పెరిగిన రకూన్‌ల సంఖ్య.. పంట నష్టంతో రైతులు విలవిల

ఒకప్పుడు ఆకట్టుకున్న రకూన్ఇ ప్పుడు జపాన్‌లో పర్యావరణ సమస్యకు కారణమవుతుంది. 1977లో ప్రసారమైన కార్టూన్ ప్రభావంతో జపాన్‌ ప్రజలు రకూన్‌లను  పెంచుకోవడం ప్రారంభించారు. అయితే, అడవి జంతువులను ఇళ్లలో పెంచుకోవడం అంత సులభం కాదని కొంతకాలానికే  వారికి అర్థమైంది. దీంతో కొందరు వాటిని బయట వదిలేశారు. మరికొన్ని తప్పించుకుని అడవుల్లోకి చేరాయి. అలా మొదలైన సమస్య ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. జపాన్‌లోని  47 ప్రిఫెక్చర్లలో (పరిపాలనా ప్రాంతాలు) రకూన్‌ల వల్ల భారీ పంట నష్టం జరిగినట్లు తెలిసింది.

పెరిగిన రకూన్‌ల సంఖ్య.. పంట నష్టంతో రైతులు విలవిల
Raccoons Spread In Japan Causing Huge Crop Losses

Updated on: Oct 23, 2026 | 10:48 PM

ఒకప్పుడు ఆకట్టుకున్న రకూన్ఇ ప్పుడు జపాన్‌లో పర్యావరణ సమస్యకు కారణమవుతుంది. 1977లో ప్రసారమైన కార్టూన్ ప్రభావంతో జపాన్‌ ప్రజలు రకూన్‌లను  పెంచుకోవడం ప్రారంభించారు. అయితే, అడవి జంతువులను ఇళ్లలో పెంచుకోవడం అంత సులభం కాదని కొంతకాలానికే  వారికి అర్థమైంది. దీంతో కొందరు వాటిని బయట వదిలేశారు. మరికొన్ని తప్పించుకుని అడవుల్లోకి చేరాయి. అలా మొదలైన సమస్య ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. జపాన్‌లోని  47 ప్రిఫెక్చర్లలో (పరిపాలనా ప్రాంతాలు) రకూన్‌ల వల్ల భారీ పంట నష్టం జరిగినట్లు తెలిసింది.

పిల్లల కార్టూన్‌తో మొదలైన రకూన్‌ క్రేజ్‌!

1977లో జపాన్‌లో ప్రసారమైన ‘రాస్కల్ ది రకూన్‌’ అనే యానిమేటడ్‌ సిరీస్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. స్టెర్లింగ్ నార్త్ రాసిన ఓ పుస్తకం ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. ఇందులో ఓ బాలుడు, అతడు పెంచుకునే రకూన్‌ మధ్య అనుబంధాన్ని చూపించారు. కార్టూన్‌లో రకూన్‌ ఎంతో ముద్దుగా కనిపించడంతో జపాన్‌లోని అనేక కుటుంబాలు జంతువును పెంచుకోవాలని ఆసక్తి చూపించాయి. దీంతో అమెరికా, కెనడా నుంచి పెద్ద సంఖ్యలో రకూన్‌లను జపాన్‌కు దిగుమతి చేసారు.

అయితే, కార్టూన్‌లో కనిపించినంత సులభంగా నిజ జీవితంలో రాకూన్‌లను పెంచడం సాధ్యం కాలేదు. రకూన్‌లు అడవుల్లో జీవించే జంతువులు. వాటి సహజ ప్రవర్తన, ఆహారపు అలవాట్లు, చురుకుదనం కారణంగా ఇళ్లలో వాటిని అదుపులో ఉంచడం చాలా మందికి కష్టంగా మారింది. దీంతో కొందరు వాటిని బయట వదిలేశారు. మరికొన్ని వాటంతట అవే తప్పించుకుని అడవుల్లోకి చేరాయి. అలా పెంపుడు జంతువులుగా జపాన్‌కు వచ్చిన రకూన్‌లు క్రమంగా అక్కడి ప్రకృతిలో విస్తరించడం ప్రారంభించాయి.

దేశమంతటా విస్తరణ!

