
ఆస్ట్రేలియాలో ప్లంబింగ్ వృత్తి ద్వారా లభించే భారీ ఆదాయం గురించి ఒక భారతీయ యువకుడు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఒక భారతీయ కంటెంట్ క్రియేటర్, అక్కడ శారీరక శ్రమతో కూడిన సాంకేతిక వృత్తులు చేసే వారికి ఉండే డిమాండ్‌ను వివరించాడు. అతని కథనం ప్రకారం, ఆస్ట్రేలియాలో ప్లంబింగ్ అనేది అత్యంత గౌరవప్రదమైన, అత్యధిక వేతనం లభించే వృత్తులలో ఒకటి. అక్కడ అనుభవం ఉన్న ఒక ప్లంబర్ సగటున గంటకు 40 నుండి 90 ఆస్ట్రేలియన్ డాలర్ల (దాదాపు రూ.2,200 నుండి రూ.5,000 పైగా) వరకు ఛార్జ్ చేస్తారు. ఈ లెక్కన ఒక ప్లంబర్ వార్షిక ఆదాయం సుమారు 80,000 నుండి 1,20,000 ఆస్ట్రేలియన్ డాలర్ల (సుమారు రూ.45 లక్షల నుండి రూ.67 లక్షల రూపాయలు) వరకు ఉంటుంది. కొన్ని ప్రత్యేక అత్యవసర సమయాల్లో ఈ సంపాదన మరింత ఎక్కువగా ఉంటుంది.
ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాలలో కొత్త నిర్మాణ రంగాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. కానీ, దానికి తగినట్లుగా ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్ల కొరత తీవ్రంగా ఉంది. అక్కడి స్థానిక యువత ఈ వృత్తుల వైపు తక్కువగా మొగ్గు చూపడం వల్ల, విదేశాల నుండి వచ్చే నైపుణ్యం కలిగిన కార్మికులకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రత్యేక వీసాలు, పిఆర్ (PR – పర్మనెంట్ రెసిడెన్సీ) అవకాశాలను కూడా కల్పిస్తోంది.
ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పెద్ద పెద్ద డిగ్రీలు ఉంటేనే విదేశాల్లో సంపాదించగలమనే అపోహను ఈ వీడియో పటాపంచలు చేసింది. నైపుణ్యం, కష్టపడే తత్వం ఉంటే చేతివృత్తులతో కూడా విదేశాల్లో కోటీశ్వరులు కావచ్చు అనడానికి ఈ ప్లంబర్ల జీతాలే నిదర్శనం. ఉన్నత చదువులు చదవలేక, సరైన ఉద్యోగాలు దొరకక ఇబ్బంది పడే భారతీయ యువతకు ఇటువంటి స్కిల్డ్ కోర్సులు నేర్చుకుని విదేశాలకు వెళ్లడం ఒక అద్భుతమైన కెరీర్ ఆప్షన్ అని ఈ వీడియో సందేశాన్ని ఇస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..