
Medical Miracle: గ్రీస్ దేశానికి చెందిన 58 ఏళ్ల మహిళ గత ఏడాది సెప్టెంబరులో గొర్రెల ఫారమ్ సమీపంలో పని చేస్తూ గడిపింది. ఆ సమయంలో ఆమె ముఖం చుట్టూ అనేక ఈగలు ముసురుతున్నప్పటికీ, ఆమె వాటిని సాధారణ విషయంగా భావించి నిర్లక్ష్యం చేసింది. అయితే, వారం రోజుల తర్వాత ఆమెకు ముక్కు రంధ్రాలలో తీవ్రమైన నొప్పి, ఎడతెగని దగ్గు ప్రారంభమయ్యాయి. జ్వరం వంటి ఇతర లక్షణాలు లేకపోవడంతో ఆమె దానిని సాధారణ జలుబుగా భావించింది. అక్టోబర్ 15న ఆమెకు గట్టిగా తుమ్ము రావడంతో, ముక్కు నుంచి ఒక అంగుళం పొడవున్న పురుగు కింద పడింది. దీంతో ఆశ్చర్యపోయిన ఆమె వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించింది.
ఈఎన్టీ నిపుణులు ఆమె ముక్కును క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆపరేషన్ ద్వారా ఆమె ముక్కు లోపలి నుంచి 10 ఈగ పిల్లలను, ఒక కోశస్థ దశలో ఉన్న పురుగును బయటకు తీశారు. ఇవి సాధారణ ఈగలు కావు, గొర్రెలు, మేకల ముక్కులలో నివసించే ‘బాట్ ఫ్లైస్’ (Oestrus ovis) అని పరీక్షల్లో తేలింది. ఇవి జంతువుల మీద ఆధారపడే పరాన్నజీవులు, మనుషులలో ఇవి ఈ స్థాయిలో పెరగడం చాలా అరుదు.
సాధారణంగా మానవ ముక్కులోని వాతావరణం ఇటువంటి పురుగులు పెరగడానికి అనుకూలమైనది కాదు. కానీ ఈ మహిళ విషయంలో రెండు ప్రధాన కారణాలు దీనికి దోహదపడ్డాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. మొదటిది, ఆమె ముక్కు మధ్యలో ఉండే ఎముక కొంత వంకరగా ఉండటం. దీనివల్ల ముక్కు లోపల ఖాళీ ప్రదేశం ఏర్పడి, పురుగులు దాక్కోవడానికి, పెరగడానికి సురక్షితమైన స్థావరం దొరికింది. రెండోది, గొర్రెల ఫారమ్ వద్ద ఈగలు ముసిరినప్పుడు ఆమె అప్రమత్తంగా లేకపోవడం.
కోట్లాది మందిలో ఒకరికి మాత్రమే వచ్చే ఇటువంటి అరుదైన ఇన్ఫెక్షన్ నుంచి ఆ మహిళ ప్రస్తుతం కోలుకుంది. సరైన సమయంలో చికిత్స అందడంతో ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగింది. పశువుల పాకలు లేదా ఫారమ్‌ల వద్ద పనిచేసే వారు ముఖానికి రక్షణ కవచాలు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..