
అమెరికా-మెక్సికో సరిహద్దులో ఓ వింత జీవి గోడ దాటుతూ కనిపించి కలకలం రేపింది. సాధారణ జంతువులా కనిపించని ఈ జీవి కోళ్లు, కుందేళ్లను ఎత్తుకెళ్తోందని స్థానికులు చెబుతున్నారు. దీని కెమెరా ఫొటోలు బయటకు రావడంతో అసలు ఇది ఏ జంతువు అనే ప్రశ్నలు మొదలయ్యాయి. కొందరు ఇది భూమిపై ఇప్పటివరకు గుర్తించని జీవి కావచ్చని అనుమానిస్తుండగా, మరికొందరు ఏలియన్ అయి ఉంటుందంటూ ఊహాగానాలు చేస్తున్నారు.
మెక్సికోలోని చిహువాహువా రాష్ట్రం వ్యాలీ ఆఫ్ జువారెజ్ లో ఈ వింత జీవి ప్రత్యక్షమైంది. స్థానికులు తమ పెంపుడు జంతువులు కనిపించకుండా పోతున్నాయని గగ్గోలు పెట్టడంతో కెమెరాలో ఈ వింత జీవిని గుర్తించారు అధికారులు. యూఎఫ్ఓలపై పరిశోధనలు చేసే జైమ్ మౌస్సాన్ బృందం విడుదల చేసిన సీసీ కెమెరా చిత్రాల్లో ఓ పెద్ద, లేత రంగులో ఉన్న జీవి కనిపించింది. దానికి పొడవైన తోక, కాళ్లు ఉన్నాయి. ఈ జీవి దాదాపు ఆరు అడుగుల పొడవు ఉండగా దాదాపు మూడు అడుగుల తోకతో ఓ పెద్ద ఇటుక గోడను ఎక్కుతూ కెమెరా కంట చిక్కింది. మిస్టరీ జీవి ఫొటో AI సృష్టి కావచ్చని కొందరు నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నేలపై కదులుతూ, పెద్ద గోడను సైతం ఎక్కుతున్న ఈ జీవి రూపం ఎలుకలు, రకూన్లు, కుందేళ్ల వంటి జంతువులను పోలి లేదని మౌస్సాన్ బృందం తెలిపింది. ఈ జీవి వెనుక కాళ్లపై మనిషిలా నిటారుగా నడవగలదని, చాలా వేగంగా కదులుతుందని, తెలివిగా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తోందని మౌస్సాన్ అభిప్రాయపడ్డారు. దానిలో మనిషిని పోలిన కొన్ని లక్షణాలు ఉన్నాయని చెప్పారు. ఓ బాలుడు చూసినట్లు చెబుతున్న ప్రకారం.. ఆ వింత జీవి కోడిని పట్టుకుని, సమీపంలోని చెట్టుపైకి ఎక్కింది. ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ వింత జీవి ఇతర జీవులతో కలిసి మరో గ్రహం నుంచి అంతరిక్ష నౌకలో వచ్చిందా? ప్రశ్నను లేవనెత్తారు జైమ్ మౌస్సాన్ . గతంలోనూ గ్రహాంతర జీవుల ప్రకటనలతో వార్తల్లో నిలిచారు జైమ్ మౌస్సాన్. 2023లో మెక్సికో కాంగ్రెస్లో రెండు మమ్మీ నమూనాలను ప్రదర్శిస్తూ, అవి మానవేతర జీవులకు సంబంధించినవని వాదించారు. అప్పట్లో ఆ ప్రకటన తీవ్ర విమర్శలకు దారితీసింది. యూఎఫ్ఓలు లేదా గ్రహాంతర జీవుల ఉనికిని నిరూపించే భౌతిక ఆధారాలు లభించలేదని అమెరికా ప్రభుత్వం గతంలో వెల్లడించింది. గుర్తించలేని ఆకాశ వస్తువులు, వింత జీవులపై కొందరు రాజకీయ నాయకులు, మాజీ సైనిక అధికారులు, ఇతరులు ఆసక్తి చూపుతూనే ఉన్నారు. అమెరికా-మెక్సికో సరిహద్దులో కనిపించినట్లు చెబుతున్న ఈ జీవి ఏంటనేది ప్రస్తుతం మిస్టరీగా ఉంది. అది కొత్త జాతికి చెందిన జంతువా? తెలిసిన జంతువేనా? లేక ప్రచారంలో చెబుతున్నట్లు మరేదైనా ప్రత్యేకమైన జీవా?