ఇంకా మిస్టరీగానే ఇద్దరి పైలట్ల పేర్లు.. ఫ్లై దుబాయ్ ను కాపాడిన హీరోలెవరు?

ఫ్లై దుబాయ్ విమానం కాక్‌పిట్‌ నుంచి ఒక్కసారిగా అరుపులు వినిపించాయి. కొద్దిసేపటికే విమానం వేగంగా కిందికి దిగడం మొదలైంది. తీవ్రంగా గాయపడిన పైలట్‌ స్మిత్ మచ్చర్ కాక్ పిట్ తలుపు తెరిచిన వెంటనే ప్రయాణికుల్లో నుంచి ఇద్దరు ముందుకు వచ్చారు. కాక్‌పిట్‌లోకి వెళ్లి విమానం కంట్రోల్స్‌ ను తమ చేతుల్లోకి తీసుకున్నారు. వారి పేర్లను ఫ్లై దుబాయ్ ఇప్పటివరకు వెల్లడించకపోవడంతో విమానాన్ని కాపాడిన ఆ ఇద్దరు ప్రస్తుతం మిస్టరీ వ్యక్తులుగా మారారు.

ఇంకా మిస్టరీగానే ఇద్దరి పైలట్ల పేర్లు.. ఫ్లై దుబాయ్ ను కాపాడిన హీరోలెవరు?
Who Are Two Secret Pilots Who Saved Flydubai Flight

Updated on: Oct 04, 2026 | 5:31 PM

విమానం ముందు భాగంలో కూర్చున్న ప్రయాణికులకు కాక్‌పిట్‌ నుంచి పెద్దగా అరుపులు వినిపించాయి. లోపల ఏదో తీవ్రంగా జరుగుతోందని అప్పుడే వారికి అర్థమైంది. దాడిలో కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ తీవ్రంగా గాయపడినా కాక్‌పిట్‌ తలుపు తెరిచారు. వెంటనే ఓ ప్రయాణికుడు దాడి చేసిన కో-పైలట్‌ను పట్టుకుని బయటకు లాగాడు. మరికొందరు ప్రయాణికులు అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. విమానంలో ప్రయాణికులుగా ఉన్న ఓ పైలట్‌ వెంటనే కాక్‌పిట్‌లోకి వెళ్లాడు. అతడు పరిస్థితిని అంచనా వేసి విమానాన్ని నియంత్రించాడు. కొద్దిసేపటికే మరో పైలట్‌ కూడా కాక్‌పిట్‌లోకి వెళ్లాడు. ఇద్దరూ కలిసి కాక్‌పిట్‌ తలుపులు మూసేశారు. ఇక అక్కడి నుంచి తమలో టెన్షన్ మొదలైందనీ అసోసియేటెడ్‌ ప్రెస్‌తో మాట్లాడుతూ ప్రయాణికుడు డేనియల్‌ ష్లిచ్టర్‌ తెలిపారు.

45 నిమిషాలు ఉత్కంఠలో ప్రయాణికులు

కాక్‌పిట్‌లోకి వెళ్లిన ఆ ఇద్దరు పైలట్లు వెంటనే ప్రయాణికులతో మాట్లాడలేదు. విమానం ఎటు వెళ్తోంది? నడుపుతున్న ఆ ఇద్దరు ఎవరు? అసలు పరిస్థితి ఏంటి? తీవ్ర టెన్షన్‌తో ప్రయాణికులలో భయం మరింత పెరిగింది. విమానాన్ని హైజాక్‌ చేసి ఇరాన్‌ కు తీసుకెళ్తున్నారా అని కొంతమంది అనుమానించారు. 45 నిమిషాల తర్వాత విమానాన్ని సౌదీ అరేబియాలోని టబుక్‌లో సురక్షితంగా ల్యాండ్‌ చేయబోతున్నట్లు పైలట్లు తెలిపారు. ఆ ప్రకటనతో ప్రయాణికులు కొంత ఊపిరి పీల్చుకున్నారు.

ఆ ఇద్దరు పైలట్లు ప్రయాణికులా?

