Video: రష్యన్.. మనసు గెలిచెన్! బెంగళూరులో ఇంటి పనిమనిషికి ఊహించని సర్‌ప్రైజ్

బెంగళూరులో నివసిస్తున్న రష్యన్ మహిళ యానా తన ఇంట్లో పనిచేసే సహాయకురాలికి జీవితంలో తొలిసారి పుట్టినరోజు కేక్ అందించి సర్‌ప్రైజ్ చేసింది. కుటుంబ సభ్యులతో కలిసి చిన్న వేడుక ఏర్పాటు చేసి కేక్ కట్ చేయించింది. ఊహించని ఈ ప్రేమాభిమానానికి ఆమె ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది.

Video: రష్యన్.. మనసు గెలిచెన్! బెంగళూరులో ఇంటి పనిమనిషికి ఊహించని సర్‌ప్రైజ్
Russian Woman In Bengaluru Surprises Domestic Helper

Updated on: Aug 21, 2026 | 8:59 PM

బెంగళూరులో చోటుచేసుకున్న ఓ చిన్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల మనసులను గెలుచుకుంటోంది. ఓ రష్యన్ మహిళ తన ఇంట్లో పనిచేసే సహాయకురాలికి జీవితంలో తొలిసారి పుట్టినరోజు కేక్ అందించి సర్‌ప్రైజ్ చేసింది. ఊహించని ఈ వేడుకతో ఆ మహిళ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకోవడం వీడియోలో కనిపించింది. సాధారణంగా కనిపించే ఈ పుట్టినరోజు వేడుక.. ప్రేమ, ఆప్యాయతలకు చిరునామాగా మారింది.

బెంగళూరులో నివసిస్తున్న యానా అనే రష్యన్ మహిళ తన ఇంట్లో పనిచేసే సహాయకురాలి పుట్టినరోజు గురించి తెలుసుకుంది. అయితే ఆమె జీవితంలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా పుట్టినరోజు కేక్ కట్ చేయలేదని తెలుసుకున్న యానా చలించిపోయింది. దీంతో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమెకు ప్రత్యేకంగా పుట్టినరోజు వేడుక నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా యానా కేక్‌ను కొనుగోలు చేసి, ఇంట్లోనే చిన్నపాటి సర్‌ప్రైజ్‌కు ఏర్పాట్లు చేసింది. కేక్‌పై కొవ్వొత్తులు వెలిగించి, కుటుంబ సభ్యులందరినీ సిద్ధం చేసింది.

వైరల్ అవుతున్న వీడియోలో మొదట యానా పుట్టినరోజు కేక్‌ను చూపించింది. అనంతరం ఆమె ఇంటి సహాయకురాలు అక్కడికి చేరుకుంది. యానా చిన్న కుమార్తె ముందుగా తలుపు తీసి ఆమెను లోపలికి ఆహ్వానించింది. ఆ తర్వాత యానా కేక్‌తో అక్కడికి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి ‘హ్యాపీ బర్త్‌డే’ అంటూ పాట పాడింది. ఊహించని విధంగా తన కోసం పుట్టినరోజు వేడుక ఏర్పాటు చేయడంతో ఆ మహిళ ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది. చిరునవ్వుతో కేక్ వైపు చూస్తూనే కన్నీళ్లు తుడుచుకుంది. యానా ఆమెను ఆప్యాయంగా కౌగిలించుకుంది. అనంతరం కేక్‌పై ఉన్న కొవ్వొత్తులను ఆమె ఊదేసింది. యానా చిన్నారి కూడా ఆమెను కౌగిలించుకోవడంతో ఆ క్షణం మరింత హృద్యంగా మారింది.

Loading...
Unable to load recommendations.
Follow Us