
Trump, Xi, Putin Trilateral summit: 1945లో యాల్టాలో అమెరికా, బ్రిటన్, సోవియట్ యూనియన్ అగ్రనేతలు ప్రపంచ భవిష్యత్తుపై చర్చించిన ‘బిగ్ త్రీ’ సమావేశాన్ని ఇది గుర్తుచేస్తోంది. ఇప్పుడు కూడా మూడు అగ్రరాజ్యాల అధినేతలు ఒక చోట చేరుతుండటంతో ప్రపంచ దేశాలన్నీ ఈ భేటీ వైపు చూస్తున్నాయి. అయితే ఈ ముగ్గురి లక్ష్యాలు ఒక్కటే కాదు. ట్రంప్‌కు ఒక అజెండా ఉంటే పుతిన్‌కు మరో వ్యూహం ఉంది. ఇక ఆతిథ్యం ఇస్తున్న జిన్‌పింగ్‌కు కూడా ఈ సమావేశం ద్వారా ప్రపంచ వేదికపై తన బలాన్ని చాటుకునే అవకాశం ఉంది. మరి ఈ భేటీలో ఏం జరగబోతోంది?
ఈ సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధానంగా ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధానికి 24 గంటల్లో ముగింపు పలుకుతానని గతంలో ట్రంప్ ప్రకటించినప్పటికీ ఆ దిశగా ఆశించిన ఫలితం ఇంకా కనిపించలేదు. ఇప్పుడు ట్రంప్, జిన్‌పింగ్‌లతో ఒకే వేదికపై కూర్చోవడం పుతిన్‌కు రాజకీయంగా ఎంతో ప్రయోజనకరమని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ దేశాల ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య రష్యా ఒంటరిగా లేదనే సందేశాన్ని ప్రపంచానికి పంపించనున్నారు.అమెరికా, చైనాతో సమానంగా రష్యా కూడా ప్రపంచ రాజకీయాల్లో కీలక శక్తి అని చాటుకోవాలన్నది పుతిన్ ఆలోచనగా కనిపిస్తోంది. ఉక్రెయిన్ భూభాగాలు, రష్యాపై ఆంక్షలు, యుద్ధం తర్వాత ఉక్రెయిన్ భవిష్యత్తు పై చర్చలు జరిగే అవకాశం ఉంది. అయితే యూరప్ భద్రతకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు యూరప్ దేశాలను పక్కన పెట్టడం సాధ్యం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి పుతిన్ కోరుకున్న విధంగా ఈ చర్చలు సాగుతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ముగ్గురు నేతల భేటీలో మరో కీలక అంశం అణ్వాయుధాలు. అణ్వాయుధాలు కలిగిన దేశాల్లో అమెరికా, రష్యా ముందున్నాయి. ఈ రెండు దేశాల వద్ద ఒక్కొక్కటి 5,000కు పైగా అణు వార్‌హెడ్‌లు ఉన్నట్లు అంచనా. చైనా దగ్గర 600కు పైగా ఉన్నాయి. అమెరికా, రష్యాల మధ్య అణ్వాయుధాల నియంత్రణ కోసం కుదిరిన ‘న్యూ స్టార్ట్’ ఒప్పందం ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసింది. దీంతో కొత్త ఒప్పందం తీసుకురావాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈసారి ఆ ఒప్పందంలో చైనాను భాగస్వామిగా చేయాలన్నది ఆయన లక్ష్యం. కానీ చైనా అంతగా ఆసక్తి చూపడం లేదు. అమెరికా, రష్యాలతో పోలిస్తే తమ అణ్వాయుధాల సంఖ్య చాలా తక్కువని బీజింగ్ వాదిస్తోంది. అయినప్పటికీ ముగ్గురు నేతల మధ్య అణ్వాయుధాల తగ్గింపు, ప్రపంచ భద్రతపై చర్చలు జరిగే అవకాశం ఉంది. అణ్వాయుధాలను వదులుకోవడం అంత సులభం కాదని ట్రంప్ కూడా అంగీకరించారు. మరి జిన్‌పింగ్‌ను ఈ చర్చలకు ఒప్పించగలరా? అన్నది చూడాలి.
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం, ఉద్రిక్తతలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశముంది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని అమెరికా ఇప్పటికే చాలా వరకు దెబ్బతీసిందని ట్రంప్ గతంలో ప్రకటించారు. ఇక్కడే చైనా పాత్ర కీలకంగా మారనుంది. ఎందుకంటే ఇరాన్‌కు చైనా ప్రధాన ఆర్థిక భాగస్వాముల్లో ఒకటి. ఇరాన్‌తో బీజింగ్‌కు ఉన్న సంబంధాల నేపథ్యంలో ఈ వివాదంపై జిన్‌పింగ్ అభిప్రాయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ సంక్షోభానికి పరిష్కారం చూపేందుకు చైనా గతంలో మధ్యవర్తిత్వ ప్రయత్నాలు చేసింది. మళ్లీ యుద్ధం మొదలుకాకుండా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై అమెరికా వైఖరి, మధ్యప్రాచ్య పరిస్థితులు, భవిష్యత్తులో శాంతి ప్రయత్నాలపై ముగ్గురు నేతలు చర్చించే అవకాశం ఉంది.
ఈ సమావేశానికి ముందే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఒక ప్రత్యేక చర్యతో అందరి దృష్టిని ఆకర్షించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు స్వాగతం పలికేందుకు జిన్‌పింగ్ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లారు. చైనా అత్యున్నత నాయకుడు ఒక విదేశీ ప్రముఖుడికి వ్యక్తిగతంగా విమానాశ్రయంలో స్వాగతం పలకడం 1960ల తర్వాత ఇదే తొలిసారి. గత సెప్టెంబర్‌లో అమెరికాలోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో జిన్‌పింగ్‌కు ట్రంప్ స్వయంగా స్వాగతం పలికారు. ఇప్పుడు చైనాలో జిన్‌పింగ్ కూడా అదే తరహాలో ఆతిథ్యం ఇవ్వడం దౌత్యపరంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా ప్రకారం.. చైనా-అమెరికా సంబంధాలు, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో సహకారం, ప్రపంచ రాజకీయ పరిణామాలపై ట్రంప్‌తో లోతైన చర్చలు జరపాలని జిన్‌పింగ్ భావిస్తున్నారు. ఈ సమావేశం ద్వారా ప్రపంచ దౌత్య వ్యవహారాల్లో చైనా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా, రష్యాలతో సమానంగా చైనా కూడా అంతర్జాతీయ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించగలదనే సంకేతాన్ని పంపించేందుకు ఇది మంచి అవకాశంగా మారనుంది. ప్రపంచ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు ఈ భేటీ నాంది పలుకుతుందా? లేక ఎవరి ప్రయోజనాలు వారివే అన్నట్లుగా ముగుస్తుందా? అనేది తేలాల్సి ఉంది.