‌లలో ఈ అసలైన కోపి లువాక్ రుచిని ఆస్వాదించవచ్చు. ఈ కాఫీ గింజలను చెట్ల నుండి నేరుగా కోయరు. ఆగ్నేయాసియా అడవుల్లో నివసించే ‘ఆసియన్ పామ్ సివెట్’ అనే ఒక చిన్న, పిల్లి లాంటి క్షీరదం ద్వారా ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఈ జంతువు… తోటల్లో బాగా పండిన కాఫీ పండ్లను ఏరి తింటుంది. ఆ పండులోని పై గుజ్జు మాత్రమే దాని పొట్టలో జీర్ణమవుతుంది. కానీ, లోపల ఉండే కాఫీ గింజలు మాత్రం జీర్ణం కాకుండా, ఆ జంతువు విసర్జించే మలం ద్వారా సహజంగా బయటకు వచ్చేస్తాయి. ఈ జంతువు పొట్టలోని సహజ ఎంజైమ్‌లు జీర్ణక్రియ సమయంలో ఆ కాఫీ గింజల రసాయన రూపాన్ని మారుస్తాయి. దీనివల్ల కాఫీలోని చేదుతనం పూర్తిగా తగ్గిపోయి, అద్భుతమైన మృదుత్వం వస్తుంది. ఇలా విసర్జించిన గింజలను కాఫీ తోటల కార్మికులు జాగ్రత్తగా సేకరించి, అనేక రకాలుగా వాటిని శుభ్రం చేసి, ఆరబెడతారు. ఆ తర్వాత వాటిని ప్రత్యేకంగా వేయించి కాఫీ పొడిని తయారు చేస్తారు. ఈ కాఫీ చాలా తక్కువ పరిమితిలో లభిస్తుంది. ఎందుకంటే.. అడవుల్లో తిరిగి ఆ జంతువుల మలాన్ని సేకరించడం ఎంతో శ్రమతో, ఖర్చుతో కూడుకున్న పని. అలాగే, దీని ప్రాసెసింగ్ కోసం అత్యంత కఠినమైన శుభ్రతా ప్రమాణాలు పాటిస్తారు. ఈ కారణాల వల్ల మార్కెట్లో అసలైన కోపి లువాక్ కేజీ ధర వందల నుండి వేల డాలర్ల వరకు పలుకుతుంది. ఈ కాఫీని తాగిన నిపుణులు దీని రుచిని అద్భుతంగా వర్ణిస్తారు. ఇందులో చేదు చాలా తక్కువగా ఉంటుందని, మట్టి వాసనతో కూడిన చాక్లెట్, క్యారమెల్ లాంటి తీపి ఛాయలు కలగలిసి సరికొత్త అనుభూతిని ఇస్తుందని చెబుతారు. కాఫీ ప్రియులకు ఇదొక విలాసవంతమైన పానీయం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
