హైట్ పెరగాలనే పిచ్చి.. క్యాన్సర్ మందులు మింగుతున్న టీనేజర్లు!

హైట్‌ ఉంటేనే అందంగా కనిపిస్తారా? ఎత్తు తక్కువైతే ఆకర్షణ తగ్గుతుందా? సోషల్ మీడియా ప్రభావంతో టీనేజర్లలో ఇలాంటి ఆలోచనలు పెరుగుతున్నాయి. ఎలాగైనా మరికొన్ని అంగుళాలు ఎత్తు పెరగాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎత్తు పెరగడం కోసం ఏకంగా క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మందులను తీసుకుంటున్నారు. నెలకు వేల రూపాయలు ఖర్చు చేసి మరీ విదేశాల నుంచి ఈ మందులను తెప్పించుకుంటున్నారు. సోషల్ మీడియాలో మొదలైన ఈ వింత ట్రెండ్‌ను 'హైట్ మ్యాక్సింగ్' (Heightmaxxing) అంటున్నారు.

హైట్ పెరగాలనే పిచ్చి.. క్యాన్సర్ మందులు మింగుతున్న టీనేజర్లు!
Teenage Boys Are Taking Cancer Drug To Get Taller Heightmaxxing Is Dangerous

Updated on: Nov 10, 2026 | 11:20 AM

సోషల్ మీడియాలో  ‘లుక్స్ మ్యాక్సింగ్’ (Looksmaxxing)  ట్రెండ్ యువతను ఆకర్షిస్తోంది.  కండలు తిరిగిన శరీరంతో మొదలయ్యే ఈ ట్రెండ్ కొందరిలో ప్రమాద స్థాయికి చేరుతోంది. పొడవుగా ఉంటేనే అమ్మాయిలకు నచ్చుతారని,  ఆత్మవిశ్వాసం పెరుగుతుందని కొందరు ప్రచారం చేస్తున్నారు.  అమెరికాలో  ‘షార్ట్ కింగ్’ మీమ్స్ పొట్టిగా ఉన్నవారిపై  జోకులు వేయడం టీనేజర్లను కుంగదీస్తున్నాయి.  మరికొన్ని అంగుళాలు హైట్ పెరగడానికి అడ్డదారులు వెతికే క్రమంలో క్యాన్సర్ మందు మింగుతున్నారు.

15 ఏళ్లకే క్యాన్సర్ మందు.. నెలకు రూ.25 వేలకు పైగా ఖర్చు!

న్యూయార్క్‌కు చెందిన జాక్ అనే యువకుడు 15 ఏళ్ల వయసులోనే ఎత్తు పెరగడానికి ఎర్డాఫిటినిబ్ (Erdafitinib) అనే క్యాన్సర్ మందు వాడటం ప్రారంభించాడనీ అమెరికాకు చెందిన ‘రోలింగ్ స్టోన్’ పత్రిక  బయటపెట్టింది. ప్రస్తుతం అతడి వయసు 17 ఏళ్లు. తన క్లాస్‌మేట్స్ కంటే తక్కువ ఎత్తులో ఉండటం, సోషల్ మీడియాలో పొట్టిగా ఉన్నవారిపై జోకులు బాధించాయని అతను చెప్పాడు. ఆన్‌లైన్ విక్రేతల నుంచి క్యాన్సర్ మందు తెప్పించుకుని వాడుతున్నాడు.  నెలకు 300 డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.25 వేలు ఖర్చు చేస్తున్నాడు.

మందు వాడకం ప్రమాదమని ఆపలేదు. ఆరోగ్య సమస్యలొస్తే ఆసుపత్రి ఖర్చుల కోసం కూడా డబ్బులు దాచుకున్నాడు. ముక్కు నుంచి రక్తం కారడం, చర్మం పొడిబారడం, కీళ్ల నొప్పులు బాధించినా మందు వేసుకోవడం ఆపలేదు.

క్యాన్సర్ మందుతో ఎత్తు ఎలా పెరుగుతుంది?

ఎర్డాఫిటినిబ్ ఎత్తు పెంచడానికి వాడే మందు కాదు. మూత్రాశయ క్యాన్సర్ తో బాధపడుతున్న వృద్ధులకు ఇస్తారు.  FGFR3 అనే ప్రోటీన్ ఎముకల ఎదుగుదలకు సహకరిస్తుంది.  చిన్నతనం, యుక్తవయసులో దీని ద్వారా ఎముకలు పొడవుగా పెరుగుతాయి. ఈ ప్రోటీన్ పనితీరును పెంచడం ద్వారా  హైట్ పెరగొచ్చని సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం జరుగుతోంది.

ఇద్దరు చిన్నారులపై పరిశోధన.. సోషల్ మీడియాలో మరోలా ప్రచారం!

ఈ ట్రెండ్ వెనుక 2024లో ప్రచురితమైన ఓ వైద్య అధ్యయనం ఉంది. ఎర్డాఫిటినిబ్ మందు తీసుకున్న ఇద్దరు చిన్నారులు వేగంగా ఎత్తు పెరిగారు. అయితే ఆ చిన్నారులు కేంద్ర నాడీ వ్యవస్థకు సంబంధించిన కణితితో బాధపడ్డారు.  మందును వైద్య పర్యవేక్షణలో చిన్నారులకు అందించారు. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన ఈ అధ్యయనం, ఇద్దరు అనారోగ్యంతో బాధపడిన చిన్నారుల్లో హైట్ పెరగడాన్ని ఆరోగ్యవంతులైన టీనేజర్లకు వర్తింపచేస్తూ ప్రచారం చేస్తున్నారు.

మందు వాడితే కళ్లు దెబ్బతినే ప్రమాదం.. ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్!

ఎత్తు పెరగడం కోసం క్యాన్సర్ మందు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రంగా ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చిస్తున్నారు.  ముక్కు నుంచి రక్తం కారడం, చర్మం పొడిబారడం, కీళ్ల నొప్పులు, కంటి చూపులో మార్పులు,  విరేచనాలు, నోటిలో పుండ్లు బాధిస్తాయి.

సోషల్ మీడియా పోటీ యువతను ప్రమాదంలోకి నెడుతోందా?

లుక్స్ మ్యాక్సింగ్ ట్రెండ్ ఎక్కడికి దారితీసిందో ఈ ఘటన స్పష్టం చేసింది.  రూపాన్ని రేట్ చేసే యాప్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, నిరంతరం కనిపించే అందాల ప్రమాణాలు యువతను ఒత్తిడిని పెంచుతున్నట్లు  జాన్స్ హాప్కిన్స్ నివేదిక లో తెలిసింది.  కొందరు ప్రమాదకరమైన డైట్లు, స్టెరాయిడ్లు, చివరకు క్యాన్సర్ మందుల వరకు వెళ్తున్నారు.

నిజానికి ప్రతి ఒక్కరి శరీర ఎదుగుదల ఒకేలా ఉండదు. ఎత్తు విషయంలో ఆందోళన ఉంటే వైద్యులను సంప్రదించాలి. సోషల్ మీడియాలో కనిపించే చిట్కాలను నమ్మి సొంతంగా మందులు వాడటం మంచిది కాదు. కొన్ని అంగుళాల ఎత్తు కోసం ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకోవడం అవసరమా? అందంగా కనిపించడం పై దృష్టి పెట్టడం కంటె ప్రతిభ, టాలెంట్ తో గుర్తింపు తెచ్చుకోవడం,  ఆరోగ్యంగా ఉండటం ముఖ్యమనే విషయాన్ని టీనేజర్లు గుర్తుంచుకోవాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us