
సాధారణంగా ఎవరి ఇంట్లోనైనా మరణం సంభవిస్తే అక్కడ కన్నీళ్లు, తీరని దుఃఖం, నిశబ్దం, విషాద వాతావరణం అలుముకుంటుంది. కానీ దక్షిణ అమెరికా దేశమైన పెరూలో మాత్రం పాత అంత్యక్రియల ఆచారాలను పూర్తిగా మార్చేస్తూ ఒక కొత్త, విలక్షణమైన పోకడ వేగంగా వ్యాపిస్తోంది. సాంప్రదాయ సంతాపానికి, ఏడుపులకు బదులుగా మృతుని అంత్యక్రియల ఊరేగింపును ఒక పండుగలా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే అక్కడ డ్యాన్సింగ్ పాల్ బేరర్స్ అనే సరికొత్త భావన విపరీతమైన ప్రాచుర్యం పొందుతోంది. మరణాన్ని కూడా వేడుకలా మార్చేస్తున్న ఈ వింత ఆచారం వెనుక ఉన్న ఆసక్తికరమైన వాస్తవాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
పెరూలో వేగంగా విస్తరిస్తున్న ఈ కొత్త సంప్రదాయంలో.. ప్రత్యేకంగా శిక్షణ పొందిన యువకుల బృందం అంత్యక్రియల్లో పాల్గొంటుంది. వీరు మరణించిన వ్యక్తి ఉన్న శవపేటికను తమ భుజాలపై మోస్తూ, పెద్ద శబ్దంతో కూడిన డ్రమ్స్, ట్రంపెట్స్ సంగీతానికి లయబద్ధంగా డ్యాన్స్ చేస్తారు. దీని వెనుక ఒక బలమైన భావోద్వేగ ఉద్దేశ్యం ఉంది. తమను విడిచి వెళ్లిపోయిన ప్రియమైన వారిని కన్నీళ్లతో కాకుండా ఆఖరిసారిగా నవ్వులతో, సంతోషంగా స్మరించుకోవాలనేదే ఈ వింత పద్ధతి ముఖ్య ఉద్దేశం. అంత్యక్రియల సమయంలో మృతుడు తన జీవితకాలంలో ఎక్కువగా ఇష్టపడిన జనాదరణ పొందిన పాటలను ప్లే చేస్తారు. శవపేటికను మోస్తున్న బృందం ఆ పాటల ట్యూన్స్‌కు అనుగుణంగా చాలా జాగ్రత్తగా స్టెప్పులు వేస్తూ స్మశానవాటిక వైపు కదులుతుంది.
కొన్ని సంవత్సరాల క్రితం పశ్చిమ ఆఫ్రికా దేశమైన ఘనాకు చెందిన డాన్సింగ్ పాల్ బేరర్స్ వీడియోలు సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ఎంతలా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఆ వీడియోలు అప్పట్లో నెట్టింట పెద్ద మీమ్ ట్రెండ్‌గా మారాయి. ఇప్పుడు అదే ఆఫ్రికన్ శైలిని పెరూ ప్రజలు తమ స్థానిక సంస్కృతికి, ఆచారాలకు అనుగుణంగా మార్చుకుని ఫాలో అయిపోతున్నారు. అక్కడ రోజురోజుకూ ఈ ట్రెండ్‌కు ఆదరణ పెరుగుతోంది.
పెరూలోని అనేక కుటుంబాలు ఈ సరికొత్త ఆలోచనను హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నాయి. “మనకు ఎంతో ప్రియమైనవారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు అక్కడ కేవలం విషాద వాతావరణం మాత్రమే ఉండకూడదు. బదులుగా వారు ఈ భూమిపై పండించిన నవ్వులను, వారు జీవించిన సంపూర్ణ జీవితాన్ని మనం ఒక వేడుకగా జరుపుకోవాలి” అని స్థానికులు బలంగా నమ్ముతున్నారు.
నిజానికి ఇలాంటి వేడుకలు కేవలం ఇటీవలి కాలంలో వచ్చిన పోకడ మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రాచీన గిరిజన సంస్కృతులలో మరణాన్ని ఒక ముగింపులా చూడరు. దాన్ని పరలోకానికి లేదా మరో కొత్త ప్రపంచానికి సాగే ప్రయాణానికి నాందిగా భావించి వేడుక చేసుకునే సంప్రదాయం చరిత్రలో ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు పెరూ దేశంలో అదే పురాతన భావన ఒక ఆధునిక రూపాన్ని సంతరించుకుని ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది.
In Peru, a growing trend is transforming traditional funerals into festive celebrations through “dancing undertakers” (los portadores bailarini), offering a cheerful alternative to solemn mourning. pic.twitter.com/pmWEG6utPC
— Massimo (@Rainmaker1973) May 22, 2026