
సాధారణంగా వర్షాకాలం వచ్చినా కూడా కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఏమాత్రం తగ్గట్లేదు. ఈ ఎండ వేడిని మనుషులే కాదు.. జంతువులు, సరీసృపాలు, కీటకాలు కూడా తట్టుకోలేక చల్లటి ప్రాంతాల కోసం వెతుకుతుంటాయి. తాజాగా, ఇలాగే బయట వేడికి తట్టుకోలేక ఓ ఎలుక ఏకంగా ఏసీలో దూరింది. ఏసీ సరిగ్గా పని చేయకపోవడంతో అనుమానం వచ్చిన ఓనర్, టెక్నీషియన్‌ను పిలిపించడంతో అసలు విషయం వెలుగుచూసింది.
అసలేం జరిగిందంటే..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిడదవోలు పట్టణంలోని ఓ ఇంట్లో ఈ ఘటన జరిగింది. అప్పటిదాకా ఎండలో తిరిగి ఇంట్లోకి వచ్చిన యజమాని ఉక్కపోత తట్టుకోలేక ఏసీ ఆన్ చేశాడు. కానీ ఏసీ మాత్రం పని చేయలేదు. వింత శబ్దం వచ్చి ఆగిపోయింది. దీంతో ఏం జరిగిందో తెలియక ఆ ఓనర్.. వెంటనే ఏసీ టెక్నీషియన్‌కు ఫోన్ చేశాడు. అక్కడికి చేరుకున్న టెక్నీషియన్ మొదట ఏసీ ఆన్ చేసి చూశాడు. అది ఆన్ అయినప్పటికీ గాలి రాకపోవడంతో దాన్ని విప్పి చూడాలని నిర్ణయించుకున్నాడు.
ఇక ఏసీ పైభాగాలను తొలగించి చూడగా.. లోపల బ్లోయర్ మధ్యలో ఒక ఎలుక చిక్కుకొని కనిపించింది. అది చూసి టెక్నీషియన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే బ్లోయర్‌ను లూజ్ చేసి అందులో చిక్కుకున్న ఎలుకను బయటకు తీశాడు. కానీ అప్పటికే ఆ ఎలుక చనిపోయి ఉంది. అది బ్లోయర్ మధ్య ఇరుక్కుపోవడం వల్లే ఏసీ తిరగలేదని, అందుకే గాలి రాలేదని అతను చెప్పాడు. ఆ తర్వాత దాన్ని తొలగించి, ఏసీని బాగు చేసి ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను సదరు టెక్నీషియన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.
వీడియో చూడండి..
ఏసీ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇలాంటి సంఘటనలు మీ ఇంట్లో జరగకుండా ఉండాలంటే ఈ క్రింది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి
పైపు రంధ్రాలను పూడ్చాలి: ఇంట్లో ఏసీ ఫిట్ చేసే సమయంలో ఇండోర్ యూనిట్ నుంచి పైపులు బయటకు వెళ్లే రంధ్రాన్ని వాల్ పుట్టీ లేదా ఫోమ్‌తో పూర్తిగా పూడ్చేయాలి. లేదంటే ఆ గ్యాప్ గుండా పాములు, ఎలుకలు లోపలికి వచ్చే ప్రమాదం ఉంది.
డ్రైనేజీ పైపుకు నెట్ కట్టాలి: ఏసీ డ్రైనేజీ పైపు ద్వారా కూడా కీటకాలు, చిన్న చిన్న ఎలుకలు లోపలికి వెళ్లే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ పైపు చివరన ఒక చిన్న నెట్ లాంటిది కట్టడం మంచిది.
రెగ్యులర్ సర్వీసింగ్: చాలా రోజుల తర్వాత లేదా సుదీర్ఘ విరామం తర్వాత ఏసీని ఆన్ చేసే ముందు, ఒకసారి టెక్నీషియన్‌ను పిలిపించి సర్వీసింగ్ చేయించడం ఉత్తమం.
వైర్లు కొరికే ప్రమాదం: ఏసీ లోపలికి ఎలుకలు లాంటివి దూరితే అవి వైర్లను కొరికేస్తాయి. దీనివల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది లేదా ఏసీ పూర్తిగా పాడైపోవచ్చు. కాబట్టి వీటి పట్ల ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.