
అత్తారింటికి వాహనాలు వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో ఓ నవ వధువు ఏకంగా పెళ్లి దుస్తుల్లోనే 18 కిలోమీటర్ల నడిచి వెళ్లింది. దారంతా రాళ్లు రప్పలు ఉన్నా ఎలాగోలా కష్టపడి ఆమె అత్తారింటికి చేరుకుంది. ఉత్తరాఖండ్‌లోని చక్రాటా పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన, ఆ ప్రాంతంలో దశాబ్దాలుగా ఉన్న రహదారి సమస్యలు, అత్యవసర వైద్య సేవల కొరతను మరోసారి తెరపైకి తెచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. బల్హార్ గ్రామానికి చెందిన షర్మిలా అనే యువతికి ఇటీవలే పెళ్లి జరిగింది. అయితే ఆమె తమ గ్రామం నుంచి డెహ్రాడూన్ సమీపంలోని మారుమూల గ్రామమైన ఉండావాలోని అత్తవారింటికి పెళ్లి ఊరేగింపుతో బయలుదేరింది. అయితే ఆ గ్రామానికి సరిగ్గా రోడ్డు మార్గం లేదు అక్కడికి వాహనాలు వెళ్లలేవు.. దీంతో లోఖండి వద్ద పెళ్లి వారి వాహనాలన్నీ ఆగిపోయాయి. అక్కడి నుంచి ఉండావా చేరుకోవాటంటే ఇంకో 18 కిలో మీటర్లు నడవాల్సి ఉంటుంది. కానీ అత్తారింటి దగ్గర గృహ ప్రవేశానికి నిర్ణయించిన శుభ ముహూర్త సమయం దగ్గర కావొస్తుంది. ఇక చేసేదేమి లేక ఆ నవ వధువు ముహూర్తం టైంకి ఎలాగైనా అత్తారింటికి చేరాలని ఆ పెళ్లి డ్రస్‌లోనే ఆ రాళ్లరోడ్డు 18 కిలో మీటర్లను నడిచి అత్తారింటికి చేరుకుంది.
ఉండావా గ్రామ సమీపంలోకి రాగానే ఆమె పూర్తిగా అసిపోయిన స్థితిలో కనిపించింది. అయితే ఆమె నడుస్తూ వస్తున్న దృశ్యాలను కొందరు వీడియో రికార్డ్ చేయగా.. తాను ఎదుర్కొన్న సమస్యను ఆమె ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. సమస్యను పరిష్కరించాలని నేరుగా రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామికి వీడియోద్వారా విజ్ఞప్తి చేసింది. తాను లోఖండి నుంచి ఉండావాకు కాలినడకన వచ్చానని.. భవిష్యత్తులో తనా తమ గ్రాస్థులు ఎవరూ ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఉండావా గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంపై తీవ్ర చర్చ నెలకొంది. అయితే ఈ సమస్య ఈ ఒక్క గ్రామానికే పరిమితం కాదు. ఉండావతో పాటు సమీపంలోని హండి కండి వంటి ఇతర మారుమూల గ్రామాల్లోనూ ప్రజలు ఇదే తరహా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నవవధువు పడిన కష్టం ద్వారా కొండ ప్రాంత గ్రామాల్లోని రహదారి, రవాణా సమస్యల తీవ్రత మరోసారి బహిర్గతమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి శాశ్వత రహదారి నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.