
శనివారం రాత్రి రెస్టారెంట్ పని ముగించుకుని సుప్రియ తన స్నేహితురాలితో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. దారిలో వారి కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు సుప్రియ అక్కడికక్కడే మృతి చెందారు. ఆమెతో ఉన్న స్నేహితురాలు తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై అమెరికా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఐదేళ్ల క్రితం సుప్రియకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కొడుమూరి రంజిత్‌తో వివాహం జరిగింది. ఈ దంపతులకు రెండున్నరేళ్ల కుమారుడు ఆదిత్య ఉన్నాడు. అమ్మ ఇక తిరిగి రాదనే విషయం కూడా అర్థం కాని వయసులో ఆ చిన్నారి తల్లిని కోల్పోయాడు. సుప్రియ మృతితో అమెరికాలోని ఆమె పరిచయస్తులు, స్వగ్రామంలోని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
సుప్రియ మృతి వార్త తెలియగానే మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఉంటున్న ఆమె తల్లిదండ్రులు అలాగే అత్తమామలు తీవ్ర షాక్‌కు గురయ్యారు. తమ కుమార్తె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సహాయం చేయాలని సుప్రియ తండ్రి దారం శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ‘తీవ్ర విషాదంలో ఉన్నాం. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. మా కుమార్తె మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం సహాయం చేయాలి’ అని కోరారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలకు అమెరికా అధికారుల నుంచి ఫోన్ కాల్ వస్తుందని వేచి చూస్తున్నారు. సుప్రియ మృతదేహాన్ని భారత్‌కు తరలించే ఏర్పాట్లపై సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు. అమెరికాలో జరిగిన ఈ ప్రమాదం ఓ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. రెండున్నరేళ్ల చిన్నారి తల్లిని కోల్పోగా.. భారత్ లో తల్లిదండ్రులు తమ కుమార్తెను కడసారి చూసేందుకు ఎదురుచూస్తున్నారు.
సుప్రియ కుమారుడు ఆదిత్య భవిష్యత్తు కోసం కుటుంబ సభ్యులు అమెరికాలో GoFundMe ద్వారా విరాళాల సేకరణ ప్రారంభించారు. తల్లి లేని లోటును తీర్చలేకపోయినా చిన్నారి చదువు, వైద్యం, రోజువారీ అవసరాలకు ఆర్థికంగా అండగా నిలవాలని కోరుతున్నారు. రెండున్నరేళ్ల చిన్నారి ఆదిత్యకు తన తల్లి ఇక తిరిగి రాదన్న విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకునే వయసు కూడా లేదు. ఇంతటి విషాదాన్ని అర్థం చేసుకోలేనంత చిన్న వయసులోనే అతడు తల్లిని కోల్పోయాడు. రాబోయే రోజుల్లో సుప్రియ కుటుంబ సభ్యులు.. ఆమె తన కుమారుడిని ఎంతగా ప్రేమించిందో అతడికి తెలియజేస్తూ, తల్లి జ్ఞాపకాలను అతడికి ఎప్పటికీ దగ్గరగా ఉంచేందుకు ప్రయత్నిస్తారని గోఫండ్‌మీ పేజీలో రాసుకొచ్చారు. ఎంత సహాయం చేసినా సుప్రియను తిరిగి తీసుకురాలేం. ఆమె ఇచ్చే ప్రేమ, ఆప్యాయతకు ఏదీ ప్రత్యామ్నాయం కాదు. అయితే ప్రతి ఒక్కరి చిన్న సహాయం.. రాబోయే సంవత్సరాల్లో ఆమె కుమారుడు ఆదిత్యకు అండగా నిలిచేలా, అతడి అవసరాలను తీర్చేలా ఉపయోగపడుతుందని పేజీలో పేర్కొన్నారు.