
సముద్రంలో నుంచి ఒక్కసారిగా వేలాది చేపలు నీటిపైకి ఎగిరిపడితే ఎలా ఉంటుంది? వినడానికే అవాక్కయ్యేలా ఉన్న ఈ ఘటనను.. బీచ్ ఒడ్డున ఉన్నవారి కళ్ల ముందే జరుగుతూ ఉంటే ఆశ్చర్యపోకుండా ఉంటారా? ఇలాంటి అరుదైన సంఘటనే స్పెయిన్‌లోని మలాగా సమీపంలోని కోస్టా డెల్ సోల్ తీరంలో చోటుచేసుకుంది. సముద్రం లోపలి నుంచి వెండి రంగులో చిన్న చిన్న మెరిసే చేపలు గుంపులుగా నీటి నుంచి బయటకు దూకుతూ ఒడ్డుకు చేరాయి. ఒడ్డుపైకి వచ్చిన తర్వాత కొన్ని చేపలు ప్రాణాలు కాపాడుకునేందుకు తీవ్రంగా కొట్టుమిట్టాడాయి. ఈ దృశ్యాలను అక్కడున్న కొందరు తమ ఫోన్లలో చిత్రీకరించగా.. ప్రస్తుతం సదరు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సాధారణంగా పెద్ద చేపలు లేదా ఇతర సముద్ర జీవుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో చిన్న చేపలు గుంపులుగా వేగంగా కదులుతుంటాయి. ఈ క్రమంలోనే ఏదో తమను తరుముతుండటంతో ఈ చేపలు ఒక్కసారిగా నీటి నుంచి బయటకు దూకి ఉంటాయని స్థానిక మత్స్యకారులు భావిస్తున్నారు. ఈ చిన్న చేపలు లాచాస్ జాతికి చెందినవిగా మలాగా మత్స్యకారుల సంఘం ప్రతినిధి మారి కార్మెన్ నవాస్ తెలిపారు. ఈ చేపల గుంపును వేటాడేంది ట్యూనా చేప అని కొందరు.. షార్క్‌ల గుంపు అయి ఉండొచ్చని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక ఒడ్డుపైకి ఎగిరిపడిన చేపలకు ఆకాశంలో తిరుగుతున్న డజన్ల కొద్దీ సీగల్స్ (సముద్రపు పక్షులు) నుంచి మరో ముప్పు ఎదురైనట్టు తెలుస్తోంది. ఒడ్డుపై పడి ఉన్న చేపలను సీగల్స్ ఒక్కసారిగా కిందకు వాలుతూ తమ ముక్కులతో పట్టుకెళుతున్నాయి. ఈ ఆసక్తికర ఘటనను చూసేందుకు సమీప ప్రాంతాల నుంచి చిన్నారులు, స్థానికులు ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. అలానే ఈ అసాధారణ దృశ్యాన్ని కొందరు బైబిల్‌లోని నూతన నిబంధనలో ప్రస్తావించిన అద్భుత ఘటనతో పోలుస్తున్నారు. మరోవైపు అసలు ఈ వీడియోలు నిజమైనవేనా? లేక ఏఐ సాయంతో సృష్టించినవా? అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.