Nizamabad: నిమిషాల వ్యవధిలో ఏటీఎం కార్డు మార్చి డబ్బు లూటీ

Updated on: Nov 16, 2026 | 3:49 PM

నిజామాబాద్ జిల్లాలో ఏటీఎం కార్డును మార్చి లక్షన్నర రూపాయల మోసం చేసిన ఘటన వెలుగుచూసింది. బాధితురాలు సుజాత ఏటీఎం నుంచి డబ్బులు తీస్తుండగా, సాయం చేస్తానన్న నెపంతో మోసగాడు ఆమె కార్డును మార్చేశాడు. మూడు నెలల తర్వాత ఈ మోసం బట్టబయలు కాగా, ఆర్ముర్ పోలీసులు విచారణ చేపట్టారు. ఏటీఎంల వద్ద జాగ్రత్తగా ఉండాలని ఎస్సై రజినీకాంత్ ప్రజలను హెచ్చరించారు.

ఏటీఎం మోసాలు పెరుగుతున్నాయని మరో సంఘటన వెల్లడించింది. నిజామాబాద్‌లో జక్రాన్‌పల్లి మండలం మునిపల్లికి చెందిన సుజాత అనే మహిళ తన ఏటీఎం కార్డును మోసగాళ్ల చేతిలో పోగొట్టుకుని లక్షన్నరకు పైగా కోల్పోయింది. ఆగస్టు నెలలో డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్లినప్పుడు, పక్కనే ఉన్న ఓ కేటుగాడు సాయం చేసే నెపంతో ఆమె కార్డును మార్చేశాడు. డబ్బులు లెక్కించుకునే లోపే ఆమె చేతిలో వేరే కార్డు పెట్టాడు. సుజాత కొన్ని నెలల పాటు తన కార్డు మారిందని గుర్తించలేదు. ఇటీవల ఆమె భర్త పంపిన రూ. 55,000 చిట్టీ డబ్బులు డ్రా చేసేందుకు బ్యాంకుకు వెళ్లగా, అకౌంట్‌లో రూపాయి కూడా లేదని తెలిసింది. దీంతో ఆమె షాక్‌కు గురైంది. స్టేట్‌మెంట్ పరిశీలించగా, తన అకౌంట్ నుంచి సుమారు లక్షన్నర రూపాయలు మాయమైనట్లు తేలింది. మోసగాడు ఇచ్చిన కార్డు ఖలీల్ అనే పేరుతో ఉందని గుర్తించారు. ఈ ఘటనపై ఆర్ముర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఏటీఎంల వద్ద గుర్తు తెలియని వ్యక్తులను నమ్మవద్దని, అప్రమత్తంగా ఉండాలని ఆర్ముర్ ఎస్సై రజినీకాంత్ ప్రజలను కోరారు.

Loading...
Unable to load recommendations.
Follow Us