అమెరికా వెళ్తున్నారా..? విమానాశ్రయంలో మీ ఫోన్లు చెక్‌ చేయొచ్చు!

ఎలాంటి వారెంట్ లేదా అనుమానం లేకపోయినా సరే, సరిహద్దు అధికారులు ప్రయాణికుల ఫోన్లను చెక్ చేయవచ్చని అమెరికా కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు అమెరికా పౌరులు, గ్రీన్ కార్డ్ ఉన్నవారితో సహా విదేశాల నుంచి వచ్చే లక్షలాది మందిపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా, తమ ఫోన్లలో రహస్య సమాచారం ఉంచుకునే జర్నలిస్టులు, లాయర్లు, ఇతర నిపుణులు దీనివల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. 

అమెరికా వెళ్తున్నారా..? విమానాశ్రయంలో మీ ఫోన్లు చెక్‌ చేయొచ్చు!
Tyour Phone Can Now Be Searched At Us Borders Without Suspicion

Updated on: Sep 19, 2026 | 10:01 PM

అమెరికాలోకి అడుగుపెట్టే ప్రయాణికుల ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను తనిఖీ చేసే పూర్తి చట్టపరమైన అధికారం ఆ దేశ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అధికారులకు ఉంది. మీరు అమెరికా వెళ్తుంటే.. మీ వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర డివైస్‌లను ఎలాంటి ముందస్తు నోటీసు లేదా ప్రత్యేక కారణం లేకుండానే వారు చెక్ చేసే అవకాశం ఉంది. ప్రయాణికులు ఏ దేశంవారైనా, వారి వీసా ఎలాంటిదైనా సరే అధికారులు ఈ తనిఖీలు చేయవచ్చు. ప్రయాణికుల ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను చెక్ చేయడానికి బోర్డర్ అధికారులకు సెర్చ్ వారెంట్ అవసరం లేదని కోర్టు తేల్చిచెప్పింది. ప్రయాణికుల ఫోన్ డేటాను పరిశీలించడానికి ముందే అధికారులు కచ్చితంగా వారెంట్ తీసుకోవాలని రాజ్యాంగం చెప్పలేదని కోర్టు పేర్కొంది.

మనీలాండరింగ్ అభియోగంపై వ్యక్తి అరెస్టు

 

న్యూయార్క్ విమానాశ్రయంలో గ్రీన్ కార్డు ఉన్న చిన్‌వెందు అలిసిగ్వే అనే వ్యక్తి ఫోన్‌ను అధికారులు చెక్ చేశారు. ఆ ఫోన్‌లో దొరికిన ఆధారాలతో అతన్ని బ్యాంక్ మోసం, అక్రమ డబ్బు బదిలీ, మనీలాండరింగ్ కేసులో దోషిగా నిర్ధారించారు. ఎలాంటి వారెంట్ లేదా ప్రత్యేకంగా ఎలాంటి అనుమానం లేకపోయినా, సరిహద్దు అధికారులు నేరుగా ఫోన్లను చెక్ చేయవచ్చని గురువారం కోర్టు స్పష్టం చేసింది. బోర్డర్ లో తనిఖీ చేసేటప్పుడు మొబైల్ ఫోన్లను కూడా సాధారణ వస్తువుల్లాగే చూడాలని, సూట్‌కేసులు, డైరీలు ఎలా చెక్ చేస్తారో.. ఫోన్లను కూడా అలాగే ఎలాంటి ప్రత్యేక అనుమతి లేకుండా “సాధారణ” తనిఖీ కింద చెక్ చేయవచ్చని స్పష్టం చేసింది.  సూట్‌కేసులు, డైరీల కంటే ఫోన్లలో వ్యక్తిగత సమాచారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి ప్రత్యేకంగా రాజ్యాంగ రక్షణ ఇవ్వాలనే వాదనను జడ్జిలు తోసిపుచ్చారు.

ఫోన్లలో మాన్యువల్‌గా చేసే చెకింగ్‌ను కూడా ఒక సాధారణ బోర్డర్ చెకింగ్‌లాగే కోర్టు చూసింది.  గతంలో ఉన్న నిబంధనల ప్రకారం.. అమెరికాలోకి వచ్చేవారిని, వారి సామాగ్రిని ఎలాంటి వారెంట్ లేకుండా తనిఖీ చేసే పూర్తి అధికారం ప్రభుత్వ అధికారులకు ఉంది. అమెరికా లోపల పోలీసులు చేసే తనిఖీలకూ, బోర్డర్ వద్ద చేసే తనిఖీలకూ తేడా ఉందని కోర్టు ఈ తీర్పులో పేర్కొంది. 2014లో ‘రైలీ వర్సెస్ కాలిఫోర్నియా’ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ.. పోలీసులు ఎవరనైనా అరెస్టు చేసినప్పుడు వారి ఫోన్ చెక్ చేయాలంటే ముందుగా వారెంట్ తీసుకోవాలని స్పష్టం చేసింది.

ఫోన్లలో జర్నలిస్టుల ఆర్టికల్స్, పర్సనల్ మెసేజ్‌లు, రాజకీయ అభిప్రాయాలు, ఫోటోలు, ఎవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే పూర్తి వివరాలుంటాయి కాబట్టి.. ఇది భావప్రకటన స్వేచ్ఛ కోణంలో ఆందోళనకు దారి తీసింది.  పౌర హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.ఈ కేసులో వాదించిన ‘నైట్ ఫస్ట్ అమెండ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్’ సంస్థ.. భావప్రకటన స్వేచ్ఛకు, జర్నలిజానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని,  ఫోన్ల చెకింగ్‌కు రాజ్యాంగ రక్షణ కల్పించాలని వాదించింది. దీనిపై అమెరికాలోని వివిధ కోర్టులు భవిష్యత్తులొ  విచారణలు జరిపే అవకాశం ఉంది.

అయినప్పటికీ, సరిహద్దుల వద్ద ఫోన్లను చెక్ చేయడానికి ఫస్ట్ అమెండ్‌మెంట్ (మొదటి రాజ్యాంగ సవరణ) ప్రకారం ప్రత్యేకంగా వారెంట్ తీసుకోవాలనే వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఉగ్రవాదానికి సంబంధించిన లేదా నిషేధిత విషయాలను అడ్డుకోవడానికి, బోర్డర్ చట్టాలను అమలు చేయడానికి ప్రభుత్వానికి పూర్తి అధికారాలుంటాయని స్పష్టం చేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us