
మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో ఓ మహిళా రైతు చేసిన సాహసం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన పొలంలోని చెరువులోకి వచ్చిన నాలుగు అడుగుల పొడవున్న మొసలిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు వస్తారని ఎదురుచూసి విసిగిపోయిన ఆమె.. చివరకు భర్తతో కలిసి రంగంలోకి దిగింది. చెరువులో వల వేసి మొసలిని పట్టుకోవడమే కాకుండా, దానిని చేతులతో ఎత్తుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
జబల్పూర్లోని ఖమారియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సున్పూర్ ఘనా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు లక్పత్ యాదవ్, ఆయన భార్య తమ గ్రామంలోని చెరువులో మొసలి సంచరిస్తున్నట్లు గుర్తించారు. సుమారు నాలుగు అడుగుల పొడవున్న మొసలిని చూసి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా చెరువు పరిసరాల్లోకి వెళ్లే ప్రజలు, పశువులకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన చెందారు.
దీంతో లక్పత్ యాదవ్ వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మొసలిని సురక్షితంగా పట్టుకుని తరలించాలని కోరారు. అయితే సమాచారం ఇచ్చినప్పటికీ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. ఎంతసేపు ఎదురుచూసినా సహాయక బృందం రాకపోవడంతో యాదవ్ దంపతులు తామే మొసలిని పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే చెరువులోకి వల వేసి మొసలిని పట్టుకున్నారు. అనంతరం అందరినీ ఆశ్చర్యపరుస్తూ యాదవ్ భార్య ఆ మొసలిని తన చేతుల్లోకి ఎత్తుకుంది. ఏమాత్రం భయపడకుండా దానిని అటవీ శాఖ సిబ్బంది వద్దకు తీసుకెళ్లి అప్పగించింది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం స్థానికంగా వైరల్ కావడంతో మహిళ ధైర్యసాహసాలపై చర్చ మొదలైంది.
మరోవైపు అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణి ప్రమాదం గురించి ముందుగానే సమాచారం ఇచ్చినా అధికారులు స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడినప్పుడు తక్షణమే స్పందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అంటున్నారు.
అయితే ఈ ఘటన మరో ముఖ్యమైన హెచ్చరికను కూడా ఇస్తోంది. మొసళ్లు అత్యంత ప్రమాదకరమైన వన్యప్రాణులు. వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించడం ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. శిక్షణ లేని వ్యక్తులు ఇలాంటి సాహసాలకు పాల్పడటం ప్రమాదకరం. మొసలి కనిపించినప్పుడు దానికి దూరంగా ఉండి వెంటనే అటవీ శాఖ లేదా అత్యవసర సహాయక బృందాలకు సమాచారం అందించాలి. మహిళా రైతు సాహసం ప్రశంసలు అందుకుంటున్నప్పటికీ, ఇలాంటి రక్షణ చర్యలను నిపుణులే చేపట్టాలనే సందేశాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..