రకూన్‌లు జపాన్‌కు చెందిన స్థానిక జంతువులు కావు. ఇతర దేశాల నుంచి వచ్చినవి జపాన్‌లో పర్యావరణానికి ముప్పుగా మారాయి. వేగంగా సంతానోత్పత్తి చేస్తూ వ్యాప్తి చెందాయి. ప్రస్తుతం జపాన్‌లోని 47 ప్రిఫెక్చర్లలో వాటి వల్ల తీవ్ర పంట నష్టం జరుగుతోంది. సమస్యను గుర్తించిన జపాన్ ప్రభుత్వం రకూన్‌ల దిగుమతిపై నిషేధం విధించింది. అయితే అప్పటికే అడవుల్లోకి చేరిన జంతువుల వ్యాప్తిని పూర్తిగా అడ్డుకోవడం సాధ్యం కాలేదు.

రైతులకు 450 మిలియన్ల యెన్ భారీ నష్టం..!

రకూన్‌ల సంఖ్య పెరగడంతో జపాన్ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండ్లు, కూరగాయల పంటలను అవి తినేస్తూ నష్టం కలిగిస్తున్నాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో రకూన్‌ల కారణంగా వ్యవసాయ రంగానికి దాదాపు 450 మిలియన్ యెన్ల నష్టం వాటిల్లింది. అంటే దాదాపు 2.9 మిలియన్ అమెరికన్ డాలర్లు. స్థానిక అధికారులు వీటి సంఖ్యను నియంత్రించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

రకూన్‌లను నియంత్రించడం ఎందుకంత కష్టం?

రకూన్‌ల వ్యాప్తిని అరికట్టేందుకు స్థానిక ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నా అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. రకూన్‌లను పట్టుకునేందుకు తగిన సిబ్బంది లేకపోవడం, నిధుల కొరత, వాటిని నియంత్రించడంలో అనుభవం ఉన్న నిపుణులు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. అంతేకాకుండా, కొన్ని ప్రాంతాల్లో అసలు ఎన్ని రాకూన్‌లు ఉన్నాయనే విషయంపై కూడా స్పష్టమైన సమాచారం లేదు. దీంతో వాటి వ్యాప్తిని అంచనా వేయడం, తగిన చర్యలు తీసుకోవడం కష్టమవుతోంది. కొన్ని ప్రాంతాల్లో ప్రారంభ దశలోనే పెద్దఎత్తున నియంత్రణ చర్యలు చేపట్టడం వల్ల ఫలితాలు కనిపించాయి. కానీ చాలా ప్రాంతాల్లో రకూన్‌ల సంఖ్యను దీర్ఘకాలం పాటు తగ్గించడం సాధ్యం కాలేదు.

రకూన్‌లు వేరు.. తనుకి వేరు!

జపాన్‌లో రకూన్‌లను స్థానికంగా కనిపించే ‘తనుకి’ అనే జంతువులతో కొందరు పొరబడుతున్నారు. అయితే, ఈ రెండూ వేర్వేరు జంతువులు. తనుకి జపాన్‌కు చెందిన రకూన్ డాగ్‌ (Raccoon Dog). ఇది అక్కడి జానపద కథల్లోనూ కనిపిస్తుంది. రకూన్‌లు మాత్రం ఇతర ప్రాంతాలకు చెందినవి. జపాన్‌లో వాటి వ్యాప్తి స్థానిక పర్యావరణానికి సమస్యగా మారింది.

కార్టూన్‌ నేర్పిన పాఠం!

పిల్లలను ఆకట్టుకునే ఓ కార్టూన్‌.. కొన్ని దశాబ్దాల తర్వాత ఒక దేశానికి పర్యావరణ సమస్యగా మారుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఈ ఘటన పెంపుడు జంతువులను ఎంపిక చేసే సమయంలో జాగ్రత్తలను గుర్తుచేస్తోంది. ముద్దుగా కనిపించే ప్రతి జంతువూ ఇంట్లో పెంచుకోవడానికి అనుకూలంగా ఉండదు. ముఖ్యంగా ఇతర దేశాలకు చెందిన జంతువులను పెంచుకోవాలనుకునేవారు వాటి సహజ ప్రవర్తన, సంరక్షణ అవసరాలు, పర్యావరణంపై అవగాహన పెంచుకోవాలి.

ఒక జంతువును పెంచుకోవడం కష్టమైందని దాన్ని అడవుల్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో వదిలేయడం సరైన పరిష్కారం కాదు. అలా చేయడం వల్ల స్థానిక జీవులకు ముప్పు ఏర్పడటంతో పాటు రైతులకు, పర్యావరణానికి దీర్ఘకాలిక నష్టం కలగవచ్చు. ఒక ట్రెండ్‌ కొద్దిరోజుల్లో కనుమరుగవుతుంది.. కానీ దాని ప్రభావం దశాబ్దాల పాటు కొనసాగవచ్చు. జపాన్‌లో రకూన్‌ల కథ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us