Viral Video: ఓర్నీ.. బిల్ ఎగ్గొట్టేందుకు కన్నింగ్ ప్లాన్ వేసిన గ్యాంగ్.. సీసీటీవీలో బయటపడిన బండారం.. వీడియో వైరల్..

ఓ రెస్టారెంట్‌లో వెజ్ బిర్యానీలో చికెన్ వచ్చిందంటూ కొంతమంది యువకులు రచ్చ రచ్చ చేశారు. వెజ్‌లో నాన్ వెజ్ ఎలా వేస్తారంటూ నానా హంగామా చేశారు. అయితే సీసీటీవీ పుటేజీలో మాత్రం రెస్టారెంట్ బిల్ ఎగ్గొట్టేందుకు ఆ యువకులు వేసిన కన్నింగ్ ప్లాన్ బయటపడింది.

Viral Video: ఓర్నీ.. బిల్ ఎగ్గొట్టేందుకు కన్నింగ్ ప్లాన్ వేసిన గ్యాంగ్.. సీసీటీవీలో బయటపడిన బండారం.. వీడియో వైరల్..
Vira Video

Updated on: Aug 04, 2025 | 8:28 PM

కొంత మంది హోటల్ లేదా రెస్టారెంట్‌కు వెళ్లి ఫుల్‌గా తింటారు. ఆ తర్వాత బిల్ ఎగ్గొట్టడానికి రకరకాల కన్నింగ్ ప్లాన్స్ వేస్తుంటారు. చివరకు దొరికి చిక్కుల్లో పడతారు. తాజగా ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. శాస్త్రి చౌక్‌లో ఉన్న బిర్యానీ బే రెస్టారెంట్‌లో వెజ్ బిర్యానీలో చికెన్ ముక్క రావడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా రెస్టారెంట్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వెజ్‌లో నాన్‌వెజ్ ఎలా కలుపుతారంటూ ఫైర్ అయ్యారు. అయితే రెస్టారెంట్ యజమాని సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేయడంతో ఈ ఘటన కొత్త మలుపు తిరిగింది.

జూలై 31 రాత్రి సుమారు 12 నుండి 13 మంది వ్యక్తుల గ్యాంగ్ డిన్నర్ కోసం రెస్టారెంట్‌కు వెళ్లారు. గ్యాంగ్‌లోని కొంతమంది సభ్యులు వెజ్ భోజనం ఆర్డర్ చేయగా, మరికొందరు నాన్ వెజ్ తిన్నారు. భోజనం చేస్తున్న సమయంలో, వారిలో ఒకరు సడెన్‌గా అరవడం మొదలెట్టాడు. వెజ్‌లో నాన్ వెజ్ ఎలా వేస్తారని ప్రశ్నించారు. దీంతో భోజనం చేస్తున్న ఇతర కస్టమర్లలో ఆందోళన చెలరేగింది. రెస్టారెంట్ యజమాని రవికర్ సింగ్ జోక్యం చేసుకుని కస్టమర్లను కూల్ చేయడానికి ప్రయత్నించాడు. అయినా వారు వినలేదు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి సీసీటీవి పుటేజీ పరిశీలించి ఆ గ్యాంగ్‌ను బయటకు తీసుకెళ్లారు.

సీసీటీవీ ఫుటేజీలో ఏముందంటే..?

తాజాగా ఆ వీడియోను రెస్టారెంట్ ఓనర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియోలో సదరు యువకులు చికెన్ ముక్కను వెజ్ లో కలిపి బిల్ ఎగ్గొట్టేందుకు ప్లాన్ వేసినట్లు స్పష్టంగా అర్థమవుతంది. రెస్టారెంట్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఆ యువకులు ఇలా చేశారని ఓనర్ ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా ఈ రెస్టారెంట్ నడుపుతున్నామని.. కస్టమర్ల మతపరమైన భావాలను ఎప్పుడు దెబ్బతీయలేదని చెప్పారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..