
ఒక వీడియోలో పాయింట్ 177 కాలిబర్ ఉన్న ఎయిర్ పిస్టల్‌ను చూపిస్తూ.. మహిళలు పిస్టల్‌ను ఎలా వాడాలో శిక్షణ తీసుకోవాలని ఆమె సూచించారు. షూటింగ్ రేంజ్‌లో ప్రాక్టీస్ చేయాలని కూడా చెప్పారు. అయితే ఇక్కడే మరో ప్రశ్న మొదలైంది. మహిళలు తమ భద్రత కోసం గన్ చేతిలో పెట్టుకోవడం నిజంగా పరిష్కారమా?
లేక అది మరో ప్రమాదానికి దారితీస్తుందా?
ఇటీవల మహిళలు, బాలికలపై వేధింపులు, లైంగిక దాడుల ఘటనలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఖుష్బూ పటానీ ఓ వీడియోను షేర్ చేశారు. మహిళలు తమ భద్రత విషయంలో ఇతరులపై పూర్తిగా ఆధారపడకూడదని.. ఆత్మరక్షణకు అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవాలని ఆమె సందేశం ఇచ్చారు. అయితే వీడియోలో ఆమె చూపించినది సాధారణ తుపాకీ కాదు. CO2తో పనిచేసే ఎయిర్ పిస్టల్. ఇది సంప్రదాయ తుపాకీలా గన్‌పౌడర్‌తో నిండిన బుల్లెట్లు పేలవు. CO2 గ్యాస్ సహాయంతో బుల్లెట్ల స్థానంలో పెల్లెట్లు దూసుకుపోతాయి.
ఎయిర్ గన్‌లో సంప్రదాయ తుపాకీ బుల్లెట్ లేకపోయినా.. దాని నుంచి వెలువడే ప్రాజెక్టైల్ తీవ్రంగా గాయపరుస్తుంది. ముఖ్యంగా సరైన శిక్షణ లేకుండా ఉపయోగించడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఖుష్బూ పటానీ వీడియోపై కొందరు మాజీ సైనిక అధికారులు, రక్షణ నిపుణులు కూడా విమర్శలు చేశారు. ముఖ్యంగా ట్రిగ్గర్ డిసిప్లిన్, అంటే తుపాకీని పట్టుకున్నప్పుడు ట్రిగ్గర్ విషయంలో పాటించాల్సిన ప్రాథమిక భద్రతా నియమాలపై ప్రశ్నలు వచ్చాయి.
రక్షణ నిపుణుడు, రిటైర్డ్ వింగ్ కమాండర్ పుష్కల్ విజయ్ ద్వివేది ఈ సూచనను తీవ్రంగా విమర్శించారు. మరో రిటైర్డ్ మేజర్ మాణిక్ ఎం. జాలీ కూడా మహిళలు ఎయిర్ పిస్టల్‌పై ఆధారపడటంపై హెచ్చరికలు చేశారు.
Actress Disha Patani Sister Is Major Khushboo Patani
చేతిలో ఆయుధం ఉందనే భావన మహిళకు కొంత ధైర్యాన్ని ఇవ్వొచ్చు. కానీ అత్యవసర పరిస్థితిలో భయం, ఆందోళన, గందరగోళం మధ్య దాన్ని ఎలా వాడాలి అన్నది సరిగ్గా తెలియకపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు..మహిళ వద్ద ఆయుధం కనిపిస్తే ఎదుటి వ్యక్తి ప్రవర్తన ఎలా మారుతుందో కూడా ముందుగా చెప్పలేం అంటున్నారు.
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. భారతదేశంలో అన్ని ఎయిర్ గన్స్‌కు ఒకే రకమైన నిబంధనలు వర్తించవు. Arms Rules, 2016 ప్రకారం.. మజిల్ ఎనర్జీ 20 జూల్స్ కంటే ఎక్కువ లేదా బోర్ 0.177 అంగుళాలు అంటే 4.5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ ఉన్న కొన్ని ఎయిర్ వెపన్స్‌కు లైసెన్స్ అవసరం. ఈ పరిమితుల కంటే తక్కువగా ఉన్న ఎయిర్ వెపన్స్‌కు ఆయుధ లైసెన్స్ అవసరం లేకపోయినా.. వాటి విక్రయం, కొనుగోలు విషయంలో నిబంధనలు ఉన్నాయి. అధీకృత ఎయిర్-వెపన్ డీలర్ల ద్వారా విక్రయం జరగాలి. కొనుగోలుదారుడి గుర్తింపు, నివాస వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఎయిర్ పిస్టల్ కు ఎలాంటి చట్టపరమైన నిబంధనలు ఉండవు అనుకోవడం సరైంది కాదు.
ఖుష్బూ పటానీ చెప్పిన అసలు ఉద్దేశం..మహిళలు తమ భద్రత విషయంలో మరింత స్వయం ఆధారితంగా ఉండాలన్నది. ఆ ఆలోచనపై చర్చ జరగొచ్చు.
కానీ ఆత్మరక్షణ అంటే కేవలం ఆయుధం పట్టుకోవడం మాత్రమే కాదు. పరిస్థితిని ముందుగానే గుర్తించడం, ప్రమాదకర ప్రదేశాలను నివారించడం, అత్యవసర సమయంలో సహాయం కోరడం, చట్టపరమైన మార్గాలపై అవగాహన, అవసరమైన ఆత్మరక్షణ శిక్షణ వంటి అంశాలు అందులో భాగమే. ఇక బహిరంగ ప్రదేశాల్లో భద్రత విషయంలో వ్యవస్థల బాధ్యత కూడా కీలకం. ఇటీవల ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో నమోదైన అత్యాచార ఘటనలను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వ యంత్రాంగం పై ఉన్నప్పుడు వారేం చేస్తున్నారని కోర్టు సీరియస్ అయింది.
మహిళలు సురక్షితంగా ఉండటానికి తమ వెంట ఒక గన్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు రావాలి? ఆత్మరక్షణ కోసం మహిళలు సిద్ధంగా ఉండాలి అన్న సందేశం ఒక వైపు… ఆ ఆయుధాన్ని ఎలా, ఎప్పుడు, ఎంత బాధ్యతగా నిర్వహించాలన్న ప్రశ్న మరోవైపు…ఖుష్బూ పటానీ వీడియో ఈ రెండు అంశాలపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. మహిళలకు భద్రత ఉన్న వాతావరణం కల్పించడం కుటుంబం, సమాజం, పోలీసులు, ప్రభుత్వ వ్యవస్థల బాధ్యత.