ఈ దేశంలో చూయింగ్ గమ్ నమిలితే జైలుకే.. దాని వెనుకున్న కథ తెలిస్తే అవాక్కే..

మనం టైమ్ పాస్ కోసం.. లేదా నోటి దుర్వాసన పోవడానికి సరదాగా చూయింగ్ గమ్ నములుతుంటాం. కానీ ప్రపంచంలో ఒక దేశం ఉంది.. అక్కడ చూయింగ్ గమ్ కొన్నా, అమ్మినా, చివరికి నమిలి రోడ్డుపై ఊసినా జైలు పాలవ్వాల్సిందే. వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. ఇంతకీ ఆ దేశం ఏది? ఈ చట్టాన్ని ఎందుకు తెచ్చా తెలుసుకుందాం..

ఈ దేశంలో చూయింగ్ గమ్ నమిలితే జైలుకే.. దాని వెనుకున్న కథ తెలిస్తే అవాక్కే..
Why Is Chewing Gum Banned In Singapore

Updated on: Jul 10, 2026 | 8:23 AM

ప్రపంచవ్యాప్తంగా ఒక్కో దేశానికి ఒక్కో రకమైన చట్టాలు ఉంటాయి. కొన్ని చట్టాలు వినడానికి చాలా వింతగా అనిపించినప్పటికీ, వాటి వెనుక బలమైన కారణాలు ఉంటాయి. అలాంటి ఒక విలక్షణమైన చట్టమే చూయింగ్ గమ్ నిషేధం. అవును.. మనం సరదాగా నమిలే చూయింగ్ గమ్‌ను అక్కడ కొన్నా, అమ్మినా, చివరికి నమిలి రోడ్డుపై ఊసినా భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుంది. క్రమశిక్షణకు, అద్దంలా మెరిసిపోయే రోడ్లకు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సింగపూర్‌లో ఈ కఠినమైన చట్టం అమలులో ఉంది.

చట్టం ఎప్పుడు వచ్చింది?

సింగపూర్ ప్రభుత్వం ఈ చట్టాన్ని 1992 లోనే అమలులోకి తెచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అక్కడ సాధారణ చూయింగ్ గమ్ అమ్మకాలు, కొనుగోళ్లు, దిగుమతులపై కఠినమైన నిషేధం కొనసాగుతోంది. బహిరంగ ప్రదేశాలలో ప్రజలు చూయింగ్ గమ్ నమిలి ఎక్కడ పడితే అక్కడ ఊయడం వల్ల ప్రభుత్వ ఆస్తులు పాడవుతుండటం, పర్యాటక ప్రాంతాలు మురికిగా మారడాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రోడ్లు, పార్కులు, మెట్రో రైళ్ల సీట్ల కింద ఈ గమ్‌లు అంటుకుని తీవ్ర ఇబ్బందిగా మారడంతో ఈ కఠిన నిర్ణయానికి వచ్చారు.

ఒక మినహాయింపు ఉంది..

సింగపూర్‌లో చూయింగ్ గమ్‌పై పూర్తిగా నిషేధం ఉన్నప్పటికీ.. వైద్య, దంత ప్రయోజనాల కోసం ఉపయోగించే వాటికి మాత్రం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నికోటిన్ గమ్స్ లేదా పళ్ల ఆరోగ్యానికి సంబంధించిన గమ్‌లను కేవలం లైసెన్స్ ఉన్న డాక్టర్లు లేదా రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్‌ల ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే మెడికల్ షాపుల్లో పొందే వీలుంటుంది. సాధారణ బంక్ షాపుల్లో కొనుగోలు చేయడానికి వీలుండదు.

పరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్..

సింగపూర్ పరిశుభ్రమైన రోడ్లు, పచ్చని పార్కులు, క్రమబద్ధమైన నిబంధనలకు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. అక్కడ చిన్న కాగితం ముక్క రోడ్డుపై వేసినా భారీ జరిమానాలు విధిస్తారు. ఈ కఠినమైన రూల్స్ వల్లే నేడు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన మరియు పరిశుభ్రమైన దేశాల్లో సింగపూర్ ఒకటిగా నిలిచింది. కాగా మనకు టైమ్ పాస్ లాగా అనిపించే చూయింగ్ గమ్, సింగపూర్ వెళ్తే మాత్రం జైలు ఊచలు లెక్కబెట్టేలా చేస్తుంది. అందుకే అక్కడికి వెళ్లే పర్యాటకులు ఈ నిబంధనల పట్ల చాలా అప్రమత్తంగా ఉంటారు.

Follow Us