కార్లు, బస్సులే కాదు ఇకపై రైళ్లు కూడా ఆన్‌లైన్‌లో అద్దెకు!

Updated on: Oct 26, 2026 | 1:36 PM

పెళ్లిళ్లు, విహారయాత్రలు, ఇతర శుభకార్యాల కోసం భారతీయ రైల్వేలో ఒక కోచ్‌ను లేదా మొత్తం రైలును అద్దెకు తీసుకునే సదుపాయం ఉంది. ఐఆర్‌సీటీసీ ఎఫ్‌టీఆర్‌ విధానం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రయాణ తేదీకి ముందుగానే రూట్‌, ప్రయాణికుల వివరాలు నమోదు చేయాలి. కోచ్‌కు రూ.50 వేల రిఫండబుల్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ అవసరం. తుది ఛార్జీలు రైల్వే నిబంధనలు, ప్రయాణ వివరాల ఆధారంగా నిర్ణయిస్తారు.

సాధారణంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు లేదా విహారయాత్రలకు వెళ్లాలనుకున్నప్పుడు కార్లు, బస్సులను అద్దెకు తీసుకోవడం చూస్తుంటాం. అయితే ఇప్పుడు ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే ఐఆర్‌సీటీసీ ద్వారా ఏకంగా ఒక బోగీని లేదా మొత్తం రైలునే అద్దెకు తీసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం రైల్వే స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. రైలును అద్దెకు తీసుకునే ఈ విధానాన్ని ‘ఫుల్ టారిఫ్ రేట్’ బుకింగ్ అంటారు. ప్రయాణానికి కనీసం 30 రోజుల నుంచి ఆరు నెలల ముందుగా ఐఆర్‌సీటీసీ ఎఫ్‌టీఆర్‌ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మనం ప్రయాణించాలనుకుంటున్న రూట్, ప్రయాణికుల సంఖ్య వివరాలను నమోదు చేస్తే.. రైల్వేశాఖ ఆ రూట్‌లో కోచ్‌లు, రైళ్ల అందుబాటును బట్టి కన్ఫర్మేషన్ లెటర్‌ను ఈ-మెయిల్ లేదా ఫోన్‌కు పంపుతుంది. ఒక కోచ్‌ బుకింగ్‌కు రూ. 50,000 రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రూట్, ఎంచుకున్న కోచ్ రకాన్ని బట్టి రైల్వే అధికారులు నిర్ణయించిన చార్జీలు చెల్లిస్తే బుకింగ్ పూర్తవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 50 రైళ్లకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ఒక రైలులో గరిష్ఠంగా 22 కోచ్‌ల వరకు బుక్ చేసుకునే అవకాశం ఉంది. స్లీపర్, త్రీటైర్ ఏసీ, టూటైర్ ఏసీ, ఫస్ట్ ఏసీ కోచ్‌లను మన అవసరానికి తగినట్లు ఎంచుకోవచ్చు. ఇలా బుక్ చేసుకున్న వారికి ఐఆర్‌సీటీసీ ఆహార సదుపాయాన్ని కూడా కల్పిస్తుంది. రైలును లేదా కోచ్‌ను బుక్ చేసుకోవడం వల్ల ఎక్కువ మంది బంధువులు, మిత్రులతో కలిసి ప్రయాణించేటప్పుడు అందరికీ ఒకేచోట సీట్లు లభిస్తాయి. పైగా ప్రైవేట్ వాహనాల కంటే తక్కువ ఖర్చుతో, ఎంతో సురక్షితంగా దూర ప్రాంతాలకు ప్రయాణించవచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒకసారి వెలిగించిన ప్రమిదను.. మళ్లీ పూజకు వాడొచ్చా?

Loading...
Unable to load recommendations.
Follow Us