
భర్తను వెతుక్కోవడానికి సాధారణంగా డేటింగ్ యాప్స్‌కి వెళ్తారు. స్నేహితులు, బంధువుల ద్వారా సంబంధాలు చూస్తారు. కొందరు మ్యాట్రిమోనీ సైట్లను ఆశ్రయిస్తారు. కానీ అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన 36 ఏళ్ల అరిన్ ప్యాటర్సన్ మాత్రం వీటన్నింటికీ భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. భర్త కావాలంటే.. ముందుగా అప్లికేషన్ పెట్టండి! అంటూ ఏకంగా ఓ Google Formను తయారు చేశారు. అరిన్ ప్యాటర్సన్ తన సోషల్ మీడియా ప్రొఫైల్‌లో భర్త కోసం.. ఉద్యోగ అప్లికేషన్‌లా Google Formను షేర్ చేసి, దాన్ని పిన్ చేశారు. ఆ ఫార్మ్ లో కేవలం పేరు, వయసు, ఫోన్ నంబర్ లాంటి సాధారణ వివరాలు మాత్రమే లేవు. భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? రోజువారీ జీవితం ఎలా ఉంటుంది? కెరీర్‌పై మీ లక్ష్యాలు ఏమిటి? పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి? కుటుంబ జీవితం గురించి మీ ఆలోచనలు ఏమిటి? ఇలా.. జీవిత భాగస్వామి గురించి తెలుసుకునేలా వరుస ప్రశ్నలు పెట్టారు. ఇక సంబంధంలో మీకు కావాల్సిన విషయాలు ఏంటి? మీకు అస్సలు నచ్చని లేదా రాజీపడలేని అంశాలు ఏంటి? అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి.
అరిన్ ఈ ఫామ్‌ను సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత ఊహించని స్పందన వచ్చింది. 240 మందికి పైగా పురుషులు ఆమె రూపొందించిన ప్రశ్నావళిని నింపేందుకు ఆసక్తి చూపారు. డేటింగ్ యాప్స్‌లో ఎక్కువ సమయం వృథా అవుతోందని భావించి ఈ కొత్త పద్ధతిని ఎంచుకున్నట్లు అరిన్ తెలిపారు. తనకు నిజంగా సీరియస్‌గా సంబంధం కోరుకునే వ్యక్తులు ఎవరో తెలుసుకోవడమే ఈ ఫార్మ్ ఉద్దేశమని చెప్పారు.
అరిన్ తన Google Formలో తనకు కావాల్సిన జీవిత భాగస్వామి గురించి స్పష్టంగా రాశారు. అందంగా, తెలివిగా, దయగా, నమ్మకంగా ఉండే వ్యక్తి కావాలని.. కాఫీ డేట్స్, డిన్నర్ డేట్స్, మంచి సంభాషణలు ఇష్టపడే వ్యక్తితో పరిచయం పెంచుకోవాలని కోరుకుంటున్నాననీ.. భవిష్యత్తులో ఈ సంబంధం ఎటు వెళ్తుందో కలిసి నిర్ణయించుకోవచ్చని ఆమె తన అభిప్రాయం వ్యక్తం చేసారు.
Woman Detailes Husband Application Google Form
తనకు ఇప్పటివరకు డేటింగ్ యాప్స్, నేరుగా పరిచయాలు, ఇతరులు ఏర్పాటు చేసిన పరిచయాలు.. ఇలా చాలా మార్గాల్లో వ్యక్తులను కలిసే ప్రయత్నం చేసాననీ, తనకు సరైన వ్యక్తి దొరక్కపోవడంతో చివరకు ‘Husband Application’ ఆలోచనకు వచ్చానని అన్నారు. తనకు తెలిసిన ప్రతి మార్గాన్నీ ప్రయత్నించిన తర్వాతే ఈ వినూత్న పద్ధతిని ఆమె ఎంచుకున్నారు.
అరిన్ పెట్టిన Google Formకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఆమె తనకు కావాల్సిన వ్యక్తి గురించి ఇంత స్పష్టంగా చెప్పడం ధైర్యమైన, కొత్త తరహా ప్రయత్నమని కొందరు ప్రశంసించారు. ‘ఇది చాలా బోల్డ్, వినూత్నమైన ఆలోచన. ఫలితాలు మాతో కూడా పంచుకోండి’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. మరో యూజర్.. తనకు నిజాయితీగా, ప్రేమగా, శ్రద్ధగా ఉండే వ్యక్తి దొరకాలని కోరుకుంటూ అరిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకొకరు అయితే..’నేను కూడా నా జీవిత భాగస్వామి కోసం ఇదే పద్ధతిని ఉపయోగిస్తాను’ అంటూ కామెంట్ చేశారు. మరో యూజర్ అరిన్ తన గురించి, తనకు కావాల్సిన వ్యక్తి గురించి ఇంత ఓపెన్‌గా చెప్పడం చాలా అరుదని ప్రశంసించారు.
ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి ఆసక్తి ఒక్కటే.. 240కి పైగా అప్లికేషన్లు వచ్చాయి.. మరి ఆ 240 మందిలో అరిన్ మనసు గెలిచిన వ్యక్తి ఎవరు? ఆమె నిజంగానే ఈ Google Form ద్వారా తన జీవిత భాగస్వామిని ఎంచుకుంటారా? లేక.. ఇది కేవలం తనకు సరైన వ్యక్తిని వెతికేందుకు చేసిన ఓ కొత్త ప్రయోగంగానే మిగిలిపోతుందా? అరిన్ ప్యాటర్సన్ పెట్టిన ఈ ‘Husband Application’ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చకు కారణమైంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి