నా 3 కోట్లు నాకు ఇప్పించండి…కోర్టుకెక్కిన ఐబొమ్మ రవి

Updated on: Sep 17, 2026 | 11:18 AM

ఐబొమ్మ మాజీ నిర్వాహకుడు ఇమంది రవి (ఐబొమ్మ రవి) తన బ్యాంకు ఖాతాల్లో స్తంభించిపోయిన రూ. 3 కోట్లు తనకు తిరిగి ఇప్పించాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. సినీ పైరసీ కేసులో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నానని రవి పిటిషన్ దాఖలు చేశాడు.

ఐబొమ్మ మాజీ నిర్వాహకుడు ఐబొమ్మ రవి అలియాస్ ఇమంది రవి తాజాగా నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. సినీ పైరసీ కేసులో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు తన బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో, అందులో ఉన్న రూ. 3 కోట్లు అలాగే నిలిచిపోయాయని రవి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని, కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తన స్తంభించిన బ్యాంక్ ఖాతాలను తిరిగి ఇప్పించాలని రవి న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై నాంపల్లి తొమ్మిదవ అదనపు చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణ చేపట్టనుంది. ఐబొమ్మ రవి విశాఖపట్నంకు చెందిన వాడు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కు వచ్చి, ఆ తర్వాత పైరసీ వ్యవహారంతో కోట్లు సంపాదించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో విదేశాల్లో ఉన్న రవి, కుటుంబ వివాదాల కారణంగా హైదరాబాద్‌కు తిరిగి రాగానే పోలీసులు అరెస్టు చేశారు. సినీ పైరసీతో పాటు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారంలోనూ రవి పాత్రపై దర్యాప్తు జరుగుతోంది. దాదాపు మూడు నెలల పాటు జైల్లో ఉన్న రవికి గత ఫిబ్రవరి 17న తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Published on: Sep 17, 2026 11:18 AM
Loading...
Unable to load recommendations.
Follow Us