దుబాయ్ ఫ్లైట్ లో కత్తిపోట్లు..విమానంలో అసలేం జరిగింది?ప్రాణాలకు తెగించి పోరాడిన కెప్టెన్
దుబాయ్ నుంచి టెల్‌అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ FZ1073 విమానంలో కాక్‌పిట్‌లో జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్ గాయపడినప్పటికీ కాక్‌పిట్ డోర్ తెరవడంతో ప్రయాణికులు, సిబ్బంది జోక్యం చేసుకున్నారు. విమానం 30 సెకన్లలో 14 వేల అడుగులకు పైగా ఎత్తు కోల్పోయింది. విమానంలోని మరో ఇద్దరు పైలట్ల సహకారంతో విమానాన్ని అదుపులోకి తెచ్చి సౌదీ అరేబియాలోని తబూక్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
ఒక్కసారి ఊహించుకోండి.. వేల అడుగుల ఎత్తులో ఓ విమానం ప్రయాణిస్తోంది. విమానం నడపాల్సిన కాక్‌పిట్‌లోనే ఇద్దరు పైలట్ల మధ్య తీవ్ర ఘర్షణ మొదలైతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక ఆ ఘర్షణలో పైలట్ తీవ్రంగా గాయపడి.. విమానం ఒక్కసారిగా వేల అడుగుల ఎత్తు కోల్పోతే..! ఆ విమానంలో ఉన్న ప్రయాణికుల పరిస్థితి ఏంటి? ఇలాంటి భయానక ఘటన ఫ్లైదుబాయ్ FZ1073 విమానంలో జరిగింది. దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఈ విమానంలో 174 మంది ప్రయాణికులు ఉన్నారు. బోయింగ్ 737 విమానం గాల్లో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా కాక్‌పిట్‌లో పరిస్థితి మారిపోయింది. దుబాయ్ నుంచి విమానం టేకాఫ్ అయిన దాదాపు రెండున్నర గంటల తర్వాత కాక్‌పిట్‌లో ఘర్షణ చోటుచేసుకుంది. ఆ దాడితో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. విమానం వేగంగా ఎత్తును కోల్పోవడం మొదలైంది. ఫ్లైట్ డేటా ప్రకారం.. కేవలం 30 సెకన్లలోనే విమానం దాదాపు 14 వేల అడుగుల మేర కిందికి దిగింది. అంటే.. కొన్ని క్షణాల్లోనే ప్రయాణికులు వేల అడుగుల ఎత్తు నుంచి కిందికి పడిపోతున్న పరిస్థితి. విమానం ఎందుకు ఇలా కిందికి వెళ్తుందో తెలియక ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళన మొదలైంది. అప్పటికే కాక్‌పిట్‌లో కెప్టెన్ స్మిత్ మచ్చార్ తీవ్రంగా గాయపడ్డారు. శరీరం నుంచి రక్తం కారుతోంది. తనపై దాడి చేస్తున్న కో-పైలట్‌ను ఎదుర్కొంటూనే..ప్రాణాలకు తెగించి కాక్‌పిట్ డోర్‌ను తెరిచారు. వెంటనే ప్రయాణికులు, సిబ్బంది లోపలికి దూసుకెళ్లారు. వారిలో ఇజ్రాయెల్‌కు చెందిన యానివ్ అనే ప్రయాణికుడు కూడా ఉన్నారు. కో-పైలట్‌ను అదుపులోకి తీసుకునేందుకు అతడితోపాటు మరికొందరు ప్రయాణికులు తీవ్రంగా పోరాడారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు ఆఫ్‌డ్యూటీ పైలట్లు కూడా వెంటనే రంగంలోకి దిగారు. కాక్‌పిట్ నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకుని విమానాన్ని అదుపులోకి తెచ్చారు. చివరకు ఫ్లైదుబాయ్ విమానం సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయంలో అత్యవసరంగా సురక్షితంగా ల్యాండ్ అయింది. అలా విమానంలోని 174 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. అసలు కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఎవరు? భారతీయుడైన స్మిత్ మచ్చర్‌కు బోయింగ్ 737 విమానాలపై 9 వేల 750 గంటలకు పైగా ప్రయాణ అనుభవం ఉంది. 