
సోషల్ మీడియా ప్రపంచంలో మనం రోజూ ఎన్నో వింతలు, విశేషాలను చూస్తుంటాం. కొన్ని నవ్విస్తే, మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి. కానీ, ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఒక వీడియో మాత్రం చూసేవారి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. సాధారణంగా పాము కనిపిస్తేనే ఆమడ దూరం పరుగెత్తే ఈ రోజుల్లో, ఒక మహిళ ఏకంగా ప్రపంచంలోనే అత్యంత భారీ పామును కౌగిలించుకుని ముద్దులు కురిపిస్తుంటే ఎవరికైనా చెమటలు పట్టాల్సిందే..!
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక మహిళ బురదగా ఉన్న నది మధ్యలో ఎంతో ప్రశాంతంగా కూర్చుని ఉంది. ఆమె మెడలో పూల దండకు బదులుగా, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, శక్తివంతమైన ‘ఆకుపచ్చ అనకొండ’ (Green Anaconda) చుట్టుకుని ఉంది. ఆ భారీ సర్పం ఆమె శరీరాన్ని గట్టిగా చుట్టేసినప్పటికీ, ఆమెలో ఇసుమంతైనా భయం కనిపించలేదు. పైగా ఆ అనకొండ నుదుటిపై ఆమె ఎంతో ప్రేమగా ముద్దు పెడుతూ కనిపించడం నెటిజన్లను విస్మయానికి గురిచేస్తోంది.
ఈ సాహసానికి ఒడిగట్టిన మహిళ పేరు డానియెలా విల్లారోయెల్. ఆమె సాధారణ మహిళ కాదు, ఒక వన్యప్రాణి సంరక్షకురాలు. అమెజాన్ రెస్క్యూ అండ్ కన్జర్వేషన్ అలయన్స్‌లో సభ్యురాలిగా పనిచేస్తున్న డానియెలాకు జంతువులంటే అమితమైన ప్రేమ. అమెజాన్ వర్షారణ్యాల్లోని మూగజీవాలను కాపాడటం, వాటి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఆమె నిత్యకృత్యం. వన్యప్రాణులు మనం అనుకున్నంత ప్రమాదకారి కాదని నిరూపించడమే ఆమె ఉద్దేశ్యం.
ఇదిలావుంటే, అనకొండలకు విషం ఉండదు, కానీ వాటికి ఉన్న శారీరక బలం అపారం. తన భారీ శరీరంతో ఎరను చుట్టేసి, ఎముకలను పిండి చేసి, క్షణాల్లో మింగేయగల సామర్థ్యం వీటికి ఉంటుంది. డానియెలా ఒక నిపుణురాలు కాబట్టి, ఆ జంతువుల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని వాటిని హ్యాండిల్ చేయగలదు. అయితే, సామాన్యులు ఇలాంటి ప్రయత్నాలు చేయడం ప్రాణాపాయమని ఆమె హెచ్చరిస్తుంటుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో @dani.villar_ అనే ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియోకు లక్షలాది వ్యూస్, వేలల్లో కామెంట్స్ వస్తున్నాయి. “ఆ పాము ఒక్కసారి గట్టిగా బిగిస్తే ఆమె నేరుగా స్వర్గానికి చేరుకుంటుంది” అని ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. “ఈ ప్రేమ ఉక్కిరిబిక్కిరి చేసేలా ఉంది సోదరీ, కాస్త జాగ్రత్త!” అంటూ మరొకరు కామెంట్ చేశారు. “అసలు నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది?” అని చాలామంది ఆమె సాహసాన్ని కొనియాడుతున్నారు. ఏది ఏమైనా, ప్రకృతిలోని జీవాలతో మనుషులు ఇంతటి విడదీయరాని బంధాన్ని కలిగి ఉండటం నిజంగా అద్భుతమే.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..