
ఎండలు ముదురుతుండటంతో పాములు తమ ఆవాసాలను వదిలి చల్లని ప్రాంతాల కోసం ఇళ్లలోకి, తోటల్లోకి వస్తున్నాయి. ఫలితంగా పాముకాటు సంఘటనలు గణనీయంగా పెరుగుతున్నాయి. కేవలం కేరళ రాష్ట్రంలోనే గడిచిన ఏప్రిల్ నెలలో 49 మంది పాముకాటుకు గురై మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో పాముల పట్ల అపోహలు తొలగించడానికి, బాధితులకు ప్రాణాపాయం కలగకుండా ఉండటానికి తమిళనాడు అటవీ శాఖ ఒక ప్రత్యేక పుస్తకాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది.
పామును చూడగానే చాలామంది భయాందోళనలకు గురవుతారు. అయితే మనకు కనిపించే అన్ని పాములూ విషపూరితమైనవి కావు. ఉదాహరణకు.. అత్యంత భయంకరంగా కనిపించే కొండచిలువ వాస్తవానికి విషరహితమైనది. పాముల గురించి అవగాహన లేకపోవడమే ఈ అనవసర భయానికి కారణమని సర్పశాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పాము కాటు వేసినప్పుడు మొదటి నిమిషం చాలా కీలకం. ఆ సమయంలో కంగారు పడకుండా ఈ క్రింది జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు:
కదలకుండా ఉండాలి: పాము కాటు వేసిన తర్వాత బాధితుడు పరుగెత్తడం లేదా వేగంగా నడవడం చేయకూడదు. శరీరం ఎంత ఎక్కువగా కదిలితే, రక్త ప్రసరణ అంత వేగంగా జరిగి విషం గుండెకు, మెదడుకు త్వరగా చేరుతుంది.
తేలికపాటి కట్టు: కాటు వేసిన ప్రదేశానికి సుమారు 6 అంగుళాల పైన ఒక తాడు లేదా రిబ్బన్‌తో తేలికగా కట్టాలి. ఇది విషం శరీరమంతా వ్యాపించకుండా నెమ్మదింపజేస్తుంది.
వైద్య సహాయం: ఏమాత్రం ఆలస్యం చేయకుండా 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయాలి లేదా సమీపంలోని ఆసుపత్రికి తరలించాలి.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు: చిన్న గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కూడా పాముకాటు విరుగుడు మందులు అందుబాటులో ఉంటాయి.
విషాన్ని పీల్చడం: సినిమాల్లో చూపించినట్లు నోటితో విషాన్ని పీల్చే ప్రయత్నం చేయకూడదు. ఇది బాధితుడికే కాకుండా, చేసే వ్యక్తికి కూడా ప్రమాదకరం.
నాటు వైద్యం: పాము కాటుకు మంత్రాలు, తాయెత్తులు లేదా ఆకు పసరు వంటి నాటు వైద్యం చేయించుకుని కాలాన్ని వృథా చేయకండి. అది ప్రాణాల మీదికి తెస్తుంది.
పామును పట్టుకోవడం: కాటు వేసిన పామును పట్టుకోవడానికి లేదా కొట్టడానికి ప్రయత్నించి సమయాన్ని వృథా చేయవద్దు. ఒకవేళ వీలైతే దూరం నుండి ఫోటో తీయండి, అది వైద్యులకు చికిత్సలో సహాయపడుతుంది.