2011లో స్పైస్‌జెట్‌లో చేరి దాదాపు పదకొండేళ్లు పనిచేశారు. సీనియర్ కమాండర్‌గా, ఇతర పైలట్లకు శిక్షణ ఇచ్చే లైన్ ట్రైనింగ్ కెప్టెన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2022 జూన్‌లో ఫ్లైదుబాయ్‌లో కెప్టెన్‌గా చేరారు. వేల గంటల అనుభవం ఉన్న భారతీయ పైలట్‌కు ఈసారి ఎదురైంది మాత్రం ఏ శిక్షణలోనూ ఊహించలేని పరిస్థితి. తనపై దాడి జరుగుతున్నా ఎదురొడ్డి నిలబడటం.. సిబ్బంది, ప్రయాణికుల సహకారంతో ప్రమాదాన్ని తప్పించడంతో మచ్చర్ సాహసాన్ని ప్రపంచమంతా కొనియాడుతోంది. మరోవైపు, దాడికి పాల్పడిన కో-పైలట్ ఒమన్ జాతీయుడని తెలుస్తోంది. అయితే, ఇజ్రాయెల్-ఒమన్ మధ్య దౌత్య సంబంధాలు లేవు. అలాంటప్పుడు టెల్‌అవీవ్‌కు వెళ్లే విమానంలో ఒమన్ పౌరుడిని ఎలా అనుమతించారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా అరబ్-గల్ఫ్ దేశాల నుంచి ఇజ్రాయెల్ గగనతలంలోకి వచ్చే విమానాలకు కఠిన స్క్రీనింగ్ ఉంటుంది. ఒకవేళ, ఆ కో-పైలట్‌కు ద్వంద్వ పౌరసత్వం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఇజ్రాయెల్ అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రపంచం మొత్తం పైలట్ సాహసాన్ని కొనియాడుతున్న వేళ.. ఆయన గతంలో ఒక పాడ్‌కాస్ట్‌లో చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. “విపత్కర వేళ 200 శాతం శ్రమించాలి, ఏళ్ల శిక్షణ.. క్లిష్ట సమయాల్లో అండగా నిలవడానికే” అని స్మిత్ అప్పట్లో చెప్పారు. సరిగ్గా ఆ మాటలనే నిజం చేస్తూ, శరీరంలో కత్తి దిగినా.. ఏమాత్రం బెదరకుండా కాక్ పీట్ డోర్ తెరిచి.. 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. మరోవైపు సౌదీ అరేబియాలోని తబూక్ ఆసుపత్రిలో పైలట్ స్మిత్‌కు చికిత్స అందించారు. ఆయనకు శస్త్రచికిత్స కూడా జరిగినట్లు, ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. అటు భారత అధికారులు సౌదీ అరేబియా, యూఏఈ అధికారులతో సంప్రదింపులు జరిపారు. కెప్టెన్ కుటుంబసభ్యులు కూడా సౌదీ అరేబియాకు వెళ్లారు. అలాగే, దాడికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కో-పైలట్‌ను సౌదీ అధికారులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు అసలు కారణం, దాడి వెనుక ఉద్దేశం ఏమిటన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని.. తీవ్రంగా గాయపడినా ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు కెప్టెన్ మచ్చర్ చూపిన ధైర్యాన్ని ప్రశంసించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రదర్శించిన అద్భుత ధైర్యాన్ని ప్రపంచ నేతలు సైతం కొనియాడారు. ఓవల్ ఆఫీస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘స్మిత్ తీవ్రమైన గాయాలపాలైనా సమయస్ఫూర్తితో వ్యవహరించి రియల్ హీరోగా నిలిచారని, ఇదొక అద్భుతమైన సంఘటన’అన్నారు. తీవ్రంగా గాయపడినా వెనకడుగు వేయకుండా ప్రయాణికులను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చార్ అసాధారణ ధైర్యానికి నా సెల్యూట్ అంటూ ప్రశంసిచారు. అలాగే కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ప్రశంసించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ కాక్‌పిట్ డోర్ తెరిచి ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వచ్చి దాడిచేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకునే అవకాశం కల్పించారని పేర్కొన్నారు. ఇలా.. కాక్‌పిట్‌లో జరిగిన ఒక్క ఘర్షణతో విమానం ఒక్కసారిగా ప్రమాదంలో పడింది. కానీ కెప్టెన్, ప్రయాణికులు, సిబ్బంది, ఆఫ్ డ్యూటీ పైలట్ల సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rama Nandana: అమ్మో.. ఆ రోజును అస్సలు మరచిపోలేను
ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. రూ.35కే కిలో ఉల్లిగడ్డలు.. ఆధార్ ఉంటే చాలు!
Rabi Crops: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపు!
45 లక్షల కట్నం, బంగారం ఇచ్చినా తీరని దాహం.. వరకట్న వేధింపులకు నవవధువు బలి
Urvashi Rautela: AI సంస్థకి హీరోయిన్ ఝలక్.. రూ.7000 కోట్లు డిమాండ్
