800+ సిబిల్‌ స్కోరు కొందరికే.. ఎందుకిలా?

Updated on: Jan 19, 2026 | 9:38 AM

తక్కువ వడ్డీకే రుణాలు పొందాలన్నా, లోను త్వరగా మంజూరవ్వాలన్నా మీ క్రెడిట్‌ స్కోరు బావుండాలి. గుడ్‌ క్రెడిట్‌ స్కోరు ఉంటే లోను విషయంలో బ్యాంకులు, ఫైనాన్స్‌ కంపెనీలతో వడ్డీ విషయంలో బేరమాడే అవకాశం ఉంటుంది. మీ క్రెడిట్‌ స్కోరు 800+ ఉంటే దీర్ఘకాలంలో వడ్డీరేట్లపై పెద్ద మొత్తంలో ఆదా చేసుకోవచ్చు. కానీ, 800+ సిబిల్ స్కోరు చాలా తక్కువమందికే ఉంటుంది. మరి ఈ సిబిస్కోరును పెంచుకోవాలంటే ఏం చేయాలి? వాస్తవానికి సిబిల్‌ స్కోరు, క్రెడిట్ స్కోరు ఒకటి కాదు. ఆర్బీఐనుంచి లైసెన్స్‌ పొందిన కొన్ని సంస్థలు మాత్రమే క్రెడిట్‌ స్కోరును జారీ చేస్తాయి. అందులో ఈక్విఫాక్స్‌, ఎక్స్‌పీరియన్‌, సీఆర్‌ఐఎఫ్‌ హైమార్క్‌ వంటి సంస్థలు ఉన్నాయి. ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ కూడా వీటిలో ఒకటి. అయితే, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎక్కువగా సిబిల్‌నే ప్రామాణికంగా తీసుకుంటాయి. దీంతో క్రెడిట్‌ స్కోరు అనే పదానికి సిబిల్‌ ప్రత్యామ్నాయంగా మారింది.

సిబిల్‌ స్కోరు రేంజ్‌ 300 నుంచి 900 వరకు ఉంటుంది. 800 కంటే ఎక్కువ సిబిల్‌స్కోరు ఉన్నవారు ఎక్సలెంట్‌ కేటగిరీ కిందకు వస్తారు. కానీ, 800, అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉన్నవారు 20 శాతం లోపే ఉంటారని అంచనా. చాలామంది 700 నుంచి 800 మధ్య రేంజ్‌లోనే ఉంటారు. పేమెంట్‌ హిస్టరీ, క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేషియో, క్రెడిట్‌ హిస్టరీ లెంగ్త్‌ వంటి అంశాలు స్కోరును ప్రభావితం చేస్తాయి. ఇందులో ఏ ఒక్క విషయంలో పొరపాటు జరిగినా 800 స్కోరు చేరుకోవడం కష్టమే. దేశంలో ఇప్పటికీ క్రెడిట్‌ స్కోరు లేనివారు చాలామందే ఉన్నారు. సకాలంలో చెల్లింపులు చేయకపోవడం, దీర్ఘకాలంలో క్రెడిట్‌ హిస్టరీ లేకపోవడంతో చాలామంది 800+ స్కోర్‌ పొందలేకపోతున్నారు. కేవలం సంపన్నులు, ఆర్థిక వ్యవహారాలపై అవగాహన ఉన్నవాళ్లు మాత్రమే మెరుగైన క్రెడిట్‌ స్కోరును సాధిస్తున్నారు.మీ క్రెడిట్‌ స్కోరు పెరగాలంటే క్రెడిట్‌ కార్డు బిల్లులు, ఈఎంఐలు, ఇతర రుణాలను సకాలంలో చెల్లించాలి. క్రెడిట్‌ స్కోరు గణనలో పేమెంట్‌ హిస్టరీ ప్రభావం 30 నుంచి 35 శాతంగా ఉంటుందంటున్నారు ఆర్థిక నిపుణులు.

Published on: Jan 19, 2026 09:22 AM