పాము – ముంగీస కథ.. ప్రకృతి దాచిన రహస్యాలు.. ఈ పగ ఎప్పుడు మొదలైందో తెలుసా?

క్షణాల్లో ప్రాణాలు తీసే విషసర్పం ఒకవైపు.. కన్నుమూసి తెరిచేలోపు దాడి చేసే చురుకైన ముంగిస మరోవైపు.. ఈ రెండూ ముఖాముఖి తలపడితే గెలుపు దాదాపు ముంగిసదే అవుతుంది. కేవలం బలం మాత్రమే కాదు, ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన జన్యు రక్షణ కవచం, మెరుపు వేగమే ముంగిసను విన్నర్‌గా నిలబెడతాయి. ఆ ఆసక్తికర పోరాట రహస్యాలు ఇవే..

పాము - ముంగీస కథ.. ప్రకృతి దాచిన రహస్యాలు.. ఈ పగ ఎప్పుడు మొదలైందో తెలుసా?
Snake Vs Mongoose

Updated on: Aug 22, 2026 | 8:14 PM

జంతు ప్రపంచంలో పాము, ముంగిసల మధ్య జరిగే సమరం అత్యంత ఉత్కంఠభరితమైనది. ప్రమాదకరమైన నాగుపాము వంటి విషసర్పాలను సైతం ముంగిస క్షణాల్లో వేటాడి చంపేస్తుంది. అయితే ముంగిస కేవలం బలం వల్లే గెలుస్తుందా? లేక పాము విషం ముంగిసపై అస్సలు పనిచేయదా? ఈ పోరాటం వెనుక ఉన్న ఆసక్తికరమైన సైంటిఫిక్ నిజాలు, ముంగిస ఎత్తుగడల గురించి చాలా మందికి తెలియవు. ముంగిసకు ఉన్న అతిపెద్ద బలం దాని అద్భుతమైన స్పందించే వేగం. పాము కాటు వేసే లోపే, కేవలం కొన్ని మిల్లీ సెకన్లలో ముంగిస పక్కకు తప్పుకోగలదు. పాము చుట్టూ తిరుగుతూ దాన్ని అలసిపోయేలా చేయడం ముంగిస ప్రాథమిక వ్యూహం. పాము పూర్తిగా అలసిపోయి ఏకాగ్రత కోల్పోయిన క్షణంలో మెరుపు వేగంతో దాని తల లేదా మెడ భాగాన్ని పట్టుకుని అంతం చేస్తుంది.

పాము విషం ముంగిసపై ఎందుకు పనిచేయదు?

పాము విషం ముంగిసను ఏమీ చేయలేదనేది చాలామందిలో ఉన్న సాధారణ నమ్మకం. కానీ శాస్త్రీయంగా చూస్తే ఇది పాక్షికంగా మాత్రమే నిజం. ముంగిస శరీరంలో ప్రత్యేకమైన ఎసిటైల్‌కోలిన్ రిసెప్టర్లు ఉంటాయి. ఇవి పాము విషంలోని న్యూరోటాక్సిన్‌లు నాడీ వ్యవస్థను స్తంభింపజేయకుండా సహజ రక్షణ కవచంలా అడ్డుకుంటాయి. ఈ జన్యుపరమైన రక్షణ వల్ల తక్కువ మోతాదులో విషం ఎక్కినా ముంగిస తట్టుకోగలదు. అయితే పాము పదే పదే కాటు వేస్తే లేదా అత్యధిక మోతాదులో విషం చేరితే ముంగిస కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.

మందపాటి బొచ్చు రక్షణ కవచం

శరీర అంతర్గత రోగనిరోధకతతో పాటు ముంగిస శరీరంపై ఉండే దట్టమైన, గరుకైన బొచ్చు, దృఢమైన చర్మం కూడా పాము కోరలు నేరుగా రక్తనాళాల్లోకి దిగకుండా అడ్డుకుంటాయి. పోరాడే సమయంలో ముంగిస తన బొచ్చును నిక్కబొడుచుకునేలా చేస్తుంది. దీనివల్ల అది శరీర పరిమాణం కంటే పెద్దదిగా కనిపించి పామును భయపెట్టడమే కాకుండా పాము కాటు కేవలం బొచ్చుకే పరిమితమయ్యేలా చేస్తుంది.

పాము, ముంగిస మధ్య జరిగే పోరాటం కేవలం బలానికి సంబంధించింది మాత్రమే కాదు. ఇది విషానికి, చురుకుదనానికి మధ్య తరతరాలుగా జరుగుతున్న పరిణామ క్రమ పోరాటం. విషాన్ని తట్టుకునే శక్తి కంటే, తనకున్న అపారమైన సమయస్ఫూర్తి, మెరుపు వేగంతో కూడిన వ్యూహాల వల్లే చాలావరకు పోరాటాల్లో ముంగిస విజయం సాధిస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us