
సౌదీ అరేబియాలో ఇద్దరు బంగ్లాదేశ్ పౌరులకు మరణశిక్ష అమలు చేయడం బంగ్లాదేశ్ లో ఆగ్రహావేశాలకు దారితీసింది. మక్కాలోని ఓ మసీదులో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలతో నజ్రుల్ ఇస్లాం, సితి అక్తర్ ను అక్టోబర్ 14న ఉరితీసారు. అయితే తమ దేశ పౌరులకు మరణశిక్ష వేసే ముందు సౌదీ ప్రభుత్వం తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని బంగ్లాదేశ్ అధికారులు కోపంగా ఉన్నారు. కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు, కోర్టు తీర్పుల ప్రతులు ఇవ్వాలని సౌదీని కోరారు.
మరణశిక్షకు గురైన ఇద్దరూ బంగ్లాదేశ్‌కు చెందినవారే. నజ్రుల్ నాలుగేళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లి తొలుత క్లీనర్‌గా, ఆ తర్వాత మక్కాలోని ఓ మసీదులో మెయిన్టెనెన్స్ కార్మికుడిగా పనిచేసాడు. బంగ్లాదేశ్ నివాసి సితి అక్తర్ కూడా అదే మసీదులో పనికి కుదిరింది. వీరు మసీదులో నుదుటిపై ముద్దు పెట్టుకున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. ఇంత చిన్న విషయానికే ‘తాజీర్’ (Ta’zir) శిక్షను నిర్ణయించి ఉరి తీయడం పై బంగ్లాదేశ్ లో అసంతృప్తి నెలకొంది. అయితే వీరి ఉరితీత వెనుక వేరే కారణాలున్నట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. నజ్రుల్ సౌదీలో ఓ పాకిస్తానీ వ్యక్తితో గొడవ పడ్డాడనీ కుట్రలో భాగంగా ప్రస్తుతం ఆ కేసులో ఇరికించారనీ అనుమానిస్తున్నారు. సితి అక్తర్ విషయంలో కూడా తప్పు జరిగిందనీ ఇతర మహిళా కార్మికులతో గొడవ తర్వాతే ఆమెను కేసులో ఇరికించారనీ అంటున్నారు.
బంగ్లాదేశ్‌కు సమాచారం ఇవ్వకపోవడం వియన్నా కన్వెన్షన్ ఉల్లంఘన కిందకు వస్తుందని బంగ్లాదేశ్‌లో టాక్ నడుస్తోంది. తమ దేశ పౌరులకు మరణశిక్ష అమలు చేసిన విషయం సౌదీ అరేబియా ముందుగా ఎందుకు తెలియచేయలేదని బంగ్లాదేశ్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మీడియా కథనాల ద్వారానే ఈ విషయం తెలిసిందనీ, సౌదీ ప్రభుత్వాన్ని వివరణ కోరారు. ఈ కేసుల్లో ఏ నేరాలు నిర్ధారణ అయ్యాయి? కోర్టులు ఎలాంటి ఆధారాలను పరిగణనలోకి తీసుకున్నాయి? మరణశిక్ష విధించడానికి కారణాలేమిటి? ఈ అంశాలపై స్పష్టత ఇవ్వాలని ఢాకా కోరుతోంది. సౌదీ ప్రభుత్వం నుంచి సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్లు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి షామా ఒబాయెద్ ఇస్లాం తెలిపారు.
సౌదీ ప్రభుత్వం కఠిన నిర్ణయంపై బంగ్లాదేశ్ ప్రజలు, సోషల్ మీడియా వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న తప్పు చేశారనే ఆరోపణతో ఇద్దరికి మరణశిక్ష విధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. విదేశాల్లో ఉన్న తమ పౌరులను కాపాడటంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం విఫలమైందని కొందరు విమర్శిస్తున్నారు. శ్రీలంక వంటి దేశాలు తమ పౌరులకు మరణశిక్ష అమలు కాకుండా ప్రయత్నాలు చేసినప్పుడు.. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎందుకు అలాంటి చర్యలు తీసుకోలేకపోయిందని నిలదీస్తున్నారు. ఈ ఘటనతో సౌదీ అరేబియా, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలలో ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. మరణశిక్షకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని, మృతదేహాలను తమకు అప్పగించాలని బాధిత కుటుంబాలు, బంగ్లాదేశ్ ప్రభుత్వం కోరుతున్నాయి. అయితే, ఈ కేసులో అసలు ఏం జరిగిందనే దానిపై సౌదీ ప్రభుత్వం మౌనం వీడటం లేదు.