కాక్‌పిట్‌లోకి వెళ్లి విమానాన్ని కాపాడిన ఆ ఇద్దరు పైలట్లు ఆ సమయంలో విధుల్లో లేరు. వారు సాధారణ ప్రయాణికుల్లాగే విమానంలో ప్రయాణిస్తున్నారు. వాస్తవానికి టెల్‌ అవీవ్‌ నుంచి తిరిగి దుబాయ్‌కు వెళ్లే ఖాళీ విమానాన్ని నడపాల్సి ఉండటంతో వారు ముందుగానే ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఒక పైలట్‌ విధి నిర్వహించాల్సిన ప్రాంతానికి ప్రయాణికుడిగా వెళ్లడాన్ని ‘డెడ్‌హెడింగ్‌’ (Deadheading) అంటారు. అంటే.. ఆ సమయంలో వారు విమానాన్ని నడపడం లేదు. కానీ అత్యవసర పరిస్థితి వచ్చిన వెంటనే తమ బాధ్యత ఏమిటో గుర్తించి కాక్‌పిట్‌లోకి వెళ్లారు.

విమానం వేగంగా కిందికి.. 10 నిమిషాల పాటు ఉత్కంఠ

ఇద్దరు పైలట్లు కాక్‌పిట్‌లోకి వెళ్లిన తర్వాత కూడా విమానాన్ని వెంటనే పూర్తిగా నియంత్రణలోకి తీసుకురావడం సాధ్యం కాలేదు. విమానం అప్పటికే వేగంగా కిందికి దిగుతోంది. పరిస్థితిని స్థిరపరచడానికి 10 నిమిషాలకు పైగా సమయం పట్టింది. విమానం రడ్డర్‌లోని కొంత భాగం కూడా దెబ్బతింది. అయినప్పటికీ ఆ ఇద్దరు పైలట్లు విమానాన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం Mayday అత్యవసర సందేశాన్ని పంపించి సురక్షితంగా ల్యాండ్‌ అయ్యేందుకు అనువైన ప్రదేశం కోసం ప్రయత్నించారు. చివరకు విమానాన్ని సౌదీ అరేబియాలోని టబుక్‌లో సురక్షితంగా ల్యాండ్‌ చేశారు.

‘వాళ్లు లేకపోతే ఏమయ్యేదో ఊహించలేం’

విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌ చేశారనీ ప్రయాణికుడు డేనియల్‌ ష్లిచ్టర్‌ ఆ ఇద్దరు పైలట్లను ప్రశంసించారు. విమానం పరిస్థితిని మొదటగా అంచనా వేసిన పైలట్‌ వేగంగా స్పందించారనీ, ఇద్దరూ కీలక సమయంలో బాధ్యత తీసుకున్నారని చెప్పారు. ప్రయాణికుల ప్రాణాలను కాపాడటంలో వారి పాత్ర ఎంతో కీలకమనీ ఈ ఘటన మొత్తం ఒక అద్భుతంలా అనిపించిందని తెలిపారు.

పేర్లు మాత్రం ఇంకా రహస్యమే!

ఈ ఘటన జరిగి మూడు రోజులు గడిచినా ఫ్లై దుబాయ్‌ ఆ ఇద్దరు పైలట్ల పేర్లను అధికారికంగా వెల్లడించలేదు. వారు విమానంలో ప్రయాణిస్తున్న సిబ్బంది సభ్యులేనని మాత్రమే సంస్థ తెలిపింది.  కాక్‌పిట్‌లో అత్యంత ప్రమాదకర పరిస్థితి ఉన్న సమయంలో.. ప్రయాణికుల్లా కూర్చున్న ఆ ఇద్దరు పైలట్లు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ముందుకొచ్చారు. విమానం వేగంగా కిందికి దిగుతున్న సమయంలో కాక్‌పిట్‌లోకి అడుగుపెట్టి కంట్రోల్స్‌ చేతుల్లోకి తీసుకుని చివరకు వందలాది మంది ప్రయాణికులను సురక్షితంగా ల్యాండ్ చేసారు. వారి పేర్లు తెలియకపోయినా. ఆ రోజు ఫ్లై దుబాయ్‌ ప్రయాణికులకు మాత్రం ఆ ఇద్దరు పైలట్లు ఎప్పటికీ ‘రియల్ హీరోలు’గానే గుర్తుండిపోతారు.

Loading...
Unable to load recommendations.
Follow Us